బాబుతో భేటీకి... అశోక్ ఎందుకు రాలేదో?

Update: 2018-02-05 05:20 GMT
పూస‌పాటి అశోక్ గ‌జ‌ప‌తిరాజు... టీడీపీలో తొలి త‌రం నేత కిందే లెక్క. స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా అశోక్ గ‌జ‌ప‌తి రాజు పార్టీలో కీల‌క భూమిక పోషిస్తూ వ‌స్తున్నారు. త‌న సొంత జిల్లా విజ‌యన‌గరంలో పార్టీకి పెద్ద దిక్కుగానూ పూస‌పాటి వ్య‌వ‌హ‌రిస్తోంది. రాజ వంశానికి చెందిన రాజుగారు... త‌న కుటుంబంపై ఉన్న పెద్ద దిక్కు బాధ్య‌త‌ను నిర్వ‌ర్తిస్తూనే.. ఇటు రాజ‌కీయాల్లో కీల‌క భూమిక పోషిస్తున్నారు. ఇప్ప‌టికే రాజు గారి కుటుంబం చాలా ఆల‌యాల‌కు ధ‌ర్మ‌క‌ర్త‌గా ఉంది. అశోక్ సోద‌రుడు ఆనంద గ‌జ‌ప‌తి రాజు బ‌తికున్న కాలంలో ఆల‌యాల వ్య‌వ‌హ‌రాల‌న్నీ ఆయ‌న చూసుకోగా... అశోక్ మాత్రం ఇత‌ర వ్య‌వ‌హారాలు చూసుకునేవారు. ఓ మూడేళ్ల క్రితం ఆనంద గ‌జ‌ప‌తిరాజు చ‌నిపోయిన త‌ర్వాత అప్ప‌టిదాకా ఆయ‌న నిర్వ‌హిస్తున్న బ‌రువు బాధ్య‌త‌ల‌న్నీ అశోక్‌ పైనే ప‌డిపోయాయి. అయినా కూడా రాజ‌కీయాల‌కు ఏమాత్రం దూరం జ‌ర‌గ‌ని అశోక్‌... త‌న సోద‌రుడి బాధ్య‌త‌ల‌తో పాటుగా రాజ‌కీయాల్లోనూ క్రియాశీల‌కంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్పాలి. మొన్న‌టిదాకా ఎమ్మెల్యేగానే పోటీ చేస్తూ వ‌చ్చిన అశోక్‌... టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వ‌చ్చినా కీల‌క శాఖ‌ల మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించేవారు. మిస్ట‌ర్ క్లీన్ ఇమేజీతో ఉన్న అశోక్ కేబినెట్ లో ఉండ‌టం టీడీపీకి మొద‌టి నుంచి క‌లిసివ‌స్తుంద‌నే చెప్పాలి. ఎలాంటి ఆరోప‌ణ‌ల‌కు తావు ఇవ్వ‌కుండా వ్య‌వ‌హ‌రించే రాజు వ‌ల్ల త‌మ ప్ర‌భుత్వ ప్ర‌తిష్ఠ పెరుగుతుంద‌ని భావించిన ఎన్టీఆర్‌ - చంద్ర‌బాబు... ఎప్పుడు అధికారం చిక్కినా అశోక్‌ కు కేబినెట్ బెర్తు ఖాయ‌మే.

