టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు ఉన్నట్లుండి జాతీయ రాజకీయాలను భుజానికెత్తుకున్నారు. జాతీయ రాజకీయాల్లో రాణించేందుకు ఏకంగా థర్డ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసే దిశగా ఆయన ప్రయత్నాలు ప్రారంభించేశారు. ఈ మేరకు అటు యూపీఏ - ఇటు ఎన్డీఏతో కలవకుండా ఉన్న పలు ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీల నేతలతో ఆయన మాట్లాడుతున్నారు. కొందరితో ఫోన్ లో మాట్లాడుతున్న ఆయన మరికొందరిని కలిసేందుకు ఏకంగా ప్రత్యేక విమానాల్లో విహరిస్తున్నారు. అయినా థర్డ్ ఫ్రంట్ దిశగా కేసీఆర్ చేస్తున్న యత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్న విషయాన్ని పక్కనపెడితే... కేసీఆర్ వ్యవహార సరళిని కాస్తంత నిశితంగా పరిశీలించే వారికి థర్డ్ ఫ్రంట్ ఓ పెద్ద వ్యూహంగానే కనిపించక మానదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కేసీఆర్... టీడీపీలో తనకు జరిగిన అవమానానంతో ఆ పార్టీని వీడి బయటకు వచ్చేసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని భుజానికెత్తుకున్నారు. ఉద్యమాన్ని నడిపేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట ఓ ప్రత్యేక పార్టీని స్థాపించిన కేసీఆర్ ఆ పార్టీనే తన రాజకీయ వేదికగానూ చేసుకుని ముందుకు సాగారు.
ఈ క్రమంలో 14 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా ఉంచడంతో పాటుగా మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణలోని అన్ని వర్గాలను ఒక్కదరికి చేర్చి ఉద్యమాన్ని హోరెత్తించారు. చివరకు తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగానూ ఏర్పాటు చేయించగలిగారు. మొత్తంగా తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కలను సాకారం చేసిన నేతగా కేసీఆర్ కు తిరుగులేని ఆదరణ దక్కిందనే చెప్పాలి. కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణకు తొలి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కేసీఆర్... చాలా కాలం పాటు అనారోగ్య సమస్యలతో సతమతమయ్యారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం ఖాయమన్న వార్తలు వినిపించాయి. ఇప్పటికే యువ ఎమ్మెల్యేగా - తన కేబినెట్ కీలక శాఖల మంత్రిగా ఉన్న కేటీఆర్‌ను ఎప్పటికప్పుడు కేసీఆర్ ఎలివేట్ చేస్తూనే వస్తున్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు దక్కిన బంపర్ విజయాన్ని కేటీఆర్ ఖాతాలో వేసేసిన కేసీఆర్... తన వారసుడు కేటీఆరేనని చెప్పకనే చెప్పేశారన్న వాదన కూడా లేకపోలేదు.
ఈ క్రమంలో ఇప్పటికే 64 ఏళ్ల వయసులో ఉన్న కేసీఆర్... వచ్చే ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించినా... మరింత కాలం పాటు పాలనా బాధ్యతలను చేపట్టే అవకాశాలు లేవన్న వాదన ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది. అయితే మొదటి నుంచి తన వెన్నంటి సాగిన అల్లుడు హరీశ్ రావును కాదని, నిన్నగాక మొన్న వచ్చిన కేటీఆర్ ను తన వారసుడిగా ప్రకటిస్తే... చాలానే సమస్యలు తప్పవు. ఈ క్రమంలో చిన్నగా జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నట్లుగా కలరింగ్ ఇవ్వడం, చాలా స్లోగా కేటీఆర్ ను ప్రమోట్ చేస్తే ఇబ్బంది ఉండదన్న భావనతోనే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ యోచన చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా ఇప్పటిదాకా కేసీఆర్ చేసిన యత్నాలను పరిశీలిస్తే.. ఈ వ్యూహం ఇట్టే అర్థం కాకమానదని విపక్షాలకు చెందిన పలువురు నేతలు చెబుతున్నారు. టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్... తాజాగా ఇదే వాదనను వినిపించారు. కేటీఆర్ ను సీఎం పీఠం ఎక్కించేందుకే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ మాటను భుజానికెత్తుకున్నారని ఆయన ఆరోపించారు.
ఫెడరల్ ఫ్రంట్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ చేస్తున్న యత్నాలేవీ ఫలించవని కూడా శ్రవణ్ పేర్కొన్నారు. నాలుగేళ్లుగా మోదీకి అనుకూలంగా మసలుకుని ఇప్పటికిప్పుడు ఎన్డీఏకు వ్యతిరేకంగా మారామంటే నమ్మేదెలా అంటూ ఆయన ప్రశ్నించారు. అసలు ఫెడరల్ ఫ్రంట్ దిశగా సాగుతున్న కేసీఆర్... పార్లమెంటులో బీజేపీ సర్కారుపై ఏపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో మోదీ వ్యతిరేక ఓటును చీల్చడమే లక్ష్యంగా కేసీఆర్ ముందుకు సాగుతున్నారని శ్రవణ్ ధ్వజమెత్తారు. తన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చర్యలు బెడిసికొట్టిన నేపథ్యంలోనే ఎవరూ పిలవకున్నా... కోల్ కతాకు వెళ్లిన కేసీఆర్... ఆక్కడ మమతా బెనర్జీతో భేటీ అయ్యారన్నారు. ఈ సందర్భంగా దీదీ సంధించిన ప్రశ్నలే కేసీఆర్ అసలు వ్యూహాన్ని బయటపడేస్తున్నాయని కూడా శ్రవణ్ ఆరోపించారు.