జర్మనీలో కరోనా కేసులు ఎక్కువ - మరణ రేటు తక్కువ..ఎందుకు?

Update: 2020-03-24 03:30 GMT
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. సోమవారం నాటికి మూడున్నర లక్షల కేసులు నమోదు కాగా, 15 వేలమందికి పైగా మృత్యువాత పడ్డారు. లక్ష మందికి పైగా రికవరీ అయ్యారు. చైనా - ఇటలీ - అమెరికా - స్పెయిన్ - జర్మనీ - ఇరాన్ - ఫ్రాన్స్ - దక్షిణ కొరియా - స్విట్జర్లాండ్ - యూకే - నెదర్లాండ్స్ తదితర దేశాల్లో వేలల్లో కేసులు - వందల్లో మృతులు ఉన్నారు. కరోనా పుట్టిన చైనాలో 81వేల కేసులు నమోదు కాగా, 3,270 మంది చనిపోయారు. ఇటలీలో దాదాపు 60వేల కేసులు ఐదున్నర వేల మంది చనిపోయారు.

అమెరికాలో 459 మంది - స్పెయిన్‌ లో రెండువేల మందికి పైగా - ఇరాన్‌ లో 1800 మందికి పైగా - ఫ్రాన్స్‌ లో 674 మంది చనిపోయారు. దాదాపు ఈ దేశాలతో సమానంగా కరోనా కేసులు నమోదైన జర్మనీలో మాత్రం 115 మంది మాత్రమే చనిపోయారు. జర్మనీలో 27వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కేవలం 6వేల కేసులు నమోదైన యూకేలో 289 మంది - 5వేల కేసులు నమోదైన నెదర్లాండ్స్‌ లో 213 మంది - 9వేల కేసులు నమోదైన సౌత్ కొరియాలో 111 మంది - 8500 కేసులు నమోదైన స్విట్జర్లాండ్‌ లో 118 మంది చనిపోయారు. జర్మనీ కంటే కేసుల్లో మూడో వంతు కూడా లేవు. కానీ మృత్యువాతపడ్డవారు మాత్రం జర్మనీ కంటే ఎక్కువే. కొత్త కేసులు నమోదవడం లేదా అంటే.. అవి కూడా ఎక్కువే ఉన్నాయి. కానీ కేవలం చనిపోతున్న వారి సంఖ్య మాత్రం తక్కువగా ఉంది.

పర్సెంటేజీ ప్రకారం చూస్తే కరోనా బారినపడిన పది దేశాల్లో అత్యల్ప మరణాల రేటు జర్మనీదే. ఇటలీలో 9 శాతం - బ్రిటన్‌ లో 4.6 శాతం కాగా - జర్మనీలో 0.3 శాతం. జర్మనీలో మరణాలు తక్కువ ఉండటంపై ఆశ్చర్యపోతున్నారు. దీనిపై వివిధ రకాల వాదనలు వినిపిస్తున్నాయి. గణాంకాలు కరెక్టేనని కొందరు చెబుతుండగా, మరికొంతమంది డేటా సేకరణ వెనుక ఉన్న మెథడాలజీని ప్రశ్నిస్తున్నారు.

యూరోప్ మొత్తంల 65 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న జనాభా శాతం ఇటలీ - జర్మనీలలోనే అధికం. బ్లూమ్‌ బర్గ్ గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ ప్రకారం ఇటాలియన్లు.. జర్మన్ల కంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపాలని సూచిస్తోంది. ఇతర దేశాల కంటే కరోనాను ఎదుర్కోవడానికి వైద్యపరంగా జర్మనీ సిద్ధంగా ఉందని చెప్పడం తొందరపాటు అవుతుందని జర్మనీలోని హాంబర్గ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌ లో ఇన్‌ ఫెక్టియాలజీ డిపార్టుమెంట్ హెడ్ అడో అన్నారు.

ఉత్తర ఇటలీలోని ఆసుపత్రి కొత్త కరోనా కేసులతో నిండిపోయినప్పుడు జర్మనీ ఇంకా పూర్తి సామర్థ్యంతో లేదని - బెడ్స్ క్లియర్ చేసేందుకు - పరికరాల నిల్వకు - సిబ్బందిని పునఃపంపిణీ చేసేందుకు ఎక్కువ సమయం దొరికిందని అడో అన్నారు. మొదటి నుండే కరోనా కేసులు రిపోర్ట్ చేయబడినప్పుడు ప్రొఫెషనల్ కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం జర్మనీ ప్రారంభించిందన్నారు. కరోనాను ఎదుర్కోవడానికి మాకు కొంత సమయం దొరికిందన్నారు.

స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వారిని కూడా మొదట్లోనే ప్రారంభించింది. కరోనా సోకిన వ్యక్తితో సంబంధాలు కలిగిన వారిని, హైరిస్క్ ప్రాంతాల్లో పర్యటించిన వారిని పరీక్షించింది. అంతేకాదు, తొలి వారాల్లో ఈ వైరస్ సోకిన వారి వయస్సు ప్రొఫైల్ ఇతర దేశాల కంటే చిన్నది. వీరు ఫిట్‌ గా - ఆరోగ్యకరంగా ఉన్నవారు కావడం కూడా కలిసి వచ్చింది. అయితే రాబోయే రోజుల్లో జర్మనీలో మరణాల రేటు పెరిగే అవకాశముందని జర్మనీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహాదారు డ్రోస్టెన్ వ్యాఖ్యానించడం గమనార్హం.

జర్మనీలో ఒకరికి కరోనా నిర్ధారణ అితే డాక్టర్ స్థానిక ఆరోగ్యాధికారికి తెలియజేస్తారు. ఆ తర్వాత డేటాను డిజిటల్‌ గా రాబర్ట్ కోచ్ ఇనిస్టిట్యూట్‌ కు బదలీ చేస్తారు. డేటా సేకరణకు ఉపయోగించిన పద్ధతి సరిగా లేకపోవచ్చుననే వాదనలు కూడా ఉన్నాయి. జర్మనీలో వైరస్ సోకి ఇంటి వద్దనే మరణించిన వారిని పరిగణలోకి తీసుకోని ఉండకపోవచ్చునని అంటున్నారు. టెస్టులకు ముందే వారు ఇంటి వద్ద చనిపోతే వారిని గణాంకాలలో చూపించకపోయి ఉంటారని అంటున్నారు. మొత్తానికి జర్మనీలో మరణాల రేటు తక్కువగా ఉండటం ప్రశ్నార్థకమే అంటున్నారు.


Tags:    

Similar News