మ‌సూద్ పై ఉగ్ర‌ముద్ర వెనుక‌.. అస‌లు క‌థ ఇదే!

Update: 2019-05-03 08:27 GMT
రెండు రోజుల క్రితం.. సాయంత్రం వేళ‌లో టీవీ స్క్రోలింగ్స్ లోనూ.. మొబైల్ లోని న్యూస్ యాప్ నుంచి అదే ప‌నిగా నోటిఫికేష‌న్లు రావ‌టం మొద‌ల‌య్యాయి. అంత‌ర్జాతీయంగా భార‌త్ త‌న మొన‌గాడిత‌నాన్ని ప్ర‌ద‌ర్శించింద‌ని.. భారీ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి.

క‌రుడుక‌ట్టిన తీవ్ర‌వాది.. భార‌త నాశ‌నాన్ని కోరుకునే వాళ్ల‌ల్లో కీల‌కవ్య‌క్తి.. పాక్ లో రాజ‌భోగాలు అనుభ‌విస్తున్నా.. ఏమీ చేయ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్న మ‌సూద్ అజ‌హ‌ర్ ను అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా గుర్తిస్తూ నిర్ణ‌యం వెలువ‌డ‌టంపై భార‌త్ లోని మోడీ స‌ర్కారు చంక‌లు గుద్దుకుంది. ఇక‌.. మోడీ ప‌రివారం సంతోషానికి ప‌ట్ట‌ప‌గ్గాలు లేకుండా పోయాయి.

నిజంగానే.. మోడీ అండ్ కో చెప్పిన‌ట్లుగా.. అన్ని మీడియా సంస్థ‌లు అభివ‌ర్ణించిన‌ట్లుగా అంత‌ర్జాతీయ స‌మాజంలో భార‌త్ తిరుగులేని విజ‌యాన్ని సాధించిందా? అంటే.. కాద‌నే చెప్పాలి.

ఎందుకంటే.. మ‌సూద్ విష‌యంలో భార‌త్ సాధించింది ఏమిట‌న్న‌ది చూస్తే.. చేతికి వ‌చ్చింది ఏమీ లేక‌పోయినా.. చేతిలో ఉండే చ‌మురు (డ‌బ్బు) భారీగా పోయే ప‌రిస్థితి. ఎందుకిలా? అంటే అమెరికాకు జీ హుజూర్ అనే మోడీ స‌ర్కారు తీరుతో పాటు.. తాజాగా జ‌రుగుతున్న ఎన్నికల్లో మోడీకి ట్రంప్ అండ‌గా నిలిచార‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్న వారు లేక‌పోలేదు. ఈ ప్ర‌పంచంలో ఏదీ ఉచితంగా రాద‌న్న విష‌యాన్ని గుర్తు చేస్తున్న వారు లేక‌పోలేదు.తాజా ఉదంతం కూడా అలాంటిదేన‌న్న మాట వినిపిస్తోంది.

మ‌సూద్ ను అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌ట‌న చేయ‌టం ద్వారా.. భార‌త్ ఘ‌న విజ‌యం సాధించిన‌ట్లుగా పేర్కొంటున్నారు. అయితే..నిజంగా భారీ ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందా? అన్న‌ది చూస్తే.. ఏ దేశ అవ‌స‌రం దానికి ఉంద‌ని చెప్పాలి. ఆ విష‌యాన్ని రూఢీ అయ్యేలా తాజా ప‌రిణామం చోటు చేసుకుంద‌ని చెప్పాలి. 

