రూ.2వేల నోటును అందుకే తెచ్చారా?

Update: 2016-11-18 06:37 GMT
పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ.. మరింత పెద్ద నోటును ఎందుకు తీసుకొచ్చారు? అన్నది ప్రశ్న. ఈ సందేహం సామాన్యుడికే కాదు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి వారికి కూడా వచ్చింది. కానీ.. దీనికి సమాధానం మాత్రం ఆయనకు లభించని పరిస్థితి. అంతేకాదు.. రూ.2వేల నోటును ఎందుకు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయానికి కేంద్రం వివరణ ఇచ్చింది కూడా లేదు. ఇదిలా ఉంటే.. రూ.2వేల నోట్లను అందుబాటులోకి తీసుకురావటం వెనుక మోడీ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందన్న వాదన బలంగా వినిపిస్తోంది.

రూ.2వేల నోటు వచ్చింది మొదలు.. ఒక బలమైన వాదనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి రూ.2వేల నోటును తీసుకొచ్చిన కేంద్రం.. రానున్న రోజుల్లో ఏదో ఒక రోజు ఇప్పటి మాదిరే రూ.2వేల నోటును కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవటం ఖాయమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ..  రానున్న రోజుల్లో రూ.వెయ్యి నోట్లను తీసుకొచ్చే అవకాశమే లేదన్న మాటను తేల్చి చెప్పేశారు. దీంతో.. వెయ్యి నోటుపై ఇక ఆశలు వదులుకున్నట్లే. ఇక.. కొత్తగా విడుదల చేయాల్సిన రూ.500 నోట్లను విడుదల చేసినట్లు చెబుతున్నా.. పూర్తి స్థాయిలో ఈ నోట్లు అందుబాటులోకి రాని విషయం తెలిసిందే.

జైట్లీ నోటి వెంట వచ్చిన రూ.వెయ్యి నోటు ఉండదన్న మాట చూసినప్పుడు రూ.2వేల నోటు ఆయుష్షు తక్కువనే భావన కలగటం ఖాయం. ప్రభుత్వ వర్గాలకు చెందిన కొందరు సీనియర్లు అనధికారికంగా తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ.. రూ.2వేల నోట్ల విడుదల కేవలం అపత్ ధర్మమే తప్పించి.. ఆ నోట్లను దీర్ఘకాలం కొనసాగించటం ఎంతమాత్రం కాదని చెబుతున్నారు.

పాత నోట్లను రద్దు చేసే క్రమంలో.. వాటి స్థానంలో రద్దు చేసిన నోట్ల విలువకు తగ్గట్లుగా చిన్న నోట్లను విడుదల చేయటం అంత తేలికైన విషయం కాదని.. దానికి చాలా కాలం పడుతుందని చెబుతున్నారు. అందుకే.. మధ్యే మార్గంగా రూ.2వేల నోట్లను విడుదల చేశారని.. రెండు వెయ్యి రూపాయిల నోటుకు ఒక్క నోటుతో సమాధానం ఇవ్వొచ్చన్న మాట వినిపిస్తోంది. రూ.2వేల నోట్లతో తాత్కాలికంగా కొత్త నోట్ల కష్టాలు తీర్చే ఉద్దేశంతోనే ప్రభుత్వం వ్యూహాత్మకంగా పెద్ద నోటును విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుత అవసరాలకు తీసుకొచ్చిన రూ.2వేల నోటును 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కానీ రద్దు చేస్తే.. ఎన్నికల్లో ఇష్టారాజ్యంగా ఖర్చు చేసే నేతలకు ముకుతాడు వేయొచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. రెండేళ్ల వ్యవధిలో రెండోసారి అతి పెద్ద నోటుకు చెక్ చెప్పటం ద్వారా నల్లకుబేరులకు భారీ షాకివ్వటంతో పాటు.. సామాన్యులకు ఊరట ఇవ్వొచ్చన్న ఆలోచనలో కేంద్రం ఉందన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఎన్నికల ముందే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా? లేక తమ ఆలోచనను మార్చుకుంటారా? అన్నది అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగాఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. రూ.2వేల నోటు ఎక్కువ కాలమైతే ఉండన్న మాటకే ప్రభుత్వ పెద్దలు అవునన్న సమాధానం అనధికారికంగా చెప్పటం గమనార్హం.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News