రేసుగుర్రాల్ని కేసీఆర్ అందుకే మార్చ‌నంటున్నారా?

Update: 2018-10-04 06:03 GMT
రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల సంగ‌తి త‌ర్వాత‌.. సొంతోళ్ల‌కు సైతం షాకిచ్చే స‌త్తా ఉన్న రాజ‌కీయ పార్టీ అధినేత ఎవ‌ర‌న్న ప్ర‌శ్న‌ను తెలుగు రాష్ట్రాల్లో  ఎవ‌రిని సంధించినా చ‌ప్పున వ‌చ్చే స‌మాధానం కేసీఆర్ అనే. ముంద‌స్తు కోసం తొమ్మిది నెల‌ల అధికారాన్ని వ‌దిలేసిన కేసీఆర్‌..అసెంబ్లీని ర‌ద్దు చేసిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే 105 మంది అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించ‌టం ద్వారా భారీ సంచ‌ల‌నానికి తెర తీశారు.

ముంద‌స్తుపై తానెంత ప్లానింగ్‌తో ఉన్నాన‌న్న విష‌యాన్ని ఆయ‌న త‌న చ‌ర్య‌ల‌తో చెప్పేశారు. కేసీఆర్ ప్ర‌క‌టించిన 105 మందిలో దాదాపు ప‌ది నుంచి ఇర‌వై అభ్య‌ర్థుల వ‌ర‌కూ త‌ప్ప‌నిస‌రిగా మార్చాల్సిన అవ‌స‌రం ఉన్న వారున్నారు. అయితే.. ఎవ‌రినీ మార్చేది లేద‌న్న మాట కేసీఆర్ నోటి నుంచి అదే ప‌నిగా వ‌స్తోంది.

ఏదో మీడియా వాళ్ల‌తోనో.. పార్టీ నేత‌ల‌తోనే కాదు.. కుటుంబ స‌భ్యుల ద‌గ్గ‌ర కూడా అదే మాట‌ను ఆయ‌న చెబుతున్నారు. మ‌రీ ముఖ్యంగా నాలుగైదు సీట్ల‌కు సంబంధించి మార్పులు త‌ప్ప‌నిస‌రి అన్న భావ‌న‌లో ఉన్న కేటీఆర్ మాట‌ను సైతం కేసీఆర్ కాద‌న్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. అభ్య‌ర్థుల మార్పున‌కు సంబంధించి కేసీఆర్ ఎందుకింత క‌టువుగా ఉన్నారు? అన్న ప్ర‌శ్న‌కు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర స‌మాధానం వస్తోంది.

ముంద‌స్తుపై భారీ ప్లానింగ్‌తో ఉన్న కేసీఆర్‌.. తాను అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించిన వెంట‌నే.. ఎన్నిక‌ల ఖ‌ర్చుకు సంబంధించిన ఫండ్ ను అభ్య‌ర్థుల‌కు చేర్చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఆ మొత్తం భారీగా ఉంద‌ని.. అభ్య‌ర్థుల‌కు అందిన నిధుల‌తో వారంతా హ్యాపీగా ప్ర‌చారం చేసుకోవ‌ట‌మే కాదు.. కేసీఆర్ ఫోటోకు భారీగా మొక్కేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

టికెట్లు వ‌చ్చిన అభ్య‌ర్థులంతా ఖ‌ర్చుల గురించి ఆలోచించుకోవాల్సిన అవ‌స‌ర‌మే లేకుండా కేసీఆర్ ఏర్పాట్లు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. అలా అభ్య‌ర్థులంద‌రికి నిధుల పంపిణీ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా ముగిసింద‌ని చెబుతున్నారు. ఇలాంటివేళ‌..అభ్య‌ర్థుల మార్పు అంటే చాలా పెద్ద ప‌నిగా కేసీఆర్ భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.  మార్పులు చేర్పులు చేయ‌ట‌మంటే త‌న మీద త‌న‌కు న‌మ్మ‌కం లేద‌న్న ప్ర‌చారంతో పాటు.. త‌న ఇమేజ్ భారీగా డ్యామేజ్ అవుతుంద‌న్న భావ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు స‌మాచారం.

అయినా.. అభ్య‌ర్థులు ఎవ‌ర‌న్న‌ది అస్స‌లు ముఖ్యం కాద‌ని.. ఎన్నిక‌ల్లో త‌న బొమ్మ‌ను చూసి ఓటు వేస్తార‌న్న ఆత్మ‌విశ్వాసం కేసీఆర్ లో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఈసారి ఎన్నిక‌ల ఓట్లు అన్నీ త‌న‌ను చూసి వేసేవే అని.. అలాంట‌ప్పుడు అభ్య‌ర్థులు ఎవ‌రైనా పెద్ద తేడా ప‌డ‌ద‌న్న మాట కేసీఆర్ నోటి నుంచి వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే అభ్య‌ర్థుల మార్పుకు నో అంటే నో అన్న‌ట్లుగా కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నట్లుగా తెలుస్తోంది. 
Tags:    

Similar News