సీఎం సీటు క‌మ‌ల్‌నాథ్‌ కే ఎందుకు ద‌క్కిందంటే

Update: 2018-12-14 05:09 GMT
తీవ్ర కసరత్తు తర్వాత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌ నాథ్ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. యువనేత జ్యోతిరాదిత్య సింధియా కూడా సీఎం పదవిని ఆశించినప్పటికీ.. కమల్‌ నాథ్‌ నే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎంపిక చేశారు. ఈ మేరకు కమల్‌ నాథ్‌ ను సీఎంగా నిర్ణయించినట్లు గురువారం రాత్రి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో కాంగ్రెస్ ప్రకటించింది. అయితే, కమల్‌ నాథ్‌ ను ఈ ప‌ద‌విని వ‌రించ‌డం వెనుక అనేక ఆస‌క్తిక‌ర‌మైన కార‌ణాలు ఉన్నాయి.

కాంగ్రెస్ అగ్రశ్రేణి నేతల్లో ఒకరు క‌మ‌ల్‌ నాథ్‌. ఇందిరాగాంధీ నుంచి రాహల్ వరకు సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీని వెన్నంటి ఉన్న వ్యక్తుల్లో 72 ఏళ్ల‌ కమల్‌ నాథ్ ముఖ్యులు. 1946 నవంబర్ 18న ఉత్తర్‌ ప్రదేశ్ లోని కాన్పూర్‌ లో మహేంద్రనాథ్ - లీనానాథ్ దంపతులకు కమల్‌ నాథ్ జన్మించారు. డెహ్రడూన్‌ లోని చదుకున్నారు. కోల్‌ కతా యూనివర్సిటీ కాలేజీలో బీకాం చేశారు. డూన్ స్కూల్‌ లో చదువుకుంటున్నప్పటినుంచే సంజయ్‌ గాంధీ - కమల్‌ నాథ్ మంచి స్నేహితులు. ఆ స్నేహమే ఆయనను తదనంతరకాలంలో కాంగ్రెస్ వైపు నడిపించింది. 1968లో పార్టీలో చేరిన కమల్‌ నాథ్ అనతికాలంలోనే కాంగ్రెస్ పెద్దలకు సన్నిహితుడయ్యారు. సంజయ్‌ గాంధీ కోటరీలో ముఖ్యుడిగా కమల్‌ నాథ్‌ కు పేరుంది. 1979లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో ఇందిరాగాంధీకి కమల్‌ నాథ్ చేదోడువాదోడుగా ఉన్నారు. కమల్ తనకు మూడో కుమారడని ఇందిర అప్పట్లో పలు వేదికలపై చెప్పేవారు. తన సుదీర్ఘరాజకీయ ప్రస్థానంలో కమల్‌ నాథ్ అత్యధికకాలం పార్లమెంటేరియన్‌ గానే ఉన్నారు.

1980లో తొలిసారిగా మధ్యప్రదేశ్‌ లోని చింద్వారా నుంచి ఎంపీగా గెలిచి లోక్‌ సభలో అడుగుపెట్టిన కమల్‌ నాథ్ ఇంతవరకు 9 పర్యాయాలు ఇదే నియోజకవర్గంలో గెలుపొందుతూ వచ్చారు. 2001 నుంచి నాలుగేళ్ల పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం నిలదొక్కుకోవడంలో కీలకంగా వ్యవహరించిన కమల్‌ నాథ్.. కేంద్రమంత్రిగా పర్యావరణ - జౌళిశాఖ - వాణిజ్య - పట్టణాభివృద్ధి - రవాణాశాఖల బాధ్యతలను నిర్వర్తించారు. రాజకీయ వ్యూహాల దురంధరుడు. ఆరునెలల క్రితమే కాంగ్రెస్ మధ్యప్రదేశ్ రాష్ట్రశాఖ సారథ్య బాధ్యతలు చేపట్టినప్పటికీ.. 15 ఏళ్ల‌ బీజేపీ పాలనకు చరమగీతం పాడి పార్టీని తన వ్యూహ రచనతో అధికారానికి చేరువచేశారు. కుమ్ములాటలు - అధిపత్య పోరుతో కునారిల్లుతున్న పార్టీని ఏకతాటిపై నడిపించారు. త‌ద్వారా సీఎం పీఠంపై కూర్చున్నారు.

కమల్ సతీమణి అల్కానాథ్ - వారికి ఇద్దరు కుమారులు. పారిశ్రామికవేత్తగా - వ్యవసాయదారుడిగానే కాకుండా.. సామాజిక సేవకుడిగా - రచయితగా రాణించారు. వివాదాలు కూడా కమల్ వెన్నంటే నడిచాయి. ఇందిర మరణానంతరం జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలోనూ ఆయన పాత్ర ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. కమల్ అమెరికాకు దేశరహస్యాలను చేరవేశాడని వికీలీక్స్ వెల్లడించడం దుమారమే రేపింది. నీరారాడియా టేపుల్లోనూ ఆయన పేరు వినిపించింది.
Tags:    

Similar News