కరోనా ఎఫెక్ట్.. హైదరాబాదీ ‘రియల్’ ఢమాల్

Update: 2020-07-29 02:30 GMT
ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి దాదాపుగా అన్ని రంగాలను కోలుకోలేని దెబ్బ కొట్టేసింది. ఈ క్రమంలో స్థిరాస్తి రంగం కూడా కరోనా దెబ్బకు కుదేలైపోయింది. ఇక తెలుగు రాష్ట్రాల రియల్ ఎస్టేట్ రంగానికి కేంద్ర బిందువుగా కొనసాగుతున్న హైదరాబాద్ లోనూ రియల్ ఎస్టేట్ భారీగా దెబ్బ తినింది. ఎంతగానంటే... గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో హైదరాబాద్ స్థిరాస్తి రంగం ఏకంగా 86 శాతం మేర పడిపోయింది. కరోనాకు ముందే కట్టేసిన ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్కరూ కూడా ముందుకు రావడం లేదట. కరోనా దెబ్బకు రియల్ రంగం ఈ రీతిన దెబ్బతిన్నా... స్థిరాస్తి ధరలు మాత్రం తగ్గకపోగా.. మరింతగా పెరిగిన వైనం ఈ రంగానికి ఓ మోస్తరు ఊరటేనని చెప్పక తప్పదు.

ఈ మేరకు రియల్ ఎస్టేట్ రంగం రూపురేఖలు కరోనా దెబ్బకు ఏ రీతిన దెబ్బతిన్నతిన్నాయన్న వైనంపై రియల్ ఎస్టేట్ బ్రొోకరేజీ సంస్థ ‘ప్రాప్ టైగర్’.. ‘రియల్ ఇన్ సైట్-క్యూ2 2020’ పేరిట ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం హైదరాబాద్ లో ఏప్రిల్-జూన్ 2020 త్రైమాసికంలో రియల్ ఎస్టేట్ రంగం 86 శాతం మేర కుదేలైపోయింది. అంతకుముందు ఏడాది ఏకంగా 8,122 యూనిట్లు అమ్ముడు కాగా.. ఈ ఏడాది కేవలం 1,099 మాత్రమే అమ్ముడయ్యాయి. ఇక జనవరి- జూన్ మధ్య కాలంలో ఈ తరుగుదల 62 శాతంగా నమోదు కాగా... 6,653 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే... ఏప్రిల్- జూన్ మాసాల మధ్యలో కరోనా దెబ్బకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయిందన్న మాట.

ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్ కతా, పుణే నగరాల్లోనూ రియల్ ఎస్టేట్ రంగం భారీ కుదుపునకు గురైందని సదరు నివేదిక వెల్లడించింది. జనవరి- జూన్ మాసాల మధ్య కాలంలో ఈ నగరాల్లో 52 శాతం మేర స్థిరాస్తి రంగం కుదేలైంది. ఈ నగరాలన్నింటిలోకి హైదరాబాద్ నగరంలోనూ ఈ రంగం భారీ కుదుపునకు గురైందని తేలింది. ఇక అమ్మకాలు భారీగా పడిపోయినా... ధరలు మాత్రం ఓ మోస్తరుగా పెరిగాయి. హైదరాబాద్ లో గతేడాదితో పోలిస్తే... 7 శాతం మేర ధరలు పెరిగాయట. అదే అహ్మదాబాద్ లో అయితే 6 శాతం మేర ధరలు పెరిగాయట. ధరలు పెరిగినా... కోనుగోళ్లు భారీగా తగ్గిపోవడంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మాత్రం భారీ పతనానికి గురైందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News