బెంగ‌ళూరు విలాపానికి అస‌లు కార‌ణాలివేనా?

Update: 2022-09-10 01:30 GMT
ప్ర‌స్తుతం కురుస్తున్న భారీ వ‌ర్షాల ధాటికి సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన బెంగ‌ళూరు చిగురాకుటాకులా వ‌ణుకుతున్న సంగ‌తి తెలిసిందే. భారీ వ‌ర్షాల‌తో బెంగ‌ళూరు న‌గ‌రం నీట‌మునిగింది. ఐటీ కంపెనీల‌కు కొన్ని వంద‌ల కోట్ల రూపాయ‌లు న‌ష్టం వాటిల్లింది. చివ‌ర‌కు ఏడాదికి కోట్ల రూపాయ‌లు జీతాలు తీసుకుంటున్న కంపెనీల సీఈవోలు కూడా ట్రాక్ట‌ర్ల‌పైన‌, జేసీబీల‌పైన ప్ర‌యాణించాల్సి వ‌చ్చింది. కోట్లాది రూపాయ‌ల విలువైన విల్లాల‌ను వ‌ర‌ద నీటిలో వ‌దిలిపెట్టేసి స్టార్ హోట‌ళ్ల‌కు ప‌రుగులెత్తాల్సి వ‌చ్చింది. మ‌రోవైపు ఈ దుస్థితికి మీరు కార‌ణ‌మంటే మీరు కార‌ణ‌మ‌ని య‌థాలాపంగా అధికార బీజేపీ, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీలు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయి.

ప్రకృతిని సంర‌క్షించుకోక‌పోవ‌డ‌మే ఈ వరద ముంపునకు కారణమని పర్యావరణవాదులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వర్షంతో జలమయమైన బెంగళూరులోని లేఔట్లు గతంలో పొలాలు, చెరువులు, అచ్చుకట్ట ప్రాంతాలు, చిట్ట అడవులతో కూడుకున్న ప్రదేశాలు కావ‌డం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెబుతున్నారు. గత పది, ఇరవై ఏళ్లలో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో భారీఎత్తున లేఔట్లు, కట్టడాలు, రోడ్లు నిర్మించార‌ని విమ‌ర్శిస్తున్నారు. అభివృద్ధి పేరుతో ప‌ర్యావ‌ర‌ణాన్ని విధ్వంసం చేయ‌డంతో ఇప్పుడు ఇవి కుండపోత వర్షాలకు చెరువుల్లా తయారయ్యాయ‌ని అంటున్నారు.

ప్రధానంగా బెల్లందూరు, వర్తూరు, విభూతిపుర, సావళచెరువు, బేగూరు చెరువు చుట్టుపక్కల లేఔట్లు ప్రస్తుతం భారీ వర్షాలతో జలంలో చిక్కుకున్నాయి. ఈ చెరువుల విస్తీర్ణం గత 40 ఏళ్లతో పోలిస్తే సగానికి సగం తగ్గిపోయింది. ఈ చెరువులకు వెళ్లే రాజ కాలువలపై కట్టడాలు వెలిశాయి. అక్రమ కట్టడాలను తొలగించాల్సిన ప్రభుత్వం సక్రమ పథకంతో అనుకూలం చేయడం ప్రకృతికి మంచి చేయదని పరిసరవాది యల్లప్పరెడ్డి విచారం వ్యక్తం చేశారు.

అస‌లు 400 ఏళ్ల క్రిత‌మే నాటి క‌న్న‌డ ప్ర‌భువు కెంపే గౌడ దూర దృష్టితో, ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌తో నిర్మిత‌మైన బెంగ‌ళూరు న‌గ‌రం ఇప్పుడు ఇలాంటి దారుణ స్థితిలో చిక్కుకోవ‌డానికి కార‌ణాలేమిటో తెలుసుకుంటే క‌ళ్లు బైర్లు క‌మ్మే వాస్తవాలు వెల్ల‌డ‌వుతాయ‌ని నిపుణులు అంటున్నారు.

బెంగ‌ళూరులో 50 ఏళ్ల క్రితం 837 చెరువులుంటే ప్ర‌స్తుతం 219 చెరువులే ఉన్నాయ‌ని చెబుతున్నారు. చెరువుల‌ను, కాలువ‌ల‌ను కూడా వ‌దిలిపెట్ట‌కుండా వాటిని పూడ్చేసి అక్ర‌మార్కులు నిర్మాణాల‌కు తెగ‌బ‌డ్డార‌ని, వేల సంఖ్య‌లో ఇలా అక్ర‌మ క‌ట్ట‌డాలు వెలిశాయ‌ని వివ‌రిస్తున్నారు.

