రద్దు ప్రకటన రాత్రి 8.30 గంటలకే ఎందుకు..?

Update: 2016-11-10 03:56 GMT
పెద్ద నోట్లను రద్దు చేస్తూ మంగళవారం రాత్రి 8.30 గంటల వేళ ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ కీలక ప్రకటన చేయటం తెలిసిందే. జనవరి 26.. ఆగస్టు 15 సందర్భంలో దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించే సంప్రదాయానికి భిన్నంగా ఆయన టీవీ తెర మీదకు వచ్చారు. దీంతో కాసింత ఆశ్చర్యానికి గురైన చాలామంది.. దాన్నుంచి తేరుకునే సమయానికే తన సంచలన నిర్ణయాన్ని ప్రకటించి భారీ షాక్ నే ఇచ్చారు.

మోడీ షాకింగ్ నిర్ణయాన్ని కాసేపు పక్కన పెడితే.. ఆయన తన నిర్ణయాన్ని మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలోనే ఎందుకు ప్రకటించినట్లు? అన్నది ఆసక్తికర ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం వెతికే ప్రయత్నం చేస్తే.. ఎంతో ముందుచూపుతో.. నల్లధనానికి చెక్ పెట్టేందుకు వీలుగా.. అక్రమార్కుల ఆటలు సాగకుండా ఉండేందుకు ఆయన భారీ వ్యూహాన్ని పన్నినట్లుగా కనిపిస్తుంది.

ప్రస్తుతం ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థలో దేశంలోని ప్రతి బ్యాంకు తమ రోజువారీ లావాదేవీల్ని హెడ్డాఫీసులకు వెల్లడించాల్సి ఉంటుంది.ఈ ప్రక్రియ మొత్తం ముగియటానికి రాత్రి 8 గంటల వేళ అవుతుంది. అంటే.. ఒక రోజులో జరిగిన లావాదేవీలు.. ఏ బ్యాంకులో ఎంత డిపాజిట్ ఉంది? క్లోజింగ్ బ్యాలెన్స్ లాంటివన్నీ రాత్రి 8 గంటలకు ఫైనల్ అవుతాయి. అందుకే మోడీ ఆ సమయాన్ని ఎంచుకున్నారు. ఒకవేళ పెద్ద నోట్లకు సంబంధించిన కీలక ప్రకటనను ఏ మధ్యాహ్నం వేళలో చేసి ఉంటే.. అక్రమార్కులు.. డబ్బులున్న బడా బాబులంతా తమకున్న పవర్ ను ఉపయోగించి చివరి క్షణాల్లో బ్యాంకుల్లో ఉన్న మొత్తాన్ని తమకు తగ్గట్లు తరలించుకొనే వీలుంది. చివరినిమిషపు లావాదేవీలతో తమదగ్గరున్న పెద్ద నోట్లను చిన్న నోట్గుగా మార్చుకోవటం.. బ్యాంకుల్లో భారీ ఎత్తున డిపాజిట్ చేయటం లాంటివి చేసేవారు. అలాంటి వాటికి చెక్ పెట్టేందుకే రాత్రి వేళను మోడీ ఎంచుకున్నట్లు చెప్పొచ్చు.

అంతేకాదు.. బంగారు వ్యాపారస్తుల్లో చాలావరకూ రాత్రి 9 గంటల సమయంలోనే తమ దుకాణాల్ని మూసేస్తుంటారు. మోడీ ప్రకటన వెలువడిన తర్వాత తమ దగ్గరున్న పెద్ద మొత్తాల్ని బంగారం రూపంలో మార్చుకునే అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు వీలుగా రాత్రి 8.30 గంటల సమయాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.వీటితో పాటు స్టాక్ మార్కెట్ ప్రభావానికి గురి కాకుండా ఉండటం.. ఏటీఎంల దగ్గర అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండటం.. పెద్ద నోట్లను మార్చుకునేందుకు ఎక్కువ సమయం లేకుండా ఉండేలా ప్రధాని జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పాలి. అందుకే.. తాను అనుకున్నది అనుకున్నట్లు జరగటానికి రాత్రి 8.30 గంటలకు మించిన సమయం మరొకటి లేదని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News