వారి కోస‌మే విమోచ‌న దినోత్స‌వాన్ని చేయ‌ట్లేదా?

Update: 2017-08-19 04:47 GMT
ఏదైతే చెప్పారో అదేమీ చేయ‌కుండా ఉండ‌టం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి అల‌వాటే. కాకుంటే త‌న మాట‌ల‌కున్న ఆక‌ర్ష‌ణ శ‌క్తితో ప్ర‌జ‌ల్లో అలాంటి ఫీలింగ్ ఏమీ క‌ల‌గ‌కుండా చేయ‌టం ఆయ‌న‌లోని గొప్ప‌త‌నంగా చెప్పాలి. మ‌రే ముఖ్య‌మంత్రికి సాధ్యం కాని ఆక‌ర్ష‌ణ కేసీఆర్ సొంతంగా చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొలి ముఖ్య‌మంత్రిగా ద‌ళితుడే ఉంటాడ‌ని.. కేసీఆర్ మాట అంటే మాటేన‌ని.. త‌ల తెగినా మాట త‌ప్ప‌నంటూ ఆయ‌న చేసిన ఆవేశ ప్ర‌సంగం తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన్న ప్ర‌తి ఒక్క‌రిని క‌దిలించివేసేలా చేసింది.

త్యాగానికి కేరాఫ్ అడ్ర‌స్ గా.. క‌ల‌ల ప్ర‌పంచాన్ని ఆవిష్క‌రించేందుకు కేసీఆర్ ఎంత‌గా శ్ర‌మిస్తున్నారో అన్న భావ‌న నాడు తెలంగాణ వాదుల్లో ఏర్ప‌డ‌టానికి ఆయ‌న మాట‌లు ఎంతో ప్ర‌భావాన్ని చూపించాయ‌ని చెప్పాలి. ప‌ద‌వుల మీదా.. ప‌వ‌ర్ మీదా ఎలాంటి ఆస‌క్తి లేద‌ని.. కేవ‌లం తెలంగాణ రాష్ట్ర సాధ‌న మాత్ర‌మే త‌న ల‌క్ష్యంగా ఆయ‌న అప్ప‌ట్లో చెప్పుకునేవారు. ఇదేరీతిలో తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే జ‌రుపుతామ‌ని కూడా ఆయ‌న చెప్పుకునేవారు.

నిజాం చెర నుంచి విమోచ‌నం చెందిన రోజును అధికారికంగా ఎందుకు జ‌ర‌ప‌రంటూ నాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని నిల‌దీసిన కేసీఆర్‌.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా అధికారికంగా విమోచ‌న దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు.అయితే.. అన్ని మాట‌లు చేత‌ల్లోకి రావ‌న్న చందంగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి.. కేసీఆర్ ప్ర‌భుత్వం చేతికి పాల‌నా ప‌గ్గాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. నేటికి విమోచ‌న దినోత్స‌వాన్ని అధికారికంగా నిర్వ‌హించేలా నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌టం క‌నిపిస్తుంది.

ఉద్య‌మ స‌మ‌యంలో ఇచ్చిన విమోచ‌న దినోత్స‌వ హామీని ఎందుకు అమ‌లు చేయ‌రంటూ ప్ర‌శ్నించినా.. ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం క‌నిపిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ వ్య‌వ‌హారంపై మొద‌ట్నించి బ‌లంగా త‌న వాద‌న‌లు వినిపిస్తున్న బీజేపీ నేత‌లు తాజాగా మ‌రోసారి గ‌ళం విప్పారు. కాక‌పోతే.. క‌మ‌ల‌నాథుల‌తో వ‌చ్చే స‌మ‌స్య ఏమిటంటే.. విమోచ‌న దినోత్స‌వాన్ని అధికారికంగా జ‌ర‌పాల‌న్న డిమాండ్ ను విమోచ‌న దినోత్స‌వం ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న‌ప్పుడు మాత్ర‌మే ప్ర‌స్తావిస్తారు త‌ప్పించి.. సంవ‌త్స‌ర‌మంతా ప‌ట్టించుకోక‌పోవ‌టం పెద్ద లోపంగా చెప్పాలి.

ఏడాదంతా అప్పుడ‌ప్ప‌డు మాత్ర‌మే ప్ర‌స్తావించి.. ఆగ‌స్టు వ‌చ్చేస‌రికి మాత్రం హ‌డావుడి చేయ‌టం తెలంగాణ బీజేపీ నేత‌ల్లో క‌నిపిస్తోంది.ఈ మాట‌కు త‌గ్గ‌ట్లే.. ఇటీవ‌ల కాలంలో బీజేపీ నేత‌లు త‌ర‌చూ విమోచ‌న దినోత్స‌వం గురించి మాట్లాడ‌టం మొద‌లైంది.

విమోచ‌న దినోత్స‌వాన్ని కేసీఆర్ స‌ర్కారు అధికారికంగా నిర్వ‌హించ‌క‌పోవ‌టానికి కార‌ణం మ‌జ్లిస్ అని.. అన‌ధికార మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్న మిత్రుడిని నొప్పించ‌కూడ‌ద‌నే విమోచ‌న దినోత్స‌వంపై నిర్ణ‌యం తీసుకోవ‌టం లేద‌ని ఆరోపిస్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేత‌లు విమోచ‌న దినోత్స‌వం గురించి మాట్లాడితే.. ఇప్పుడు మాత్రం కేంద్ర మంత్రుల స్థాయిలోనే ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించ‌టం గ‌మ‌నార్హం.

కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి హ‌న్స్ రాజ్ గంగారాం అహీర్ తాజాగా విమోచ‌న దినోత్స‌వాన్ని అధికారికంగా ఎందుకు నిర్వ‌హించ‌రంటూ ప్ర‌శ్నించ‌టం క‌నిపిస్తుంది. ర‌జాకార్ల వార‌స‌త్వంతో ఏర్ప‌డిన మ‌జ్లిస్ పార్టీ నొచ్చుకుంటుంద‌న్న ఉద్దేశంతోనే విమోచ‌న దినోత్స‌వాన్ని తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు నిర్వ‌హించ‌టం లేద‌న్న తీవ్ర వ్యాఖ్య‌ల్ని తెలంగాన బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం. మ‌రి.. ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు సీఎం కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.
Tags:    

Similar News