మజ్లిస్ కు బీహార్ లో దెబ్బ ఎందుకు పడిందంటే..?

Update: 2015-11-14 03:59 GMT
బీహార్‌ లో మహాకూటమి ఘనవిజయం ఎంతటి ఆశ్చర్యం కలిగించిందో.. అక్కడ కొత్తగా బరిలోకి దిగిన మజ్లిస్ పార్టీకి గలిగిన ఘోరమైన భంగపాటు మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. భారతదేశంలోని ముస్లింలందరికీ తమదైన రాజకీయ పార్టీ ఒకటి ఉండాలనే లక్ష్యంతో హైదరాబాద్‌ కు మాత్రమే పరిమితమైన మజ్లిస్ పార్టీని ఒవైసీ సోదరులు దేశవ్యాప్తంగా విస్తరించాలని కంకణం కట్టుకున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో అందరికీ షాక్ తెప్పిస్తూ రెండు శాసన సభా స్థానాలను మజ్లిస్ గెల్చుకుంది. కానీ తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసిన అన్ని స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. కారణం ఏమిటి?

తోటి ముస్లింలే మజ్లిస్‌ కు ఓటేయకుండా దూరం జరగటానికి కారణం ఏమిటి? తాము పాకిస్తాన్ మద్దతుదారులం కామని, తాము భారతీయులమేనని పదే పదే రుజువు చేసుకోవడానికి భారతీయ ముస్లింలు దశాబ్దాలుగా అమమానాల పాలవుతూనే వస్తున్నారు. బీహార్ రాజకీయ రణరంగంలో బీజేపీ మెజారిటీ వాదాన్ని, ముస్లిం వ్యతిరేకతను ఎంత పరాకాష్టకు తీసుకుపోయిందంటే ముస్లిం ఓటర్లు గంపగుత్తగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు గుద్దేసారు.
ఈ క్రమంలో వారు మజ్లి‌స్‌ ను ఏమాత్రం పట్టించుకోలేదు. అది తమ మతస్తుల పార్టీ అనుకోలేదు. ఎవరు బీజేపీని ఓడిస్తారనిపిస్తే వారికి ఓటేశారు. అందుకే బీహార్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది.

ప్రచారం పూర్తిగా భయంగొలిపేటంతటి ఆధిక సంఖ్యాక వాదంతో సాగింది. భారత ముస్లింలు తమను పాకిస్తాన్‌ తో ముడిపెట్టడాన్ని అసహ్యించుకుంటారు. అయితే, అదే అవమానాన్ని వారు తరచుగా ఎదుర్కోవాల్సి వచ్చింది.  బీఫ్ తినేవారంతా పాకిస్తాన్‌ కు పోవాలని ఒకరంటే, షారూఖ్ ఖాన్ హృదయం పాకిస్తాన్‌ లోనే ఉందని మరొకరు. వీటన్నిటినీ తలదన్నేది... బిహార్‌ లో బీజేపీ ఓడిపోతే పాకిస్తాన్‌ లో టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకుంటారంటూ అమిత్ షా చేసిన హెచ్చరికే.

అందుకే బీజేపీ కనుక గెలిస్తే ఇక భారత్‌ లో తమ బతుకు బజారుపాలే అనే భయం వ్యాపించిపోవడంతో ముస్లింలు తమ బలమంతా కూడగట్టుకుని పైకి వచ్చి... ఎవరు బీజేపీని ఓడించి, తమను రక్షిస్తారనిపిస్తే వారికి ఓటు చేశారు. ఒవైసీ తుడిచి పెట్టుకుపోవడం, డిపాజిట్లు గల్లంతవడం వంటివన్నీ దాని పర్యవసానాలే. బీజేపీ ఈ ఎన్నికల్లో చేసిన అతిపెద్ద వ్యూహ తప్పిదం ఏమంటే ముస్లింలను వారి కిష్టం లేకున్నా సరే బలవంతంగా లౌకికవాద ముసుగులోని వివిధ పార్టీలకు చెందిన హిందూ నేతల గుప్పిటలోకి తోసేయడమే. భారతీయ ముస్లింలు తమ స్వంత అస్తిత్వం కోసం ఆరాటపడుతున్న దశలో పురిట్లోనే దాన్ని తుంచివేసేలా చేసింది బీజేపీ.

ఈ క్రమంలో బీజేపీ బీహార్‌‌లో సాధించిందేమీ లేక పోగా కులనేతలైన లాలూ - నితీశ్ వంటి వారిని ముస్లిం పరిరక్షకులుగా ముద్ర వేసింది. దేశవ్యాప్తంగా లౌకిక శక్తులంటున్న వారికి మళ్లీ గుర్తింపు తీసుకొచ్చింది. సూటిగా చెప్పాలంటే అలాంటి వారందరికీ కొత్త బతుకునిచ్చింది. బీజేపీ రాజకీయ ఆత్మహత్యకు బీహారే నాంది పలికింది.
Tags:    

Similar News