అక్బరుద్దీన్ నిప్పులు చెరిగింది అందుకేనంట

Update: 2015-09-30 05:04 GMT
తెలంగాణ అధికారపక్షానికి అనధికార మిత్రపక్షంగా వ్యవహరిస్తూ దన్నుగా నిలిచే మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరగటం తెలిసిందే. తెలంగాణ అధికారపక్షం నోట మాట రానట్లుగా కాసేపు ఉండిపోవటం.. చివరకు అక్బరుద్దీన్ కారణంగా డ్యామేజ్ భారీగా జరుగుతుందని భావించి మంత్రి కేటీఆర్ కల్పించుకొని అక్బరుద్దీన్ మీద ఎదురుదాడి చేసినా భంగపాటు తప్పలేదు.

అక్బరుద్దీన్ అంతలా రియాక్ట్ కావటానికి కారణం ఏమిటి? తెలంగాణ అధికారపక్షాన్నికి సభలో సినిమా చూపించిన ఆయన.. సభ బయట సన్నిహితులు.. మీడియా ప్రతినిధుల దగ్గర తాను అంతగా చెలరేగిపోవటానికి కారణం చెప్పుకొచ్చారు.

మృత్యుముఖం వరకూ వెళ్లి వచ్చిన తనకు చనిపోయిన రైతు కుటుంబం బాధ ఎలా ఉంటుందో తెలుసని.. తాను రైతును కాకున్నా మనిషినని ఆయన వ్యాఖ్యానించారు. చావు అంటే ఏమిటో.. దాని దగ్గర వరకూ వెళ్లి వచ్చిన తనకు.. ఇంటి పెద్దకు ఏదైనా ఆపద సంభవిస్తే వారి కుటుంబ సభ్యులు ఎంతటి క్షోభను అనుభవిస్తారో తనకు తెలుసన్నారు. ‘‘నేను మృత్యుముఖంలోకి వెళ్లినప్పుడు నా భార్యాపిల్లలు.. నాపై ఆధారపడ్డ వారు పడ్డ క్షోభ నా కళ్లతో నేను చూశా. అలాంటి క్షోభ ఎవరికీ రావొద్దు’’ అంటూ చెప్పుకొచ్చారు. చూస్తుంటే రైతుల ఆత్మహత్యల్ని అక్బరుద్దీన్ పర్సనల్ గా చూసినట్లు కనిపించట్లేదు.
Tags:    

Similar News