వైఎస్ చేసిన పాపం ఇప్పుడిలా చుట్టుకుందా?

Update: 2016-02-03 04:56 GMT
పాతబస్తీలో మజ్లిస్ నేతల ఆరాచకం కొత్తేం కాదు. చాలా పాత విషయం. అధికారంలో ఉన్న వారితో స్నేహంగా ఉన్నట్లు నటిస్తూ.. తమ అడ్డాలో తమకు ఎదురేలేనట్లుగా వ్యవహరించటం.. ఇంత పెద్ద రాష్ట్రంలో ఎడెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్ని పట్టించుకోకపోతే ఏం జరుగుతుందన్న చిన్నపాటి తేలికభావం మజ్లిస్ ను మరింత శక్తివంతంగా మార్చింది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. తమకు తిరుగులేదని.. తమ ఇలాకాలో మరో రాజకీయ పార్టీకి చోటు లేదన్నట్లుగా వ్యవహరించేవారు. మరే రాజకీయ పార్టీకి లేని సౌలభ్యం.. సౌకర్యం మజ్లిస్ కే ఎందుకు? అన్న ప్రశ్న రావొచ్చు. దీనికి ఒక కారణం లేకపోలేదు.

మజ్లిస్ కోరినట్లుగా పాతబస్తీ వరకూ వదిలేస్తే.. అధికారపార్టీ పైన పెద్దగా విమర్శలు చేయకపోవటం.. మజ్లిస్ ను మచ్చిక చేసుకుంటే రాష్ట్రంలోని మైనార్టీలంతా తమ పక్షానే ఉంటారన్న చిత్రమైన భ్రమలతో కాంగ్రెస్ ఉండేది. దీంతో.. మజ్లిస్ నేతలు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా సాగేది. ఎవరైనా తమను ప్రశ్నించినా.. తమకు ధీటుగా ఎదుగుతున్నారన్న భావన కలిగితే చాలు.. మరో మాట లేకుండా వారి మీద దాడి చేసేవారు.

ఏదైనా జరిగితే.. రచ్చ రచ్చ చేయగలిగిన సీపీఎం లాంటి కమ్యూనిస్ట్ పార్టీ సైతం మజ్లిస్ దెబ్బకు హడలిపోయింది. అసద్ అండ్ కో ఆరాచకాలపై మొండిగా కొన్నేళ్లు పోరాడినప్పటికీ.. తమకు ఎవరూ చేయూత ఇవ్వకపోటం.. తమపై దాడులు జరుగుతుంటే నాటి వైఎస్ సర్కారు కనీసం కేసులు కూడా బుక్ చేయకపోవటంతో పోరాడి.. పోరాడి అలిసిపోయి.. పాతబస్తీ మీద పట్టు పెంచుకోవాలన్న విషయాన్ని మధ్యలోనే వదిలేసింది.

నిజానికి సీపీఎంకు ముందు మజ్లిస్ కు ప్రత్యామ్నయంగా ఎంబీటీ (మజ్లిస్ బచావో తెహ్రీక్) ఎదగాలని ప్రయత్నించింది. అయితే.. ఆ పార్టీ అధినేత అమానుల్లాఖాన్ పై జరిగిన దాడులు.. అవమానాలు ఎన్నో. ఆయనపై మజ్లిస్ నేతలు.. కార్యకర్తలు ఘోరాతిఘోరంగా అవమానించటం.. దాడికి పాల్పడినా స్పందించాల్సిన చట్టం చేష్టలుడిగిపోయినట్లుగా ఉండటంతో ఆ పార్టీ పాతబస్తీలో పెద్దగా ఎదగలేకపోయింది. చంద్రబాబు హయాంలో మజ్లిస్ కు ముకుతాడు వేసి ఎంబీటీని ఎదిగే ప్రయత్నం చేసినా.. అది పెద్ద ఎత్తున సాగకపోవటం.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ సర్కార్.. మజ్లిస్ పట్ల సానుకూలత ప్రదర్శించారు.

ఇది.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీలను తిరుగులేని రీతిలో తయారు చేసింది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బంగ్లాదేశ్ రచయిత్రిపై మజ్లిస్ ఎమ్మెల్యేలు భౌతికదాడికి పాల్పడటం దగ్గర నుచి పలువురు ఉన్నతాధికారులపై నడి రోడ్డు మీదనే దాడి చేసినా పెద్దగా చర్యలు లేకుండా ఉండేవి. అదేమంటే.. వైఎస్ అండదండలు ఉండటం.. ఓవైసీ బ్రదర్స్ విషయంలో చూసీచూడనట్లుగా వ్యవహరించాలన్న విధానంతో మజ్లిస్ దూసుకెళ్లింది.

తమ ఓంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్న మజ్లిస్ కు ఎంతోకొంత ముకుతాడు వేసింది ఎవరైనా ఉన్నారా అంటే.. ఏపీ ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనే చెప్పాలి. మొండిగా ఉండే ఆయన ఓవైసీ బ్రదర్స్ విషయంలో చట్టం.. చట్టంలా పని చేసే పరిస్థితి కల్పించారు. కిరణ్ సర్కారు హయాంలో పని చేసిన పోలీసింగ్.. తెలంగాణ రాష్ట్రంలో చేష్టలుడిగిపోయిందన్న విమర్శ ఉంది. దీనికి తగ్గట్లే.. స్వయంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇంటిపైన మజ్లిస్ నేతలు దాడి చేస్తుంటే భద్రతా సిబ్బంది పారిపోవటం.. ఉప ముఖ్యమంత్రి కుమారుడిపైనే మజ్లిస్ ఎమ్మెల్యే చేయి చేసుకునే వరకూ వ్యవహారం వెళ్లిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థమవుతుంది.
Tags:    

Similar News