అయితే గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో అసెంబ్లీ సీటును వ‌దిలి పార్ల‌మెంటుకు వెళ్లిన అశోక్‌... ఎన్టీఏలో కీల‌క భాగ‌స్వామిగా ఉన్న టీడీపీ త‌ర‌ఫున కేంద్ర మంత్రి ప‌ద‌వి కొట్టేశారు. గ‌తంలోనూ బీజ‌పీ నేతృత్వంలో ఏర్ప‌డ్డ కేంద్ర కేబినెట్‌ లో టీడీపీకీ అవ‌కాశాలు ద‌క్కినా... ఇప్పుడు అశోక్ ఇమేజీ కార‌ణంగానే కీల‌క‌మైన కేంద్ర పౌర విమానయాన శాఖ ప‌ద‌వి టీడీపీకి ద‌క్కింద‌ని చెప్పాలి. విమాన‌యాన శాఖ‌ను స‌రికొత్త పుంత‌లు తొక్కిస్తున్న అశోక్... త‌న‌దైన రీతిలో వ్య‌వ‌హ‌రిస్తూ ప్ర‌యాణికుల సౌక‌ర్యం నిమిత్తం చాలా సంస్క‌ర‌ణలే తీసుకువ‌చ్చారు. ఇదంతా అంద‌రికీ తెలిసిందేగా? ఇప్పుడు ప్ర‌త్యేకించి అశోక్ గురించి ప్ర‌స్తావ‌న ఎందుకంటారా? త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌స్తావించుకోవాల్సందే. ఎందుకంటే మొన్న‌టి కేంద్ర బ‌డ్జెట్‌ లో ఏపీకి అర‌కొర కేటాయింపులు చేసిన న‌రేంద్ర మోదీ స‌ర్కారు.. ఏపీకి న్యాయంగా ద‌క్కాల్సిన కేటాయింపుల‌పైనా శీత‌క‌న్నేసింది. దీనిపై మిత్ర‌ప‌క్షంగా ఉన్న టీడీపీనే గ‌ళం విప్పింది. మొన్న‌టి బ‌డ్జెట్ ప్ర‌సంగం పూర్తి కాగానే హ‌డావిడిగా టీడీపీ ఎంపీల‌తో టెలి కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన చంద్ర‌బాబు... నిన్న ఉద‌యం పార్టీ పార్ల‌మెంట‌రీ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. పార్టీ ప‌రంగా అత్యంత కీల‌కమైన ఈ స‌మావేశానికి పార్టీ త‌ర‌ఫున ఎంపీలుగా ఉన్న‌వారంతా హాజ‌ర‌య్యారు. అయితే అశోక్ గ‌జ‌ప‌తిరాజుతో పాటు సీఎం ర‌మేశ్ ఈ భేటీకి హాజ‌రు కాలేదు. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న సీఎం ర‌మేశ్‌.. చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితులే. ఏవో వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల తాను స‌మావేశానికి రాలేక‌పోతున్నాన‌ని ఆయ‌న చంద్ర‌బాబుకు స‌మాచారం చేర‌వేసే ఉంటార‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇప్పుడు వ‌చ్చిన స‌మ‌స్య అంతా అశోక్ గ‌జ‌ప‌తి రాజు గైర్హాజ‌రీ గురించే. ఎందుకంటే పార్టీలో సీనియ‌ర్ నేత‌గా, పార్టీ త‌ర‌ఫున కేంద్ర కేబినెట్‌ లో కీల‌క శాఖ మంత్రిగా ఉన్న అశోక్‌... విజ‌య‌న‌గ‌రంలోనే ఉండి ఈ స‌మావేశానికి హాజ‌రు కాలేద‌ట‌. కొద్ది రోజుల ముందుగా చైనా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ఆయ‌న శ‌నివారం రాత్రే విజ‌య‌న‌గ‌రం చేరుకున్నారు. అయినా కూడా ఆదివారం ఉద‌యం 10 గంట‌ల త‌ర్వాత జ‌రిగిన భేటీకి మాత్రం ఆయ‌న హాజ‌రు కాలేదు. ఈ నేప‌థ్యంలో నిన్న అశోక్ గైర్హాజ‌రీపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించాయి. ఇటీవ‌లి కాలంలో చంద్ర‌బాబు వ్య‌వ‌హారంతో అశోక్ చాలా విసుగు చెందార‌ని, ఏ విష‌యంలోనూ ఆయ‌న పార్టీకి అంటీ ముట్ట‌న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో టీడీపీ వ్వ‌వ‌హ‌రిస్తున్న తీరు ప‌ట్ల కూడా ఆయ‌న ఒకింత ఆగ్ర‌హంగానే ఉన్న‌ట్లుగా స‌మాచారం. ఈ కార‌ణంగానే మొన్నామ‌ధ్య విశాఖ ఎయిర్ పోర్టులో టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి సిబ్బంది ప‌ట్ల అనుచితంగా వ్వ‌వ‌హ‌రించిన సంద‌ర్భంగా సిబ్బంది ప‌క్ష‌మే వ‌హించిన అశోక్‌.. జేసీపై నిషేధం విధిస్తున్నా చూసీ చూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హరించార‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. ఆ ఘ‌ట‌న జ‌రిగిన సంద‌ర్భంగా ఎయిర్ పోర్టులోనే ఉన్న అశోక్‌... జేసీని ప‌క్క‌కు తీసుకుపోయారే త‌ప్పించి త‌మ పార్టీ ఎంపీ ప‌ట్ల ఇలా వ్య‌వ‌హ‌రిస్తారా? అని సిబ్బందిని ఆయ‌న సింగిల్ మాట కూడా అన‌లేదు. పార్టీ వ్య‌వ‌హార స‌ర‌ళి, ముఖ్యంగా అధినేత చంద్ర‌బాబు తీరుపైనా అశోక్ అసంతృప్తిగానే ఉన్న‌ట్లుగా స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న నిన్న‌టి భేటీకి రాలేద‌ని, ఏదో చైనా ప‌ర్య‌ట‌న నుంచి తాను ఇప్పుడే వ‌చ్చాన‌ని, స‌మావేశానికి రాలేక‌పోతున్నాన‌ని స‌మాచారం ఇచ్చార‌ని టీడీపీ చెబుతున్నా... అందులో నిజం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.

Tags:    

Similar News