రియల్ బాహుబలి సీన్ శ్రీలంకలో.. వీడియో చూడాల్సిందే

Update: 2022-07-14 06:30 GMT
ప్రజల చేత.. ప్రజల కొరకు.. ప్రజలు ఎన్నుకునే ప్రజా ప్రభుత్వాలే ప్రజాస్వామ్యానికి నిదర్శనాలుగా పుస్తకాల్లో చదువుకుంటాం. వాస్తవంగా చూస్తే.. ప్రజల్ని తమ చేతికి అధికారం ఇచ్చేలా చేసే కొందరు రాజకీయ అధినేతలు ఇవాల్టి రోజున ప్రజాస్వామ్యాన్ని ఏలటమే కాదు.. ప్రజాస్వామ్య పరిరక్షకులుగా నిలుస్తున్నారు.

ఇలాంటి వారి కారణంగా పరిస్థితులు ఇప్పుడెలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాల్ని ఎన్నుకునే ప్రజలు.. ప్రభుత్వాధినేతల్ని దించేసే రోజులు ఇటీవల కాలంలో బాగా తగ్గిపోయాయి. ఇలాంటివేళ.. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో చోటు చేసుకునే పరిణామాలు.. ప్రజా వ్యతిరేక పాలకులకు ఒక హెచ్చరికలుగా మారుతున్నాయి.

తన విధానాలతో శ్రీలంక ఆర్థిక పరిస్థితిని ముంచేసి.. ప్రజల్ని వీధుల్లోకి వచ్చేలా చేసిన ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేను  ప్రజలు ఏ రీతిలో దించేశారో తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

ఆయన స్థానంలో పగ్గాలు చేపట్టిన తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే కూడా గద్దె దిగాలని డిమాండ్ చేస్తున్నారు. దేశాధ్యక్షుడు దేశం విడిచి పారిపోయిన నేపథ్యంలో.. కట్టలు తెగిన ప్రజాగ్రహం.. అరుదైన సన్నివేశానికి కారణమైంది.

కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించే సీన్ ఒకటి.. తాజాగా శ్రీలంకలో చోటు చేసుకుంది. రాజమౌళి బాహుబలిలో చూపించిన సీన్ లాంటిదే రియల్ గా.. లంక ప్రజల కారణంగా చోటు చేసుకోవటమే కాదు.. బాష్పవాయు గోళాలు..జల ఫిరంగులను లెక్క చేయకుండా కట్టలు తెగిని కోపం.. ప్రధాని కార్యాలయంలోకి దూసుకెళ్లేలా చేసింది. ప్రధాని కార్యాలయానికి రక్షణగా నిలిచిన తలుపుల్ని.. పెద్ద దుంగను పట్టుకొని.. తలుపుల్ని బలంగా మోదటం ద్వారా లోపలకు వెళ్లే ప్రయత్నం చేశారు. గేటు తెరిచేందుకు వారు వ్యవహరించిన తీరు రీల్ బాహుబలి సీన్ రియల్ గా చోటు చేసుకున్నట్లైంది.

వందలాది మంది కలిసి పెద్ద చెట్టు దుంగను పట్టుకొని.. బలంగా తలుపుల్ని మోదటం.. ఆ దెబ్బకు తలుపులు బద్దలై.. లోపలకు వెళ్లిపోయారు. కొలంబోలోని ప్రధాని కార్యాలయంలోకి దూసుకెళ్లిన నిరసనకారులు భవనం పైకి చేరుకొని జెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం ఇసుక వేస్తే రాలనంతగా జనం కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. నిరసనలు హద్దు మీరుతున్న వైనాన్నిగమనించిన లంక న్యూస్ చానళ్లు.. తమ ప్రసారాల్ని కాసేపు ఆపేయటం గమనార్హం. ఏమైనా.. రీల్ సీన్ రియల్ గా చోటు చేసుకోవటం అరుదైన ఉదంతంగా చెప్పొచ్చు.
Full View

Tags:    

Similar News