బీజేపీ 'టార్గెట్‌-9' వెనుక రీజ‌న్ ఇదీ..!!

Update: 2023-01-19 02:30 GMT
బీజేపీ ఢిల్లీలో రెండు రోజుల పాటు విస్తృత స్థాయి స‌మావేశాలు నిర్వ‌హించింది. ఈ రెండు రోజులు కూడా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఇంకెలాంటి ప‌నులూ పెట్టుకోకుండా పూర్తిస్థాయిలో త‌న స‌మ‌యాన్ని ఈసమావేశాల‌కే కేటాయించారు. ఇది ఒకింత ఆశ్చ‌ర్య‌క‌ర సంద‌ర్భం. ఎందుకంటే.. ప్ర‌ధాని ఏ కార్య‌క్ర‌మానికీ ఇంత స‌మ‌యం కేటాయించ‌లేదు. ఇలా వ‌చ్చి అలా వెళ్ల‌డ‌మో.. లేక త‌న ప‌నితాను చూసుకోవ‌డ‌మే చేస్తున్నారు. అలాంటిది ఏకంగా.. ఆరు నుంచి 8 గంటల పాటు తాజాగా జ‌రిగిన బీజేపీ విస్తృత స్తాయి స‌మావేశాల‌కు ఆయ‌న స‌మ‌యం కేటాయించారు.

అంతేకాదు.. తొలిరోజు జ‌రిగిన స‌మావేశంలోనే ఆయ‌న ప‌క్కాగా టార్గెట్ పెట్టేశారు. అదే 'టార్గెట్-9'!! దీనిపై ప్ర‌ధాని సోదాహ‌రణంగా పార్టీ నేత‌ల‌కు విన్న‌వించారు. తెలంగాణ స‌హా.. ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న మొత్తం 9 రాష్ట్రాల ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం ద‌క్కించుకుని తీరాల‌ని ఘంటా ప‌థంగా బ‌ల్ల‌గుద్ది మ‌రీ నిర్దేశించారు. ''ఎలా చేయాల‌నేది త‌ర్వాత‌.. ఏం చేయాల‌నేది ముఖ్యం. తెలంగాణ స‌హా 9 రాష్ట్రాల్లో బీజేపీ జెండా రెప‌రెప‌లాడాలి. మీరు నేను.. అంద‌రూ క‌లిసిముందుకు సాగుదాం!!'' అని తెగేసి చెప్పేశారు. ఇది ఒక‌ప్ప‌టి వాజ‌పేయి మాట కాదు.. స‌ర్దుకుపోయేందుకు.. మోడీ నిర్దేశించిన ల‌క్ష్మ‌ణ రేఖ‌!!

మ‌రి దీనికి కార‌ణాలు ఏంటి? ఎందుకు? ఇంత బ‌ల‌మైన నిర్ణ‌యం తీసుకోవాడానికి గ‌ల కార‌ణాలు ఏంటి? అంటే.. వ‌చ్చే 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మ‌రోసారి బీజేపీ విజ‌యం ద‌క్కించుకుని కేంద్రంలో కూర్చోవాలంటే.. హ్యాట్రిక్ కొట్టి రికార్డు సృష్టించాలంటే.. ఈ 9 రాష్ట్రాల్లో విజ‌యం ద‌క్కించుకోవాల‌నేది మోడీ ప్ర‌ధాన వ్యూహం. ఈ రాష్ట్రాల్లో ఎక్క‌డ ఏ చిన్న పొర‌పాటు జ‌రిగినా.. ఏ రాష్ట్రాన్ని కోల్పోయినా.. అది బీజేపీ కంటే కూడా.. మోడీ ఇమేజ్‌పైనే ప్ర‌భావం ప‌డుతుంద‌నేది ప్ర‌ధాని ఆలోచ‌న‌. నిజానికి 2014, 2019 ఎన్నిక‌ల్లో మ‌రీముఖ్యంగా చెప్పాలంటే.. 2019లో మోడీ ఫేస్ వాల్యూతోనే కేంద్రంలో క‌మలం కొలువుదీరింది.

ఇప్పుడు ఇదే ఇమేజ్‌తో వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాలంటే..తన ఇమేజ్‌కు దెబ్బ‌త‌గ‌ల‌కుండా చూడాల‌నేది మోడీ వ్యూహం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఈ 9రాష్ట్రాల ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. వీటిలో మేఘాల‌య‌, నాగాలాండ్‌, త్రిపుర‌, మిజోరం, క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ హ‌వా కొన‌సాగుతోంది. ఇక‌, ఎటొచ్చీ పెద్ద రాష్ట్రాలు.. పంతం నెగ్గించుకోవాల్సిన రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే.. క‌ర్ణాట‌క‌లో బీజేపీనే అధికారంలో ఉంది. అదేవిధంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోనూ క‌మ‌ల‌మే పాలిస్తోంది.

మిగిలిన తెలంగాణ‌, రాజ‌స్థాన్‌, ఛ‌త్తీస్‌ఘ‌డ్‌ల‌లో తెలంగాణలో బీఆర్ఎస్ మిన‌హా.. మిగిలిన రెండు చోట్లా కాంగ్రెస్ అదికారంలో ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ మొత్తం రాష్ట్రాల్లో విజ‌యం ద‌క్కించుకోవాల‌నేది మోడీ ప్లాన్‌.ఈ విష‌యంలో తేడా వ‌స్తే.. మోడీ ఇమేజ్‌కు ప్ర‌మాద‌మ‌నేది భావ‌న‌. ఈ నేప‌థ్యంలో చిన్న‌దా.. పెద్ద‌దా.. అనే తేడా లేకుండా శ‌క్తివంచ‌న లేకుండా ప‌నిచేసి.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకోవాల‌నేది బీజేపీ ఆలోచ‌న‌.

వాస్త‌వానికి గ‌త డిసెంబ‌రులో జ‌రిగిన గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో గుజ‌రాత్‌ను ద‌క్కించుకున్న‌ ఆనందం   చిన్న‌రాష్ట్ర‌మే అయిన‌ప్ప‌టికీ.. హిమాచ‌ల్ ఓట‌మితో ఆవిరైంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవాల‌ని అనుకుంటున్నారు. ఇక్క‌డ తేడా వ‌స్తే.. వ‌చ్చే సార్వ‌త్రిక స‌మ‌రంపై ప్ర‌భావం ప‌డుతుంద‌నేది వెంటాడుతున్న భయం! అందుకే టార్గెట్‌-9ను చాలా సీరియ‌స్‌గా సిన్సియ‌ర్‌గా తీసుకుంటున్నార‌నేదివాస్త‌వం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News