మ‌సూద్ ను ప్ర‌పంచ ఉగ్ర‌వాదిగా పేర్కొంటూ ప్ర‌క‌ట‌న విడుద‌ల కావ‌టానికి ముందు.. తెర వెనుక చాలానే జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. ఇరాన్ కు అమెరికాకు మ‌ధ్య ర‌చ్చ న‌డుస్తోంది తెలుసు క‌దా? ఇరాన్ నుంచి ముడి చ‌మురు కొనొద్దంటూ పెద్ద‌న్న హోదాలో అమెరికా ఫ‌ర్మానా జారీ చేసింది. అయినా.. మ‌నం ఎవ‌రి ద‌గ్గ‌ర వంగి ఉండాల్సిన అవ‌స‌రం లేద‌న్న మాట‌లు పుస్త‌కాల్లో చ‌ద‌వ‌టానికి బాగుంటుంది కానీ ప్రాక్టిక‌ల్ గా అంతే తేలికైన విష‌యం  కాదు.

ఇప్ప‌టికి ప‌లుమార్లు అమెరికా చెప్పినా.. ఏదో ఒక‌టి చెబుతున్నా.. ఈసారి మ‌రింత గ‌ట్టిగా.. నో.. ఇరాన్ ద‌గ్గ‌ర చ‌మురు కొన‌ద్ద‌ని తేల్చేసింది. మ‌నం ఇరాన్ ద‌గ్గ‌ర చ‌మురు కొన‌క‌పోతే జ‌రిగే న‌ష్టం మామూలుగా ఉండ‌దు. ఎందుకంటే.. ఇరాన్ ద‌గ్గ‌ర మ‌నం కొనే చ‌మురుకు ఇచ్చే డ‌బ్బులు.. మ‌న రూపాయిలే. మామూలుగా అయితే.. అమెరిక‌న్ డాల‌ర్లు ఇవ్వాలి. ఇది మ‌న‌కు మేలు చేసే అంశం. మ‌రో అంశం.. చ‌మురు కోసం దాదాపు 90 రోజుల పాటు అప్పు ఇవ్వ‌టం.. ధ‌ర త‌క్కువ‌గా ఉండ‌టం.. డోర్ డెలివ‌రీ ఇవ్వ‌టం.. ఇలా చూసిన‌ప్పుడు ఇరాన్ ద‌గ్గ‌ర చ‌మురు కొన‌టానికి మించిన బెస్ట్ డీల్ మ‌రిక ఉండ‌దు.

కానీ..  అమెరికా మాట‌కు ఎదురు చెప్పి నిల‌వ‌టం అంత తేలికైన విష‌యం కాదు. అదే స‌మ‌యంలో.. తాను చెప్పిన‌ట్లుగా వినేలా భార‌త్ ఓకే చెప్ప‌టానికి మ‌సూద్ అజ‌హ‌ర్ ఇష్యూను అమెరికా తెర మీద‌కు తెచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. హిందీ రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ‌.. భావోద్వేగ అంశాల‌కు ఓట్లు వేసే ఓట‌ర్ల మైండ్ సెట్ తెలిసిన మోడీ అండ్ కో.. పెద్ద‌న్న డీల్ కు ఓకే అనేసిన‌ట్లుగా చెబుతున్నారు.

మ‌సూద్ ను అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ముద్ర వేసేందుకు మోకాల‌డ్డు పెడుతున్న చైనాను అమెరికా డీల్ చేయ‌టం.. ఏం చెబితే డ్రాగ‌న్ ఓకే అంటుందో ఆ విష‌యాన్ని పూర్తి చేయ‌టంతో.. మ‌సూద్ ను అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించేందుకు ఎలాంటి అడ్డంకి లేకుండా పోయింది. కీల‌క‌మైన హిందీ రాష్ట్రాల్లో ఎన్నిక‌లకు ముందు.. ఇంత‌టి శుభ‌వార్త‌ను మోడీ మాత్రం కాద‌న‌లేరు క‌దా?  వ‌సూద్ పేరుతో త‌న ఇమేజ్ మ‌రింత పెంచుకోవ‌టం ఒక ఎత్తు అయితే.. ఓట్ల వ‌ర్షం కురిసే ఛాన్స్ ను మిస్ చేసుకోలేరు క‌దా?


Tags:    

Similar News