పట్టిసీమపై జగన్‌ పట్టు: ఇదీ అసలు గుట్టు

Update: 2015-03-19 06:40 GMT
రసవత్తరంగా సాగుతున్న ఏపీ అసెంబ్లీలో చర్చ అంతా పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంపైనే నడుస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీ ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిచేస్తామని చెప్తుండగా... ప్రధాన ప్రతిపక్షం అయిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పట్టిసీమ వద్దని, పోలవరం ముందుగా నిర్మించాలని కోరుతోంది.ఇందుకు సభను స్తంభింపచేస్తోంది.   ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీమకు చెందినవారే. ప్రతిపక్ష నేత జగన్‌ సైతం ఆ ప్రాంత బిడ్డే. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల మేలు జరిగేది రాళ్లతో నిండిన రాయలసీమకే. అయినా..ఎందుకు జగన్‌ వద్దే వద్దు అంటున్నారు? ఈ విషయం తెలియాలంటో గతంలోకి వెళ్లాలి.

పోలవరం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎన్ని అవాంతరాలు ఎదురైనా నిర్మించి తీరుతామని, జాతీయ హోదా సాధిస్తామని అప్పట్లో వైఎస్‌ ప్రకటించారు. ఆ రెండూ ఇప్పటికీ పూర్తి స్థాయిలో జరగలేదు. ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. వైఎస్‌ జగన్‌ తీరును విశ్లేషిస్తున్న వారి అభిప్రాయం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఆ క్రెడిట్‌ వైఎస్‌ కు తద్వారా ఆయన కుమారుడు అయిన జగన్‌ కు వెళుతుంది. తన తండ్రి ప్రారంభిస్తే తాను ప్రతిపక్షంలో ఉండి కూడా పూర్తిచేయించగలిగానని చెప్పుకోవచ్చు. మరోవైపు అందులోని కాంట్రాక్టర్లతో జగన్‌ కు ఆర్థిక సంబంధాలు ఎలాగూ ఉన్నాయి. ఒకవేళ జగన్‌ కు క్రెడిట్‌ దక్కకపోయినా చంద్రబాబుకు పోలవరం క్రెడిట్‌ దక్కే అవకాశం లేదు. ఎందుకంటే జగన్‌ మీడియా చాలా సమర్థంగా పోలవరం వైఎస్‌ ది అని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయకుండా ఉండదు. కాబట్టి ఇంత ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వం దాని జోలికి వెళ్లి , క్రెడిట్‌ వాళ్లకు కట్టబెట్టడం ఎందుకు? పైగా ఇప్పటికే జాతీయ హోదా కింద ఆ క్రెడిట్‌ కొట్టేయడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో పోలవరం బాబుకు శాపం అని టీడీపీ వర్గాలు భావస్తున్నాయి. అదే పట్టిసీమ విషయం వేరే.

పట్టిసీమను వైఎస్‌ రాజశేశర్‌ రెడ్డి పట్టించుకోలేదు. పైగా నిర్లక్ష్యం చేశారు. ఇపుడు దాన్ని బాబు సర్కారు పూర్తిచేస్తే ఆయనకే క్రెడిట్‌ దక్కుతుంది. పోలవరం ద్వారా కూడా రాయలసీమకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా... అది చాలా సమయం, డబ్బు తీసుకోవడంతో పాటు క్రెడిట్‌ రాకుండా అడ్డుపడుతుంది. పట్టి సీమ పూర్తి స్వయంగా చంద్రబాబు ఏడాదిన్నరలో రాయల సీమ ప్రాజెక్టులకు నీళ్లు పంపడం ద్వారా ఆ ప్రాంతంలో ఆ పార్టీ ఇమేజ్‌ బాగా పెరుగుతుంది. ప్రస్తుతం రాయలసీమలో అనంతపురం మినహా మిగతా చోట్ల టీడీపీ పట్టు తగ్గింది. ఈ నేపథ్యంలో పట్టిసీమతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తే... సంస్థలు తెచ్చి భూముల ధరలు పెంచినందుకు కోస్తాంధ్ర, నీళ్లు తెచ్చిందకు రాయలసీమ తమను నెత్తిన పెట్టుకుంటాయన్నది టీడీపీ భావన. పైగా వచ్చే ఎన్నికల్లో కోస్తాంధ్రలో సీట్లు తగ్గినా ఆ మేరకు రాయలసీమలో సీట్లు పెంచుకుని జగన్‌ ను దెబ్బతీయవచ్చు అన్నది మరో ఆలోచన.

ఇదే జరిగితే.. నిజంగా జగన్‌ కు రెండు నష్టాలు. ఒకటి పోలవరం క్రెడిట్‌ ఇపుడపుడే పూర్తి కాదు, ఎప్పటికో పూర్తయినా దాని ద్వారా వచ్చే నీళ్లు కూడా బాబుకే క్రెడిట్‌ తెచ్చిపెడతాయి. కాబట్టి ఆ విధంగా జగన్‌ రాజకీయంగా నష్టపోతారు. ఇక్కడ సీట్లు పోతాయి. పార్టీ పునాదులు కదులుతాయి.  అందుకే 80 టీఎంసీల నీరు రాయలసీమకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ జగన్‌ ''పట్టిసీమ''ను వద్దంటున్నారు. అంత పెద్ద ఎత్తున నీరు సీమకు దక్కితే నిజంగా అక్కడి ప్రజలు అన్నిపంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. ఇక అపుడు జగన్‌ కూసాలు కదిలే ప్రమాదం ఉంది.

ఇంత రాజకీయ ప్రయోజనం ఉంది, అందులో భాగంగా రాయలసీమ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబు అవినీతి ఆరోపణలు భరించడానికి సిద్ధపడుతున్నాడు గాని పట్టిసీమపై పట్టు వదలడం లేదు. పోలవరం ఐదేళ్లకు కూడా పూర్తవుతుందన్న గ్యారంటీ లేదు. అదే పట్టిసీమ అయితే ఏడాది లోపు పూర్తి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.  అంటే పట్టి సీమ వల్ల ప్రజలకు ఎంత లాభమో జగన్‌ కు తెలిసినా తన భవిష్యత్తు సీమకు అన్యాయం చేయడానికీ వెనుకాడటం లేదు.

రాజకీయ నాయకులు ఎవరైనా తమ స్వార్థపు ఎత్తుగడలు పక్కనపెట్టి ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించకుంటే ప్రజలే నష్టపోతారు. ఆ తర్వాత అందుకు తగ్గ సమయం వచ్చినపుడు సరైన రీతిలో స్పందిస్తారు. ఈ నిజం ఇప్పటికే నిరూపితం అయింది. భవిష్యత్తులోనూ అవుతుంది!! కాకపోతే ఇందులో ఒక ట్విస్టు ఉంది. ఈ రాజకీయ ప్రయోజనంలో అనుకోకుండా ఒక ప్రాంతానికి మంచి జరగడం వల్ల ఆ పాపం పరిహారం కావచ్చు. చెప్పలేం!

- గరుడ


Tags:    

Similar News