దివాకర్ రెడ్డి..తనయులకు రూట్ క్లియర్ చేశారా!

Update: 2019-06-05 07:50 GMT
ఇది చాలా అవమానకరమైన ఓటమి దివాకర్ రెడ్డికి. తను ఎన్నికలకు ముందే రిటైర్ మెంట్ ను అనౌన్స్ చేశారాయన. తను తప్పుకుని తనయుడికి అవకాశం ఇచ్చారు. మరోవైపు తమ్ముడు తప్పుకుని సొంత కోటలో తమ్ముడి తనయుడికి అవకాశం ఇచ్చారు. ఇలాంటి మార్పుతో దివాకర్ రెడ్డి తమ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని చూశారు.

తమ తనయులకు అవకాశం ఇచ్చి వారిని నయా 'జేసీ బ్రదర్స్' గా సెటిల్ చేయాలని దివాకర్ రెడ్డి - ప్రభాకర్ రెడ్డి భావించారు. అయితే ప్రజలు మాత్రం చాలా భిన్నమైన తీర్పును ఇచ్చారు. అటు దివాకర్ రెడ్డి తనయుడికి జనాలు ఝలక్ ఇచ్చారు. సొంత కోట తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి తనయుడిని ప్రజలు ఓడించారు.

ఇలాంటి నేపథ్యంలో ఒకింత నిస్పృహలోకే పడినట్టుగా ఉన్నారు జేసీ బ్రదర్స్. ఈ క్రమంలో తనయుల రాజకీయానికి తాము అడ్డు ఉండకూడదని కూడా జేసీ దివాకర్ రెడ్డి నిర్ణయించుకున్నట్టుగా ఉన్నారు. అందులో భాగంగానే ఆయన ఇటీవల మీడియా ముందుకు వచ్చి రాజకీయ సన్యాసాన్ని ప్రకటించారనే మాట వినిపిస్తూ ఉంది.

దివాకర్ రెడ్డి గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీలో ఏ మేరకు జులుం చలాయించారో కానీ - చంద్రబాబు మీద వీరవిధేయత చూపుతూ - ఆ క్రమంలో అడ్డగోలుగా మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అయితే చాలా పెద్ద శత్రువులా వ్యవహరించారు. తనకు తిరుగులేదు - ఎప్పటికీ తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉంటుంది అన్నట్టుగా దివాకర్ రెడ్డి మాట్లాడారు. ఆ విషయంలో ప్రభాకర్ రెడ్డి కూడా పోటీకి వచ్చారు.

ఇలా అన్నదమ్ములిద్దరూ చాలా హడావుడి చేశారు. ఆఖరికి ఈ పరిస్థితి ఎక్కడి వరకూ వెళ్లిందంటే.. ఇప్పుడు వారి తనయులు తెలుగుదేశం పార్టీని వీడి బయటకు వచ్చేందుకు కూడా కష్టం అనే పరిస్థితి వచ్చింది. వీర తెలుగుదేశం నేతగా దివాకర్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడు వారి తనయులు బయటకు వెళ్లేందుకు కూడా కష్టం అవుతోంది. ఈ క్రమంలోనే దివాకర్ రెడ్డి నష్ట నివారణ చర్యలకు దిగినట్టుగా తెలుస్తోంది.

అందులో భాగంగానే దివాకర్ రెడ్డి సీఎం జగన్ మీద సానుకూలంగా మాట్లాడుతూ ఉన్నారని - జగన్ తమవాడేనని అంటున్నారని - అలాగే మోడీ మీద కూడా సానుకూలంగా మాట్లాడి.. తమ వారసులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకో - బీజేపీలోకో చేరేందుకు ఏర్పాట్లను చేస్తూ ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు.
Tags:    

Similar News