కేటీఆర్ తెలంగాణ భ‌వ‌న్ కు రాని కార‌ణం ఇదేనా?

Update: 2019-02-13 05:32 GMT
స‌మ‌ర్థులైన నేత‌లు ఏ పార్టీకైనా వ‌రం లాంటోళ్లు. అలాంటిది స‌మ‌ర్థులైన అధినేత ఉండ‌టం ఏ పార్టీకైనా మ‌రింత మేలు చేసే అంశం. చాలా పార్టీల్లో అధినేత‌లు ఎంత తెలివిగా.. వ్యూహాత్మ‌కంగా ఉంటారో.. వారి వార‌సుల్లో అలాంటి చురుకుద‌నం క‌నిపించ‌దు. ఎక్క‌డో ఒక‌రిద్ద‌రు త‌ప్పించి.. చాలాసంద‌ర్భాల్లో తండ్రికి.. కొడుక్కి ఏ మాత్రం సంబంధం లేన‌ట్లుగా ఉండ‌టం క‌నిపిస్తుంది.

ఎక్క‌డి దాకానో ఎందుకు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధినేత‌ల్ని కాసేపు ప‌క్క‌న పెడితే.. మొన‌గాళ్లు లాంటి సీనియ‌ర్  నేత‌లు ప‌లువురికి.. వారి పుత్ర‌ర‌త్నాల‌కు సంబంధ‌మే ఉండ‌ని ప‌రిస్థితి క‌నిపించ‌క మాన‌దు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ముఖ్య‌మంత్రులుగా వ్య‌వ‌హ‌రించిన వారి పుత్ర‌ర‌త్నాల సంగ‌తే చూస్తే.. తండ్రికి త‌గ్గ త‌న‌యులుగా ఏ ఒక్క‌రు పొగడ్త‌ల్ని సొంతం చేసుకోవ‌టం క‌నిపించ‌దు. ఇందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర అధికార‌ప‌క్షంలో ఉంద‌ని చెప్పాలి.

టీఆర్ఎస్ అధినేత‌.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ఉన్నంత ఇమేజ్ అంత కాకున్నా.. వంక పెట్ట‌టానికి వీల్లేని రీతిలో కేటీఆర్ త‌న‌దైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నార‌ని చెప్పాలి. తండ్రి పెట్టిన ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధించ‌ట‌మే కాదు.. ఆయ‌న అప్ప‌జెప్పిన స‌వాళ్ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొన‌ట‌మే కాదు.. వాటికి చ‌క్క‌టి ఫ‌లితాలు ద‌క్కేలా చేయ‌టంలో కీల‌క భూమిక పోషించార‌ని చెప్పాలి.

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవ‌ల వెల్ల‌డైన ఫ‌లితాల్లో టీఆర్ఎస్ తిరుగులేని అధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించింది. రెండోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్‌..సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి చాలామందికి అందుబాటులోకి లేకుండా ఉండిపోయారు. అంతేకాదు.. త‌న‌కు బ‌దులుగా త‌న కుమారుడ్ని టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపిక చేసి.. త‌న బాధ్య‌త‌ల్ని కేటీఆర్ కు అప్ప‌జెప్పారు. రానున్న రోజుల్లో త‌న రాజ‌కీయ వార‌సుడిగా ప్ర‌క‌టించే క్ర‌మంలో ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా త‌న బాధ్య‌త‌ల్నికొడుక్కి అప్ప‌జెబుతున్న కేసీఆర్‌.. మిగిలిన పార్టీ నేత‌ల‌తో డిస్ క‌నెక్ట్ అవుతున్న‌ట్లుగా చెబుతున్నారు.

అదే స‌మ‌యంలో.. త‌న కొడుక్కి ద‌గ్గ‌ర చేసేలా ఆయ‌న ప్లాన్ చేస్తున్నారు తండ్రి వ్యూహానికి త‌గ్గ‌ట్లే కేటీఆర్ వ్య‌వ‌మ‌రిస్తూ.. పార్టీలోని చిన్నా.. పెద్ద‌ల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు. మంత్రి ప‌ద‌వులు మొద‌లుకొని.. ఇత‌ర ప‌ద‌వులు.. త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల‌కు సంబంధించిన అభ్య‌ర్థుల ఎంపిక నేప‌థ్యంలో ప‌లువురు ఆశావాహులు తెలంగాణ భ‌వ‌న్ చుట్టూ తిరుగుతున్నారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద‌ర్శ‌న భాగ్యం క‌లుగ‌కున్నా.. ప‌ద‌వుల పంపిణీ మొద‌లు ప‌లు అంశాల‌కు సంబంధించిన రిక్వెస్ట్ ల‌ను చిన్న సారు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాల‌ని త‌పిస్తున్నారు. త‌మ‌ను క‌ల‌వ‌ని కేసీఆర్ స్థానే.. కేటీఆర్ ను క‌ల‌వ‌టం ద్వారా చినబాబుకు త‌మ ఆస‌క్తుల్ని తెలిపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రోజులు గ‌డుస్తున్న‌కొద్దీ ఇలాంటివి అంత‌కంత‌కూ ఎక్కువ కావ‌టం.. మొహ‌మాటం ఎక్కువైపోవ‌టం.. కొంద‌రు ఓపెన్ గా అడుగుతున్న వాటికి స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితుల్లో ఉన్న కేటీఆర్.. ఇటీవ‌ల కాలంలో తెలంగాణ భ‌వ‌న్‌కు రావ‌టం మానేసిన‌ట్లుగా చెబుతున్నారు. తెలంగాణ భ‌వ‌న్ కు రావ‌టం.. సీనియ‌ర్ గులాబీ నేత‌లు అపాయింట్ మెంట్ అడ‌గ‌టం.. అనంత‌రం త‌మ ప‌ద‌వుల గురించి చ‌ర్చ‌ను తీసుకొస్తున్నార‌ట‌. త‌న‌కు సైతం చెప్ప‌కుండా నిర్ణ‌యాలు తీసుకునే త‌న తండ్రి వైఖ‌రి తెలిసిన కేటీఆర్ స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో.. తెలంగాణ భ‌వ‌న్‌కు కేటీఆర్ వ‌రుస‌గా డుమ్మా కొడుతున్నట్లు చెబుతున్నారు.

ఆశావాహుల హ‌డావుడి ఎక్కువ కావ‌టం..కొన్నిసార్లు మెహ‌మాటాల‌కు గురి చేసేలా నేత‌లు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌తో ఇబ్బంది ప‌డుతున్న కేటీఆర్‌.. కొన్నిరోజుల పాటు తెలంగాణ భ‌వ‌న్ కు రాకూడ‌ద‌ని డిసైడ్ అయిన‌ట్లుగా తెలుస్తోంది. తండ్రి ఎలానూ రారు.. కనీసం కొడుకు వ‌స్తేనైనా.. త‌మ ఆవేద‌న చెప్పుకోవ‌చ్చ‌ని భావించిన గులాబీ నేత‌ల‌కు కేటీఆర్ ఈ రీతిలో చెక్ పెట్ట‌టం ఆస‌క్తిక‌ర అంశంగా మారింది. గులాబీ పార్టీలో ఇప్పుడీ అంశం  హాట్ టాపిక్ గా మారిందని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News