బెజ‌వాడ రావాల్సిన బాబు ఢిల్లీ ఎందుకు వెళ్లారు?

Update: 2019-05-19 05:10 GMT
గ‌డిచిన రెండు రోజులుగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బిజీబిజీగా ఉంటున్నారు. మీటింగ్ ల మీద మీటింగ్ ల‌తో  ఆయ‌న క్ష‌ణం తీరిక లేకుండా ఉంటున్నారు. రెండు రోజుల వ్య‌వ‌ధిలో దాదాపు ఏడుగురు జాతీయ నేత‌ల‌తో స‌మావేశ‌మైన ఆయ‌న‌.. మోడీ వ్య‌తిరేక జ‌ట్టు క‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. శుక్ర‌వారం క‌మ్యునిస్ట్ ప్ర‌ముఖుల‌తో భేటీ కావ‌టంతో పాటు.. కీల‌క‌మైన ప‌లువురితో భేటీ అయిన ఆయ‌న‌.. శ‌నివారం కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్.. ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ తో పాటు.. కీల‌క‌మైన బీఎస్పీ.. ఎస్పీ అధినేత‌ల‌తో భేటీ అయ్యారు.

మ‌న‌మంతా ఒక్క‌టే అన్న మాటతో కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ నుంచి సెల‌వు తీసుకున్న బాబు.. యూపీకి వెళ్లారు. అక్క‌డ తొలుత ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాద‌వ్ తో భేటీ అయిన ఆయ‌న‌.. త‌ర్వాత బీఎస్పీ అధినేత్రి మాయ‌వ‌తితో స‌మావేశ‌మ‌య్యారు.

త‌న‌కు ఢిల్లీ ఆలోచ‌న‌లు లేవ‌ని అఖిలేశ్ స్ప‌ష్టం చేయ‌టంతో పాటు.. త‌న ప్రాధాన్య‌త అంతా యూపీ మీద‌నే అన్న విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. అఖిలేశ్ తో మీటింగ్ త‌ర్వాత బీఎస్పీ అధినేత్రి మాయ‌వ‌తితో భేటీ అయిన బాబు.. ఆమెకు ఢిల్లీలో చ‌క్రం తిప్పాల‌న్న ఆలోచ‌న ఉన్న‌ట్లు గుర్తించారు. అదే స‌మ‌యంలో.. ఢిల్లీలో తాజాగా నెల‌కొన్న ప‌రిణామాల్ని చెప్పి.. కాంబినేష‌న్లు వివ‌రించిన‌ట్లుగా చెబుతున్నారు.

ఏది ఏమైనా.. త‌న త‌ర‌ఫున ఎవ‌రైనా వ‌చ్చి బాధ్య‌త తీసుకుంటాన‌ని చెబితే ఎవ‌రూ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌రు. అదే తీరులో బాబుకు బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి అవ‌కాశం ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. యూపీలో తాము గెలుచుకునే సీట్ల లెక్క‌ను చెప్పి.. తానేం చేయాల‌నుకుంటున్న విష‌యాన్ని బాబుకు స్ప‌ష్టం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. మాయావ‌తి నుంచి ఊహించ‌ని డిమాండ్లు తెర మీద‌కు రావ‌టంతో.. శ‌నివారం రాత్రికి ల‌క్నో నుంచి బెజ‌వాడ‌కు రావాల్సిన చంద్ర‌బాబు.. త‌న ట్రిప్ ను కేన్సిల్ చేసుకొని హుటాహుటిన ఢిల్లీకి ప‌య‌నం కావ‌టం క‌నిపిస్తుంది.

అఖిలేశ్‌.. మాయావ‌తిల మ‌నోభావాల్ని రాహుల్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం ఉండ‌టంతో ఆయ‌న ఢిల్లీకి వెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది. ఆదివారం రాహుల్ తో మ‌రోసారి భేటీ కానున్న చంద్ర‌బాబు.. యూపీ మీటింగ్ వివ‌రాల్ని ఆయ‌న దృష్టికి తీసుకెళ్ల‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇంత క‌ష్ట‌ప‌డుతున్న బాబుకు మిగిలేదేమిటి? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News