ప్రియాంక కోపం ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది

Update: 2016-11-24 04:32 GMT
దాదాపు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన ఇప్పుడు పెద్ద వార్తగా మారింది. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రియాంక గాంధీ గురించి ఇప్పటివరకూ తెలిసిన దానికి భిన్నంగా.. తాజాగా ఆమెకు సంబంధించిన వివరాలే కాదు.. నాలుగు గోడల మధ్య తన తండ్రిని చంపిన కేసులో శిక్ష అనుభవిస్తున్న వారితో మాట్లాడిన వైనం ఇప్పుడు బయటకు వచ్చాయి.

రాజీవ్ గాంధీ హత్యకేసులో నిందితురాలిగా ఉన్న నళిని 2008లో వేలూరు జైల్లో రాజీవ్ గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందన్నది బయట ప్రపంచానికి పూర్తిగా తెలీదు. తాజాగా తన ఆత్మకథను రాసుకున్న నళిని పుస్తకంలో ఈ విషయాన్ని పేర్కొనటం.. ఇందుకు సంబంధించిన సమాచారం ఒక మీడియా సంస్థకు చేరింది. దీంతో.. పుస్తకం విడుదలకు ముందే ఈ వివరాలు బయటకు వచ్చాయి.

మాజీ ప్రధాని రాజీవ్ హత్య కేసులో నళిని.. మురగన్.. శాంతన్.. పేరరివాళన్ లతో పాటు.. ఏడుగురిని సీబీఐ దోషులుగా కోర్టులో పేర్కొంది. వీరికి తొలుత ఉరిశిక్ష పడింది. అనంతరం.. నళిని ఉరి కాస్తా యావజ్జీవ కారాగార వాసంగా మారింది. దేశంలో అత్యధిక కాలం యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న వ్యక్తిగా నళిని పేరిట రికార్డు ఉంది.

ఇదిలా ఉండగా.. తాజాగా నళిని ‘‘పాతి పెట్టిన నిజాలు’’ అంటూ తనకు తెలిసిన విషయాల్ని బయటపెట్టనున్నారు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న నళిని.. ప్రియాంక రహస్యంగా కలుసుకోవటం అప్పట్లో పెద్ద వార్తాంశంగా మారింది. ఈ సందర్భంగా నళినితో ప్రియాంక ఏం మాట్లాడారన్నది ఇప్పటికి బయటకు రాలేదు. తాజాగా విడుదల కానున్న పుస్తకంలో ఈ వివరాలు బయటకు రానున్నాయి. ఆరువందల పేజీలతో ఉన్న పుస్తకం ఈ రోజు(గురువారం) విడుదల కానుంది. విడుదలకు ముందే.. ఈ పుస్తకంలో పేర్కొన్న ప్రియాంక ఎపిసోడ్ బయటకు వచ్చింది.

 ప్రియాంక తనను కలిసిన సందర్భంగా తాము నిర్దోషులమని.. తమను అన్యాయంగా కేసులో ఇరికించినట్లుగా నళిని చెప్పగా.. ప్రియాంక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా పేర్కొంది. ప్రియాంక ఒక్కసారిగా తనపై ఆగ్రహం వ్యక్తం చేయటం తనలో కలకలాన్ని రేపిందని పేర్కొంది. అయితే.. క్షణాల్లో ఆమె తనతో అన్న మాటలు ఊరటనిచ్చాయని పేర్కొంది. ముందు నీ గురించి మాత్రం మాట్లాడు. మిగిలిన వారి గురించి వద్దంటూఆమె అన్న మాటలు నేటికీ గుర్తున్నాయని నళిని పుస్తకంలో పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. ఈ పుస్తకం కానీ విడుదల అయితే.. మరెన్నో సంచలన విషయాలు బయటకు వచ్చే వీలుందని చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News