అమిత్ షాతో బాబు భేటీ ప‌రమార్థం ఏమిటి?

Update: 2017-05-26 08:19 GMT
తెలంగాణ‌లో మూడు రోజుల ప‌ర్య‌ట‌న అనంత‌రం ఏపీకి వెళ్లిన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాతో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు భేటీ కావ‌టం తెలిసిందే. తొలుత పార్టీ నేత‌ల‌తో క‌లిసి మాట్లాడిన బాబు.. అనంత‌రం ఏకాంతంగా ఇరువురు నేత‌లు స‌మావేశ‌మ‌య్యారు. దాదాపు 40 నిమిషాల‌కు పైనే సాగిన ఈ భేటీలో ప‌లు కీల‌కాంశాలు తెర మీద‌కు వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

ఏపీలో బీజేపీ మిత్ర‌ప‌క్ష‌మే అయినా.. ప‌లువురు బీజేపీ నేత‌లు ఏపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేయ‌టాన్ని బాబు ప్ర‌స్తావించిన‌ట్లుగా తెలుస్తోంది. అదే సమ‌యంలో త‌మ పార్టీకి చెందిన కొంద‌రు నేత‌లు త‌ప్పులు చేస్తున్నార‌ని.. బీజేపీపై విమ‌ర్శ‌లు చేయ‌టాన్ని అమిత్ షా ద‌గ్గ‌ర ప్ర‌స్తావించిన చంద్ర‌బాబు.. ఇలాంటి ప‌రిణామాల‌తో ఇరు పార్టీల‌కు న‌ష్టం వాటిల్లుతుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఎవ‌రి వారికి చెందిన నేత‌ల్ని వారు క‌ట్ట‌డి చేయాల‌న్న ప‌రిష్కారానికి ఇరువురు నేత‌లు వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

ఏపీ బీజేపీకి చెందిన సోము వీర్రాజు.. ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి.. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌.. కావూరి లాంటి వారి వ్యాఖ్య‌ల్ని అమిత్ షా దృష్టికి బాబు తీసుకెళ్లిన‌ట్లు స‌మాచారం. ఇదే స‌మ‌యంలో పొత్తు విష‌యం కూడా ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ప్ర‌స్తుతానికి ఉన్న సంబంధాన్ని మ‌రో రెండేళ్ల పాటు స్టేట‌స్ కో మొయింటైన్ చేద్దామ‌న్న భావ‌న‌కు ఇరువురు నేత‌లు వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

బాబుతో భేటీ త‌ర్వాత బీజేపీ నేత‌ల‌తో స‌మావేశ‌మైన అమిత్ షా.. బాబు స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేయ‌టాన్ని త‌ప్పు ప‌ట్టిన‌ట్లు స‌మాచారం.   మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వేళ‌.. విమ‌ర్శ‌లు మంచివి కాద‌ని చెప్ప‌టంతో పాటు.. కొంద‌రు బీజేపీ నేత‌లకు అమిత్ షా క్లాస్ పీకిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే బాబు స‌ర్కారుపై చిట‌ప‌ట‌లాడే కొంద‌రునేత‌లు ఆచితూచి స్పందించ‌టానికి కార‌ణంగా చెబుతున్నారు.

అమిత్ షా భేటీ త‌ర్వాత సోము వీర్రాజు అయితే.. బాబు పాల‌న‌పై మార్కులు వేసేంత పెద్దోడ్ని కాదంటూ ఒకింత వ్యంగ్య వ్యాఖ్య‌లు చేయ‌టం అమిత్ షా క్లాస్ పుణ్య‌మేన‌ని చెబుతున్నారు. బాబు స‌ర్కారుపై త‌ర‌చూ విమ‌ర్శ‌లు చేసే వీర్రాజు.. త‌న తీరుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా చెబుతున్నారు.

తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో.. బీజేపీపై టీడీపీ నేత‌లు ఆచితూచి స్పందించ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఇక‌.. త‌మ‌కు ఇబ్బందిక‌రంగా మారిన ప్ర‌ధాని మోడీ.. విప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భేటీ విష‌యాన్ని అమిత్ షా ద‌గ్గ‌ర బాబు చ‌ర్చించిన‌ట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. ఏపీ బీజేపీ నేత‌ల‌కు వారి బిగ్ బాస్ చేత అక్షింత‌లు వేయించ‌టంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌క్సెస్ అయిన‌ట్లుగా చెబుతున్నారు. ఇది.. ఏపీ క‌మ‌ల‌నాథుల్లో  బాబుపై మ‌రింత మంట పుట్టిస్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News