మ‌తంతో పెట్టుకున్నందుకే ఆప్ షాక్ తిందా?

Update: 2017-03-12 06:02 GMT
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ  పార్టీ త‌మ నాయ‌కుడైన కేజ్రీ చేష్ట‌ల కార‌ణంగానే న‌ష్ట‌పోయిందా? మ‌తాన్ని రెచ్చ‌గొట్టే, ఇబ్బంది పెట్టే చ‌ర్య‌ల వ‌ల్లే పంజాబ్‌ లో అధికారం ఖాయం అనుకున్న ద‌శ నుంచి మూడో స్థానానికి ప‌డిపోయిందా? అనే సందేహాల‌కు అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.  పంజాబ్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేజ్రీవాల్ ఫిబ్రవరి నెలలో దాదాపు 95 ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించిన సంగతి తెలిసిందే. అయితే ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ - సమాజ్‌ వాదీ పార్టీ (ఎస్పీ) - బీఎస్పీల కంటే ఆప్‌ ఎక్కువగా నష్టపోయింది. పంజాబ్‌ లో ఆప్ ఒడిని చేరినట్లే అనిపించినా ఫలితాలు మాత్రం మూడోస్థానానికి నెట్టేశాయి. సోషల్ మీడియా - స్థానిక యువత మద్దతుతో ప్రచారం చేసినా విజయాన్ని ఒడిసి పట్టలేకపోవడానికి గల ప్రధాన కారణాల్లో మ‌తం ఒక‌టి. ఖలిస్థాన్ వాదులు - ఇతర అతివాదులతో ఆప్ నేతలు అంటకాగడం హిందూ ఓటర్లకు నచ్చలేదు. పంజాబ్‌లో ఖలిస్థానీ ఉగ్రవాదం ముందుకొచ్చినప్పటి నుంచి హిందువులంతా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా నిలిచారు. ప్రారంభంలో ఆప్‌ కు సిక్కులు- హిందువులు మద్దతునిచ్చినా అతివాదులతో ఆ పార్టీ నేతల బుజ్జగింపు చర్యలతో హిందువుల్లో కీలక వర్గాలు దూరమయ్యాయి.

అదే స‌మ‌యంలో ఆప్ అంతర్గత అసమ్మతి మ‌రో కార‌ణంగా చెప్తున్నారు. పంజాబ్ ఆప్ శాఖలో ప్రముఖ నాయకుడిగా ఉన్న సుచాసింగ్ చౌటెపూర్ పార్టీని వీడిన తర్వాతా ఛోటామోటా నాయకులంతా అదే బాటలో పయనించినా నాయకత్వం పట్టించుకోలేదు. బయటకు వెళ్లేవారి కంటే వచ్చేవారే ఎక్కువని భ్రమ పడింది. దీనికి తోడు రెబెల్స్ బెడద కూడా ప్రతికూల ఫలితాలకు కారణమని భావిస్తున్నారు. పార్టీ కార్యకలాపాలు ఢిల్లీలో కేంద్రీకరించడం మరో కారణం. స్థానిక నాయకుడు సుఖ్‌ పాల్‌ సింగ్ ఖైరాకు ప్రచారం చేసుకునే వెసులుబాటు కల్పించలేదు. కొత్త పార్టీ ఎదగడానికి రాష్ట్రమంతా నాయకులు అవసరమన్న సంగతిని విస్మరించి.. భగవత్ మాన్‌ తోనే రాష్ట్రమంతా పర్యటనకు ఆప్ నాయకత్వం అనుమతించడంతో ఆప్ గెలిస్తే.. బయటి వ్యక్తు ల ఆధిపత్యం పెరిగిపోతుందన్న భావోద్వేగాలు పంజాబీల్లో పెరిగిపోయాయి.  పంజాబ్ రాష్ట్ర రాజకీయాలు మాల్వా - డోబా - మాజ్హా ప్రాంతాలపై ఆధారపడి ఉంటాయి. తొలి నుంచి చివరి వరకు మాల్వా ప్రాంతంపై దృష్టిని కేంద్రీకరించిన ఆప్.. మిగతా ప్రాంతాలను పట్టించుకోలేదు. డోబా - మాజ్హా ప్రాంతాలు తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు. కాంగ్రెస్ సంప్రదాయ ఓటింగ్‌ను చీల్చేందుకు ఆప్ ఏ మాత్రమూ ప్రయత్నించకపోవడం ఆ పార్టీని దెబ్బతీసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

పంజాబ్,గోవా ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయని ఆప్ అధినేత - ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఎన్నికల ఫలితాల్లో ఎందుకు ఇలా జరిగిందో పరిశీలించుకుంటామన్నారు. పంజాబ్‌ లో కాంగ్రెస్ 59 స్థానాల్లో విజయం సాధించగా, ఆప్ 22 సీట్లతో సరిపెట్టుకున్నది. ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం, కానీ సమస్యలపై తమ పోరు కొనసాగుతుందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. పంజాబ్, గోవా ఎన్నికల్లో విజయం కోసం ఆప్ కార్యకర్తలు చాలా కష్టపడ్డారని ఆయన పేర్కొన్నారు. పంజాబ్ - గోవా ఎన్నికల్లో పార్టీ బలహీన ప్రదర్శనను పరిశీలించుకుంటామని ఆప్ నేతలు అశుతోష్ - కపిల్ మిశ్రా అన్నారు. ఆ రెండు రాష్ర్టాల్లో ఫలితాలు ఈ విధంగా వస్తాయని ఊహించలేదని వారు చెప్పారు. ఎన్నికల్లో గెలుపు, ఓటమి సహజమని మరో ఆప్ నేత కుమార్ విశ్వాస్ అన్నారు. ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన ఆప్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా పంజాబ్ కాంగ్రెస్ నేతలు, యూపీ బీజేపీ నేతలకు అభినందనలు తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News