గుజ‌రాత్ లో కాంగ్రెస్ ఎందుకు ఓడింది?

Update: 2017-12-19 15:30 GMT
అవ‌కాశాలు అన్నిసార్లు రావు. వ‌చ్చిన‌ప్పుడే అందిపుచ్చుకోవాలి. ఆ విష‌యంలో కాంగ్రెస్ పార్టీ.. ఆ పార్టీని ప్ర‌స్తుతం న‌డిపిస్తున్న రాహుల్ కు అంత అవ‌గాహ‌న లేద‌ని చెప్పాలి. 22 ఏళ్ల బీజేపీ పాల‌న ప‌ట్ల గుజ‌రాతీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్న వేళ‌.. కాంగ్రెస్‌కు విజ‌యం ఖాయ‌మైంది. న‌వ‌త‌రం బీజేపీపై త‌మ‌కున్న ఆగ్ర‌హాన్ని ఓట్ల రూపంలో వేసి చూపించేందుకు సిద్ధ‌మ‌వుతున్న వేళ‌.. వారు ఓట్లు వేసేలా చేయ‌టంలో కాంగ్రెస్ విఫ‌లం కావ‌ట‌మే గుజ‌రాత్ లో బీజేపీ విజ‌యానికి కార‌ణంగా చెబుతున్నారు.

గుజ‌రాత్‌లో ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన బలానికి కేవ‌లం ఏడు స్థానాలు మాత్ర‌మే అధికంగా బీజేపీ సొంతం చేసుకోగ‌లిగంది. ప్ర‌భుత్వంపై ఎంత వ్య‌తిరేక‌త ఉంద‌న్న విష‌యం ఈ అంకెలు స్ప‌ష్టం చేస్తున్నాయి. దాదాపు ఒక‌ట్రెండు శాతం ఓట్ల‌తో చేజార్చుకున్న స్థానాలు ఎడెనిమిది కంటే ఎక్కువ‌గా ఉన్నాయి. ఎందుకిలా జ‌రిగింది? ప‌రిస్థితులు అనుకూలంగా ఉన్న‌ప్ప‌టికీ కాంగ్రెస్ ఎందుకు గెల‌వ‌లేక‌పోయింది? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

గుజ‌రాత్ ప‌రిస్థితుల్ని చూస్తే..  ప్ర‌జ‌ల్లో ఉన్న ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను ఓట్ల రూపంలోకి మార్చ‌టంలో విఫ‌లం చెందింద‌ని చెబుతున్నారు. దీనికి ఉదాహ‌ర‌ణ‌గా సూర‌త్ ఎగ్జాంపుల్‌ను చెబుతున్నారు. సూర‌త్ లో ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్‌కు సానుకూల వాతావ‌ర‌ణం నెల‌కొంది. జీఎస్టీపై అక్క‌డి వ‌స్త్ర వ్యాపారులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. జీఎస్టీ.. పెద్ద‌నోట్ల కార‌ణంగా అక్క‌డి ప‌రిశ్ర‌మ‌లు పెద్ద ఎత్తున మూత‌బ‌డ్డాయి. ప‌టీదార్ల ప్ర‌భావం కూడా బాగానే ఉన్న సూర‌త్ లో తుది ఫ‌లితం చూస్తే ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

త‌న ఎన్నికల ప్ర‌చారం సంద‌ర్భంగా జీఎస్టీని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గ‌బ్బ‌ర్ సింగ్ టాక్స్ గా అభివ‌ర్ణించిన‌ప్పుడు.. ఆయ‌న మాట‌కు స్పంద‌న భారీగా వ‌చ్చింది. మ‌రి.. అంత స్పంద‌న ఈవీఎంల వ‌ర‌కూ వ‌చ్చేస‌రికి ఎందుకు  ఓట్ల రూపంలో మార‌లేద‌న్నది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

దీనికి స‌మాధానం వెతికితే.. గుజ‌రాత్ లో ఎన్నిక‌ల వేళ వ‌స్త్ర వ్యాపారుల వ్య‌తిరేక‌త‌ను గుర్తించిన మోడీ స‌ర్కారు వ‌డివ‌డిగా నిర్ణ‌యాలు తీసుకుంది. జౌళి ప‌రిశ్ర‌మ‌పై జీఎస్టీ భారాన్ని త‌గ్గించ‌టంతో పాటు.. సూర‌త్ జిల్లాలోని 16 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల మీద ప్ర‌త్యేక దృష్టి సారించారు మోడీ అండ్ అమిత్ షాలు. దీని ప్ర‌భావమే గుజ‌రాత్ ఎన్నిక‌ల నుంచి బీజేపీ సేఫ్ గా బ‌య‌ట‌ప‌డిన‌ట్లు చెబుతున్నారు.