బెంగ‌ళూరు నగరంలో పకడ్బందీగా ఉన్న రాజ కాలువల‌ను వారూ వీరూ అని తేడా లేకుండా ఆక్రమణలకు పాల్పడి ఇళ్లు, భవనాలు కట్టేశార‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. చెరువులను చదును చేసి లేఔట్లు నిర్మించడం వల్ల నైసర్గిక స్వరూపాలే మారిపోయాయ‌ని అంటున్నారు. మ‌రోవైపు ఉన్న కాసిన‌న్ని చెరువులు, కాలువ‌ల‌ను కూడా శుభ్రం చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల వాటిలో పూడిక‌ పెరిగిపోయింద‌ని చెబుతున్నారు. దీంతో వ‌ర్ష‌పు నీరు రోడ్లు, లోత‌ట్టు ప్రాంతాల్లోకి చొచ్చుకొచ్చింద‌ని పేర్కొంటున్నారు. దీంతో ప్ర‌స్తుత ప‌రిస్థితి త‌లెత్తింద‌ని చెబుతున్నారు.

ఒక‌ప్పుడు ఉన్న శూలె చెరువులో ఇప్పుడు ఫుట్‌బాల్‌ స్టేడియం ఉంది. అలాగే అక్కితిమ్మనహళ్లి చెరువును హాకీ స్టేడియంగా మార్చేశారు. సంపంగి చెరువు స్థానంలో కంఠీరవ స్పోర్ట్‌ కాంప్లెక్స్ ఏర్పాటైంది. ధర్మాంబుధి చెరువు.. కెంపేగౌడ బస్టాండుగా మార్చారు. చల్లఘట్ట చెరువు స్థానంలో కర్ణాటక గోల్ఫ్‌ మైదానం వెలిసింది.

అదేవిధంగా కోరమంగల చెరువు.. నేషనల్‌ గేమ్స్‌ కాంప్లెక్స్‌ మైదానంగా, సిద్దికట్టె చెరువు... కేఆర్ మార్కెట్‌గా, కారంజీ చెరువు.. గాంధీ బజార్‌గా, కెంపాబుధి చెరువు.. భూగర్భ డ్రైనేజీ సేకరణ ట్యాంక్‌గా మారిపోయాయి. నాగశెట్టిహళ్లి చెరువు స్థానంలో స్పేస్‌ డిపార్టుమెంట్ వెల‌సింది. కాడుగొండనహళ్లి చెరువులో అంబేడ్కర్‌ మెడికల్‌ కాలేజీ, దుమ్మలూరు చెరువులో బీడీఏ లేఔట్, మిల్లర్స్‌ చెరువులో గురునానక్‌ భవన్ ఏర్పాటు అయ్యాయ‌ని అంటున్నారు.

అలాగే సుభాష్‌ నగర చెరువు, కురబరహళ్లి చెరువు, కోడిహళ్లి చెరువు, సినీవాగిలు చెరువు,  మారేనహళ్లి చెరువులు నేడు నివాస ప్రాంతాలుగా మారాయ‌ని చెబుతున్నారు. శివనహళ్లి చెరువు.. క్రీడా మైదానం, బస్టాండుగా రూపాంతరం చెందాయ‌ని అంటున్నారు. చెన్నమన చెరువు.. స్మశానంగా, పుట్టేనహళ్లి చెరువు.. జేపీ నగర 6వ ఫేజ్గా, జక్కరాయనచెరువు.. క్రీడా మైదానంగా మారిపోయాయ‌ని పేర్కొంటున్నారు.

ప్రతి ఏడాది బెంగళూరు నగరాభివృద్ధి నిర్వహణ, అభివృద్ధి పనుల కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ వరద ముంపు సమస్యను తప్పించడం మాత్రం ప్ర‌భుత్వాల వ‌ల్ల కావ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏటా రూ. 20 వేల కోట్లను బెంగళూరు న‌గ‌రాభివృద్ధికి కేటాయిస్తున్న‌ప్ప‌టికీ ప్రజల సమస్యలు అలాగే ఉంటున్నాయ‌ని చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News