స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ క్లిప్పుల విడుద‌ల ఇప్పుడెందుకంటే?

Update: 2018-06-29 06:06 GMT
త‌న నిర్ణ‌యాల‌తో షాకుల మీద షాకులు ఇవ్వ‌టం ప్ర‌ధాని మోడీకి అల‌వాటే. పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం నుంచి స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ వ‌ర‌కూ ఎప్పుడెలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో అర్థం కాకుండా వ్య‌వ‌హ‌రించ‌టం ఆయ‌న‌కు మామూలే. దేశ ప్ర‌జ‌ల నుంచి అంత‌ర్జాతీయంగా అంతా ఆశ్చ‌ర్య‌పోయేలా తాము జ‌రిపిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ వ్య‌వ‌హారంపై మోడీ స‌ర్కారు రాజ‌కీయంగా ఎంత ల‌బ్థి పొందార‌న్న‌ది తెలిసిందే.

2016లో ఊరి వ‌ద్ద పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు తెగ‌బ‌డి పెద్ద ఎత్తున భార‌త సైనికుల ప్రాణాలు తీసిన దానికి ప్ర‌తిగా.. భార‌త సైన్యం పాక్ అక్ర‌మిత క‌శ్మీర్‌ లోకి ప్ర‌వేశించి ఉగ్ర‌వాదుల్ని మ‌ట్టుపెట్టారు. భార‌త సైనికుల మెరుపుదాడిపై భార‌తావ‌ని మొత్తం హ‌ర్షించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇది జ‌రిగిన ఏడాదిన్న‌ర త‌ర్వాత తాజాగా స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ సంబంధించిన వీడియో క్లిప్స్ ను మోడీ స‌ర్కారు విడుద‌ల చేయ‌టం గ‌మ‌నార్హం.

నాటి దాడుల‌ను మాన‌వ‌ర‌హిత విమానాలు.. సైనికుల హెల్మెట్ల‌పై ఉన్న కెమేరాలు.. థ‌ర్మ‌ల్ ఇమేజింగ్ కెమెరాల సాయంతో నాడు జ‌రిగిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ కు సంబంధించిన కొన్ని దృశ్యాల్ని విడుద‌ల చేశారు. దీనిపై రాజ‌కీయ ర‌గ‌డ మొద‌లైంది. మోడీ స‌ర్కారు విడుద‌ల చేసిన వీడియోల‌పై బీజేపీ స‌మ‌ర్థించుకోగా.. కాంగ్రెస్ తీవ్ర‌స్థాయిలో త‌ప్పు ప‌ట్టింది.

మెరుపుదాడుల‌కు సంబంధించిన వీడియోల్ని విడుద‌ల చేయ‌టం ద్వారా మోడీ స‌ర్కారు రాజ‌కీయం చేస్తుంద‌ని.. సైనికుల ర‌క్తం.. త్యాగాల‌ను రాజ‌కీయ ఓట్ల సాధ‌న‌కు ఉప‌యోగించుకోవ‌ద్ద‌ని పేర్కొంది. ఈ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డింది. త‌మ‌కు అలాంటి అల‌వాటు లేద‌ని.. ఒక‌వేళ ఉండి ఉంటే.. ఆ మ‌ధ్య‌న జ‌రిగిన యూపీ ఎన్నిక‌ల వేళ‌లో వీడియోల్ని విడుద‌ల చేసేవాళ్ల‌మ‌ని బీజేపీ నేత‌లు చెప్పుకోవ‌టం గ‌మ‌నార్హం.

మ‌రిప్పుడు స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ వీడియోల్ని ఎందుకు విడుద‌ల చేశార‌న్న‌ది చూస్తే.. ఇటీవ‌ల కాలంలో అంత‌కంత‌కూ త‌గ్గుతున్న ఇమేజ్ ను కాపాడుకోవ‌టానికేన‌న్న నిజాన్ని చెప్ప‌క త‌ప్ప‌దు.అన్ని బాగుంటే.. ఈ అక్టోబ‌రులోనే ముంద‌స్తుకు పోవాల‌ని భావిస్తున్న వేళ‌.. క‌మ‌ల‌నాథులు త‌మ ప్ర‌భుత్వ విజ‌యాల్ని చాటి చెప్పుకోవ‌టానికి.. దేశం కోసం త‌మ నాయ‌కుడు తీసుకున్న నిర్ణ‌యాల్ని సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకోవ‌టానికి అవ‌స‌ర‌మైన ముడి స‌రుకు కొర‌త‌ను తీర్చాయ‌ని చెప్పాలి.

ఒక‌వేళ‌.. ఈ వాద‌న‌ను త‌ప్పు అనే వాళ్లు కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. ఇప్పుడు ఎవ‌రి కోసం వీడియోలు విడుద‌ల చేసిన‌ట్లు?  ఎలాంటి ప్ర‌యోజ‌నాన్ని ఆశించి వీడియోలు విడుద‌ల చేయ‌లేద‌న్న‌ది నిజ‌మే అయితే.. అదే ప‌ని స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ జ‌రిపిన‌ప్పుడే ఎందుకు విడుద‌ల చేయ‌న‌ట్లు?  సర్జిక‌ల్ వీడియోల విడుద‌ల‌తో ప్ర‌భుత్వం ఏం ఆశిస్తున్న‌ట్లు?  ఈ ప్ర‌శ్న‌ల‌కు నిజాయితీతో స‌మాధానాలు చెప్పే ధైర్యం మోడీ స‌ర్కారు చేయ‌గ‌ల‌దా?
Tags:    

Similar News