గ్రౌండ్ రెఢీ చేసుకుంటున్న చంద్రబాబు?

Update: 2019-04-14 05:17 GMT
ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. తీర్పు కోసం ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పు ఎలా ఉంటుంది? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు తెలంగాణ ప్రజలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా ఎన్నికలపై ఏపీలో ఎంతటి ఆసక్తి నెలకొందో.. తెలంగాణలోనూ అంతే ఆసక్తి నెలకొంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. పోలింగ్ జరుగుతున్న రోజు నుంచి చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు.. చెబుతున్న మాటలు ఇప్పుడు చర్చగా మారాయి. ఓపక్క పోలింగ్ జరుగుతుంటే.. మరోవైపు ఈసీపై విమర్శలు.. ఆరోపణలు చేయటాన్ని మర్చిపోకూడదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పోలింగ్ పూర్తి అయిన నాటి నుంచి ఆయన ఈసీపై యుద్ధాన్ని షురూ చేశారు.

ఎన్నికల నిర్వహణలో ఈసీ ఫెయిల్ అయిందన్నమాటను పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఎందుకిలా?  ఓటమి ఖాయమన్న విషయం చంద్రబాబుకు అర్థమైందా?  ఓడిపోయిన తర్వాత ప్రజలకు ఏం చెప్పాలన్న దానికి ముందు నుంచే ఆయన గ్రౌండ్ రెఢీ చేసుకుంటున్నారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

రాజకీయ వర్గాల అంచనా ప్రకారం చూస్తే.. పోలింగ్ పై ప్రతిపక్ష నేత జగన్ కూల్ గా ఉంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా అసహనంగా ఉండటమే కాదు.. చాలా తప్పులు దొర్లినట్లుగా ఆయన మండిపడుతున్నారు. వేలాది ఈవీఎంలు ఎందుకు మొరాయించాయి?  సాంకేతిక సమస్యలు ఎందుకు ఎదురయ్యాయి? అన్న ప్రశ్నల్ని సంధిస్తున్నారు.

ఏదైనా విషయాన్ని టేకప్ చేస్తే.. అంత త్వరగా వదిలిపెట్టని చంద్రబాబు.. ఇప్పుడు ఈసీ తీరు మీద ఆయన వాయిస్.. ఆయన రాజకీయ ప్రత్యర్థులకు గోలగా అనిపించినా.. బాబు మాత్రం వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. రేపొద్దున జగన్ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నట్లుగానే విజయం సాధిస్తే.. తాను ఓడిపోలేదని.. ఈవీఎంలతో తనను ఓడించారన్న విషయాన్ని చెప్పాలన్నది బాబు ప్లాన్ గా చెప్పక తప్పదు.

దాని ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున సానుభూతిని సొంతం చేసుకోవాలన్నది బాబు ఆలోచనగా చెబుతున్న వారు లేకపోలేదు. ఒకవేళ తాను అనుకున్నట్లుగా గెలిస్తే.. ఎన్నికల నిర్వహణలో విఫలమైనా.. తాము అలెర్ట్ గా ఉన్నట్లు చెప్పుకోవటం.. ఒకవేళ ఓడిపోతే మాత్రం.. తనను ఈవీఎంలతో ఓడించినట్లుగా చెప్పుకోవటానికి అవసరమైన గ్రౌండ్ ను బాబు సిద్ధం చేసుకుంటున్నట్లుగా చెప్పక తప్పదు.   


Tags:    

Similar News