ఓహ్‌...ఇందుకేనా క‌రోనా రోగులు ఆస్ప‌త్రి నుంచి పారిపోతోంది!

Update: 2020-03-17 01:30 GMT
క‌రోనా వ్యాధి విష‌యంలో ఏక‌కాలంలో భార‌త‌దేశంలో రెండు చిత్ర‌మైన ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక‌టి వేగంగా ఈ వ్యాధి విస్త‌రిస్తుంటే... రెండ‌వ‌ది ఈ వ్యాధికి చికిత్స పొందుతున్న వారు ఆస్ప‌త్రి నుంచి పారిపోతున్నార‌నే ప్ర‌చారం. నాగపూర్‌ లోని మయో ఆస్పత్రి నుంచి కరోనా అనుమానిత ఐదుగురు పేషెంట్లు తప్పించుకు పారిపోయారనే వార్త సంచ‌ల‌నం రేకెత్తించింది. అయితే, ఎందుకు ఇలా జ‌రుగుతోంద‌నే విష‌యంలో ఆశ్చ‌ర్య‌క‌ర ప్ర‌చారం జ‌రుగుతోంది.

దేశ వాణిజ్య రాజ‌ధానిగా పేరొందిన ముంబైని క‌లిగి ఉన్న మ‌హారాష్ట్రలో క‌రోనా బాధితుల సంఖ్య ఎక్కువ‌గా ఉంది. ఆదివారం ఒక్కరోజే 13 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 32కి చేరుకుంది. ఈ నెలాఖరు వరకు గ్రూప్‌ టూర్లను నిరోధించేందుకు ముంబై పోలీసులు సెక్షన్‌ 144ను విధించారు. పుణెలోనూ 144 సెక్షన్‌ ను విధించనున్నట్లు సమాచారం. సోమవారం ఒక్కరోజే ఐదుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలిపింది. ఈ ఐదుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా విదేశాలకు వెళ్లి వచ్చిన వారే. అయితే కరోనా రోగుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

నాగ్‌ పూర్‌ లోని ఆస్ప‌త్రి నుంచి  అనుమానిత ఐదుగురు వ్యక్తులు చిరుతిళ్లు తినేందుకు వార్డునుంచి బయటకు వెళ్లారు. కానీ తిరిగి వార్డుకు రాలేదు. ఆస్పత్రి సిబ్బంది సమాచారంతో వారిని వెతికి పట్టుకుని తిరిగి ఆస్పత్రికి తరలించారు. మ‌రోవైపు - మంగళూరులో కరోనా వైరస్ అనుమానితుడు ప్రభుత్వ కరోనా వార్డు నుంచి పారిపోయాడు. ప్రైవేట్ ట్రీట్ మెంట్ కోసం వెళ్తానంటూ అధికారులతో వాదించి మ‌రీ ఆయ‌న జంప‌య్యాడు. ఇటీవల యూరప్ నుంచి వచ్చిన ఓ మ‌హిళ‌తో  పాటు మహిళ భర్తలో కూడా కరోనా లక్షణాలు ఉన్నాయి. వీరికి ఆగ్రాలోని కరోనా నిర్బంధ వార్డులో చికిత్స అందిస్తుండ‌గా తప్పించుకుని పారిపోయిందనే వార్త బయటకు వచ్చింది. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎంద‌రిలోనే ఆవేద‌న‌ను క‌లిగిస్తున్నాయి. అయితే, దీనికి  ప‌లువురు సోష‌ల్ మీడియాలో స‌మాధానం ఇస్తున్నారు.

దీనికి కార‌ణం మ‌న వైద్య వ్య‌వ‌స్థ‌. క‌ల్పిస్తున్న సౌక‌ర్యాలేన‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.  దేశంలోని కరోనా బాధితులకు కల్పించే వైద్య సౌకర్యాలు అధ్వాన్నంగా ఉన్నాయని, అందుకే ప‌లువురు పారిపోతున్నార‌ని చెప్తున్నారు. కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుల్లోని టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్న విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో ఫోటోల‌తో స‌హా పొందుప‌రుస్తున్నారు. అగ్రాలోని నగర ఐసోలేషన్ వార్డుల్లోని టాయిలెట్ల పరిస్థితి ఎంత అద్వాన్నంగా ఉందో చూడండి అంటూ ఓ నెటిజ‌న్ అయితే వీడియో పోస్ట్ చేశాడు. భారతదేశంలోని ప్ర‌జారోగ్య విభాగంపై చాలామందికి నమ్మకం లేదని, అందుకే సాధార‌ణ వైద్య సేవ‌ల్లోనే సాధ్యమైనంత వరకు వారు దూరంగా ఉంటున్నార‌ని పేర్కొంటూ క‌రోనా బాధితులు త‌మ‌కు ద‌క్కుతున్న చికిత్స విష‌యంలో ఇలా మ‌థ‌న ప‌డి పారిపోతున్నార‌ని వివ‌రిస్తున్నారు.



Tags:    

Similar News