అందుకే కేసీఆర్ కేబినెట్ ఏర్పాటు చేయ‌లేదా?

Update: 2019-02-12 07:54 GMT
మంత్రాల‌కు చింత‌కాయ‌లు రాల‌వన్న‌ది ఎక్క‌డైనా కానీ.. కేసీఆర్ లాంటి వీర భ‌క్తుడు ముందు కాదు. ముహుర్తాల‌కు భారీ ప్రాధాన్య‌త ఇవ్వ‌ట‌మే కాదు.. ముహుర్తం గీత‌ను దాటేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌ని త‌త్త్వం కేసీఆర్ లో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. అలాంటి కేసీఆర్..మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ విష‌యంలో  బ్ర‌హ్మండ‌మైన ముహుర్తాన్ని ఎందుకు మిస్ చేసుకున్న‌ట్లు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌లై రెండు నెల‌లు పూర్తి అయినా.. ఒక్క‌రంటే ఒక్క మంత్రితో ప్ర‌భుత్వ ర‌థాన్ని లాగుతున్న కేసీఆర్ మ‌న‌సులో ఏమున్న‌ద‌న్న‌ది ఇప్పుడు అస్స‌లు అర్థం కాని ప‌రిస్థితి. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసినంత‌నే మంత్రుల‌ను ఏర్పాటు చేయ‌టం ఎక్క‌డా ఉన్న‌దే. అందుకు భిన్నంగా రెండు నెల‌లు గ‌డిచిన త‌ర్వాత కూడా మంత్రి ప‌ద‌వులు ఇచ్చేందుకు కేసీఆర్ మ‌న‌సు ఎందుకు ఒప్పుకోవ‌టం లేద‌న్న మాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ నెల ప‌దిన బ్ర‌హ్మాండ‌మైన ముహుర్తం ఉంద‌ని.. ఆ రోజున మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఖాయ‌మ‌న్న క‌థ‌నాలు కొన్ని మీడియా సంస్థ‌లు అదే ప‌నిగా అచ్చేశాయి. స‌హ‌జంగా స‌ద‌రు మీడియా సంస్థ కానీ ముహుర్తాల్ని లెక్క‌లేసి చెబితే.. దానికి త‌గ్గ‌ట్లు కేసీఆర్ నిర్ణ‌యాలు ఉండ‌టం ఇటీవ‌ల వ‌ర‌కూ చూశాం. కానీ.. ఈసారి మాత్రం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి. ఎందుకిలా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

కేసీఆర్ మ‌న‌సు తెలిసినట్లుగా వార్త‌లు రాయ‌టంతో పాటు.. ఆయ‌న న‌మ్మ‌కాల్ని.. ఆయ‌న జాత‌క‌చ‌క్రాన్ని త‌న ద‌గ్గ‌ర పెట్టుకొని త‌ర‌చూ ప‌రిశీలిస్తూ.. లెక్క‌లు వేసి వార్త‌లు రాసే మీడియా సంస్థ ఒక‌టి ఈ మ‌ధ్య‌న మంత్రివ‌ర్గ ఏర్పాటుకు సంబందించిన ఆస‌క్తిక‌ర‌వార్త‌ను అచ్చేసింది. అందులో ఫ‌లానా రోజున‌.. ఫ‌లానా టైంలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఖాయ‌మ‌ని.. అందుకు కార‌ణం ముహుర్తం బ‌లంగా ఉండ‌టం.. అది కేసీఆర్‌ కు ఎంతగా క‌లిసి వ‌స్తుందో వివ‌రిస్తూ ఒక వార్త‌ను అచ్చేశారు.

ఎన్నిక‌ల నాటి నుంచి స‌ద‌రు మీడియా సంస్థ‌తో కేసీఆర్ కు పొస‌గ‌క‌పోవ‌టం.. త‌న‌ను దెబ్బ తీసేలా స‌ద‌రు మీడియా సంస్థ వ్య‌వ‌హ‌రించింద‌న్న భావ‌న‌తో ఉన్న ఆయన‌.. ఆ మీడియా సంస్థ మీద త‌న అస‌హ‌నాన్ని త‌న స‌న్నిహితుల వ‌ద్ద వ్య‌క్తం చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. త‌న‌ను చ‌దివేసిన‌ట్లుగా వ్య‌వహ‌రిస్తున్న వారి తీరుపై గుర్రుగా ఉన్న కేసీఆర్‌.. తాజాగా త‌న ముహుర్తాన్ని మార్చుకోవ‌టానికి ఇదో కార‌ణంగా చెబుతున్నారు.

స‌ద‌రు మీడియా సంస్థ‌లో చెప్పిందే ఎందుకు జ‌ర‌గాలి?  తాను కానీ మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేస్తే.. స‌ద‌రు మీడియా సంస్థ మాట‌కు త‌గ్గ‌ట్లే త‌న చ‌ర్య ఉంద‌న్న అభిప్రాయం ప్ర‌జ‌ల్లోకి వెళ్లే అవ‌కాశం ఉంద‌నే.. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌ను వాయిదా వేసిన‌ట్లుగా కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. ఏమైనా.. ఈసారి ముహుర్తాలకు టెంప్ట్ కాని కేసీఆర్ వ్య‌వ‌హ‌రం ఇప్పుడు ఒక ప‌ట్టాన మింగుడుప‌డ‌ని రీతిలో ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News