అందుకే బీజేపీ ఇంత‌గా ప్ర‌చారం చేస్తోందా!

Update: 2018-12-03 08:08 GMT
తెలంగాణ‌లో బీజేపీ ప్రాబ‌ల్యం అంతంత మాత్ర‌మే. రాష్ట్రంలో ఆ పార్టీకి పెద్ద‌గా కేడ‌ర్ లేదు. తాజా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 5-6 స్థానాల కంటే ఎక్కువ గెల్చుకునే అవ‌కాశ‌మే లేదు. ప్ర‌భుత్వ ఏర్పాటు గురించి క‌నీసం ఆలోచించ‌డం కూడా పొర‌పాటే. ఆ విష‌యం ఇత‌రుల కంటే బీజేపీ అధినాయ‌క‌త్వానికే ఎక్కువ తెలుసు. అయిన‌ప్ప‌టికీ బీజేపీ ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌చారంలో దూసుకెళ్తోంది. చాలా స్థానాల్లో ఓడిపోతామ‌ని తెలిసినా ప‌ట్టు విడ‌వ‌కుండా పోరాడుతోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అభ్య‌ర్థుల త‌ర‌ఫున ప్ర‌చారం నిర్వ‌హించేందుకు బీజేపీ హేమాహేమీల‌ను రాష్ట్రానికి ర‌ప్పిస్తోంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఇప్ప‌టికే ఓ సారి ప్ర‌చారం చేసి వెళ్లారు. సోమ‌వారం మ‌రోసారి రాష్ట్రానికి వ‌స్తున్నారు. పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా వారానికి రెండు సార్ల చొప్పున తెలంగాణ‌కు వ‌చ్చి వెళ్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఇక ఆదివారం నాడు యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ కూడా తెలంగాణ ఎన్నికల ప్ర‌చారానికి విచ్చేశారు.

మ‌రి ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌కాశాల్లేవ‌ని - 5-6 సీట్ల‌తోనే స‌రిపెట్టుకోవాల్సి వ‌స్తుంద‌ని తెలిసినా తెలంగాణ‌లో ప్ర‌చారానికి బీజేపీ ఎందుకింత ప్రాధాన్య‌మిస్తోంది? ఎందుకిలా పెద్ద పెద్ద నేత‌ల‌ను రాష్ట్రానికి ర‌ప్పిస్తోంది? అనే ప్ర‌శ్న‌లు ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతున్నాయి. ఇందుకు విశ్లేష‌కులు చాలా కార‌ణాల‌ను సూచిస్తున్నారు. అవేంటంటే.. తెలంగాణ‌లో ప్రజా కూట‌మి - టీఆర్ ఎస్ హోరాహోరీగా త‌ల‌ప‌డుతున్నాయి. హంగ్ ఏర్ప‌డే ప‌రిస్థితులు లేక‌పోలేదు. అదే జ‌రిగితే తాము సాధించే సీట్లు కీల‌క‌మ‌వుతాయ‌ని బీజేపీ భావిస్తోంది.

ఇక అన్నింటికంటే ముఖ్య‌మైన విష‌య‌మేంటంటే.. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ బ‌లంగా లేదు. క‌రెక్టే. అలాగ‌ని ఖాళీగా కూర్చుంటే క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌ప‌డ‌లేం క‌దా.. అందుకే ఇప్ప‌టి నుంచి ప‌ట్టుద‌ల‌తో కృషి చేస్తే కొన్నేళ్ల వ‌ర‌కైనా బ‌లంగా త‌యార‌వ్వొచ్చ‌న్న‌ది బీజేపీ అధినాయ‌క‌త్వం యోచ‌న‌ట‌. తెలంగాణ‌లో ముస్లింల జ‌నాభా అధికంగానే ఉంది. కాబ‌ట్టి ఇక్క‌డ మ‌త‌ప‌ర‌మైన కోణంలో హిందువుల ఓట్ల‌ను కొల్ల‌గొట్ట‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌ని బీజేపీ భావిస్తోంద‌ట‌. అందుకే ప్ర‌ధానంగా హిందూత్వాన్ని ప్ర‌చారం చేస్తూ యువ‌త‌ను ఆక‌ర్షిస్తోంద‌ట‌.ఆ ప్ర‌ణాళిక‌ల్లో భాగంగానే పెద్ద పెద్ద నేత‌ల‌ను బ‌రిలో దించుతోందంట‌. వ‌చ్చే ప‌దేళ్లలో తెలంగాణ‌లో బీజేపీ క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌మైన శ‌క్తిగా ఎద‌గాల‌న్న‌దే అమిత్ షా వ్యూహ‌మ‌ని ప‌లువురు చెబుతున్నారు.


Tags:    

Similar News