అమరావతి...వర్కౌట్ అయితే బంగారు బాతు గుడ్డు !

ఇపుడు అధికారంలోకి వస్తూనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు అమరావతి నే టాప్ ప్రయారటీగా పెట్టుకున్నారు.

Update: 2024-12-28 03:50 GMT

ఏపీకి రాజధాని లేదు అని అంతా విమర్శించారు. రాజధాని లేని రాష్ట్రం అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా పడని నిందలు ఇబ్బందులు ఏపీ పడుతూ వచ్చింది. దానికి కారణం విభజన పాపాలతో పాటు రాజకీయ శాపాలు కూడా అని నిష్కషగా చెప్పాల్సి ఉంటుంది.

ఇదిలా ఉండగా చంద్రబాబు జగన్ ల మధ్య రాజధాని రగడ సాగి తుది తీర్పు జనం రూపంలో వచ్చేసరికి పదేళ్ల పుణ్య కాలం గడచిపోయింది. ఇపుడు అధికారంలోకి వస్తూనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు అమరావతినే టాప్ ప్రయారటీగా పెట్టుకున్నారు. ఆరు నెలల కాలంలో అమరావతి మీద ఆశలు కలిగించగలిగారు. ప్రపంచ బ్యాంక్ నుంది నిధులను తెప్పించుకోగలిగారు. మరిన్ని నిధులను కూడా తెచ్చేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు.

మొత్తం మీద చూస్తే మూడు నుంచి అయిదేళ్ల కాలంలో అమరావతి రాజధాని ఒక రూపానికి వస్తుందని అంటున్నారు. దానికి అయ్యే ఖర్చు అక్షరాలా అరవై వేల కోట్ల రూపాయలు అని అంటున్నారు. ఈ అరవై వేల కోట్ల రూపాయలతో చూస్తే కనుక మొత్తం సేకరించిన యాభై వేల ఎకరాలలోనూ మౌలిక సదుపాయాలు అన్నీ వచ్చేస్తాయి.

అంటే రోడ్లు, డ్రెయిన్లు, ఇతర సదుపాయాలు అన్నీ అన్న మాట. ఇక పది వేల ఎకరాలలో రైతులకు ప్లాట్లు వేసి ఇస్తారు అని అంటున్నారు. అదే విధంగా మరో ఇరవై వేల ఎకరాల్లో ప్రభుత్వం రాజధానికి అవసరమైన కార్యక్రమాల కోసం అట్టేబెట్టుకుంటుంది. ఇంకో అయిదారు వేల ఎకరాలలో హైకోర్టు, అసెంబ్లీ భవనాలు సెక్రేటేరియట్ ఇతర సదుపాయాలు వంటివి వస్తాయని అక్కడ కూడా మిగులు భూమిని ప్రభుత్వ కార్యక్రమాలకు కేటాయిస్తారు అని అంటున్నారు

చివరిగా మిగిలే పదిహేను వేల ఎకరాలే అమరావతి రాజధానికి బంగారు బాతు గుడ్డుగా మారబోతున్నాయని అంటున్నారు. అదేలా అంటే లక్ష ప్లాట్లు రెడీ చేసి ఉంచుతారు. వాటిని విక్రయించడం ద్వారా ఏకంగా లక్ష నుంచి లక్షన్నర కోట్ల రూపాయలు అమరావతి రాజధానిని వస్తాయని అంచనా వేస్తున్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ కాపిటల్ అని చంద్రబాబు తరచూ చెబుతూ వస్తున్నారు. అదెలా అంటే ఈ పదిహేను వేల ఎకరాల మిగులు భూమి అందులో ప్లాట్లే అని అంటున్నారు.

వాటిని విక్రయించడం ద్వారా వచ్చే సొమ్ముతో ప్రపంచ బ్యాంక్ సహా ఇతర ఏజీన్సీలకు చేసిన రుణాలను మొత్తం అరవై వేల నుంచి డెబ్బై వేల కోట్ల రూపాయలు తీర్చేస్తే ఆ మీదట అమరావతి పూర్తిగా బంగారు బాతు గుడ్డుగా మారి అభివృద్ధి ఫలాలను అందిస్తుందని అది దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడుతుందని చంద్రబాబు సహా అమరావతి రాజధాని రూపకర్తలు భావిస్తున్నారు

అయితే ఇవన్నీ జరగాలీ అంటే చాలా టైం పడుతుంది. అనుకున్నది అనుకున్నట్లుగా అంతా సాగాలి. అమరావతిలో ప్లాట్లు రెడీ చేసి ఉంచినా అనుకున్న విధంగా ఫ్యాన్సీ రేట్లకు కొంటేనే ఇదంతా జరిగేది అని అంటున్నారు. అలా కాకుండా రియల్ బూం తగ్గితే మాత్రం ఈ అప్పు కచ్చితంగా వడ్డీలతో సహా పెరిగిపోతుందని అపుడు ఆ ప్లాట్లు ఆలస్యంగా అమ్ముడు అయినా ఫలితం మాత్రం తేడా కొట్టి రివర్స్ అవుతుందని మేధావులు హెచ్చరిస్తున్నారు

ఏది ఏమైనా అమరావతి ఏపీకి కల్పవల్లి అని భావిస్తూ టీడీపీ అధినాయకత్వం మాత్రం దానిని పూర్తి చేసేందుకు ఎన్ని వేల కోట్లు అయినా రుణంగా తెచ్చి పెట్టడానికి సిద్ధమవుతోంది అంటున్నారు. దేశంలో ఈ తరహా ప్రయోగం కానీ ప్లాన్ కానీ ఇప్పటిదాకా అయితే లేదు. విజనరీ అని పేరు గడించిన చంద్రబాబు మార్గ నిర్దేశకత్వంలో అమరావతి రాజధాని తయారు అవుతోంది. ఇందులో కనుక బాబు మాస్టర్ స్కెచ్ సక్సెస్ అయితే మాత్రం ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం. అలా జరుగుతుందనే టీడీపీ గట్టి ధీమాతో ఉంది.

Tags:    

Similar News