ఎందుకంటే మొత్తం 16 స్థానాల్లో స‌గం కాంగ్రెస్ వ‌శం అవుతాయ‌ని లెక్క‌లు క‌ట్టిన‌ప్ప‌టికీ తుది ఫ‌లితంలో మాత్రం రెండు స్థానాలు మాత్ర‌మే కాంగ్రెస్ కు ద‌క్కాయి. మిగిలిన 14 చోట్ల య‌థావిధిగా కాషాయ జెండా రెప‌రెప‌లాడింది. నిజానికి సూర‌త్ జిల్లాలో మొద‌ట నుంచి అనుకున్న‌ట్లుగా ఎనిమిది స్థానాలు విజ‌యం సాధించినా ఈ రోజు బీజేపీకి వ‌చ్చిన 99 కాస్తా 91 అయితే.. కాంగ్రెస్ 80 సీట్లు కాస్తా 88 అయ్యేవి. అప్పుడు ప‌రిస్థితి మ‌రింత ఇబ్బందిక‌రంగా మారింది. తీవ్ర వ్య‌తిరేక‌త ఉన్న సూర‌త్ లో పోలింగ్ జ‌రిగే నాటికి ప‌రిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారటం వెనుక మోడీ ఉన్నార‌ని చెప్ప‌క త‌ప్పదు.

త‌మ పుట్టె ముంచే అవ‌కాశం ఉన్న సూర‌త్ పై మోడీ స్పెష‌ల్ ఫోక‌స్ పెట్ట‌ట‌మే కాదు..  ఐదు వేల మంది కార్య‌క‌ర్త‌ల్ని స‌మీక‌రించిన మోడీ.. వారితో వ్య‌క్తిగ‌తంగా మాట్లాడ‌ట‌మే కాదు.. ప్ర‌తి ఒక్క‌రూ ఓట‌రు ఇంటింటికి వెళ్లాల‌ని ఆదేశించారు. దీని ప్ర‌భావ‌మే చివ‌రిక్ష‌ణంలో బీజేపీకి వ‌రంగా మారింద‌ని చెబుతున్నారు. ఇలాంటి దూకుడు నిర్ణ‌యాలు తీసుకోవ‌టంలో రాహుల్ వెనుక‌బ‌డ‌ట‌మే గుజ‌రాత్ లో కాంగ్రెస్ ప‌రాజ‌యానికి కార‌ణమ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

మొద‌టి ద‌శ పోలింగ్ పూర్తి అయిన వెంట‌నే త‌మ‌కు వ్య‌తిరేకంగా ఓట్లు పోలైన విష‌యాన్ని గుర్తించిన మోడీ.. వెంట‌నే భావోద్వేగ అంశాల్ని తెర మీద‌కు తీసుకొచ్చారు. పాకిస్తాన్‌కు కాంగ్రెస్ సుపారీ ఇచ్చింద‌ని.. అహ్మ‌ద్ ప‌టేల్‌ను కాంగ్రెస్ ముఖ్య‌మంత్రిగా చేయాల‌ని భావిస్తోంద‌న్న మాట‌ల్ని ఆయ‌న తెర మీద‌కు తెచ్చారు. ఈ రెండింటిలో మోడీ భావోద్వేగ మాట‌ల కంటే కూడా అహ్మ‌ద్ ప‌టేల్‌ను ముఖ్య‌మంత్రిని చేయాల‌ని భావిస్తోంద‌న్న మాట గుజ‌రాతీయుల మీద ప్ర‌భావాన్ని చూపించింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అహ్మ‌ద్ ప‌టేల్ సీఎం అవుతార‌న్న ప్ర‌చారాన్ని బ‌లంగా తిప్పి కొట్ట‌టంలో విప‌ల‌మైన కాంగ్రెస్ అందుకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వ‌చ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.  పోలింగ్ చివ‌రి క్ష‌ణం వ‌ర‌కూ గుజ‌రాత్ ను చేజార్చుకోకూడ‌ద‌న్న త‌ప‌న "మోడీషా"ల‌లో ఉండ‌ట‌మే మ‌రోసారి గుజ‌రాత్ ప‌గ్గాలు బీజేపీకి రావ‌టానికి కార‌ణంగా చెప్పాలి. అలాంటి పోరాట ల‌క్ష‌ణం మిస్ అయిన కాంగ్రెస్‌.. ప్ర‌జ‌ల అభిమానం ఉన్న‌ప్ప‌టికి విజేత‌గా అవ‌త‌రించ‌లేదు. ఎలాంటి వారైనా అత్య‌ధికంగా శ్ర‌మించ‌టంతో పాటు తెలివిగా పావులు క‌దిపిన వారి వెంటే గెలుపు ఉంటుంద‌న్న విష‌యం గుజ‌రాత్ ఎన్నిక‌లు స్ప‌ష్టం చేశాయి.
Tags:    

Similar News