ప్రధాని ఏపీ పర్యటన వాయిదా? కారణమిదే?

Update: 2018-12-28 07:03 GMT
నిరసనలు ఒకవైపు.. అవసరాలు మరోవైపు.. వెరిసి ప్రధాని నరేంద్రమోడీ ఏపీ పర్యటన వాయిదా పడే అవకాశాలే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. వచ్చే నెల 6న మోడీ కేరళ - ఏపీలో పర్యటించేందుకు ముహూర్తం ఖరారైంది. కానీ కేరళ పర్యటనలో సభ వేదిక మార్పుతో ఏపీ పర్యటనను దాదాపు రద్దు చేసుకున్నట్టు వార్తలొస్తున్నాయి.

కేరళలో శబరిమల వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేరళలో బలపడేందుకు శబరిమల వివాదాన్ని తెరపైకి తెస్తున్న కమలనాథులు అక్కడ మైలేజ్ పొంది ఓట్లు రాబట్టుకునేందుకు ప్రధాని మోడీ పర్యటనను అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇందులో భాగంగా.. కేరళలో మొదట అనుకున్న తిరువనంతపురంలో జరిగే బహిరంగ సభను శబరిమలై సమీపంలోని పట్టణంతిట్టాకు మార్చాలని కేరళ బీజేపీ వర్గాలు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నాయి. అయితే ఏరియల్ రూట్ లేని పట్టణం తిట్టలో సభ జరిగితే మోడీ సకాలంలో ఏపీలోని గన్నవరంకు విమానాశ్రయానికి చేరుకోలేరు. దీంతో జనవరి 6న ఏపీలో జరగాల్సిన సభను వాయిదా వేయక తప్పదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

పట్టణం తిట్టలో సభ పెడితే శబరిమల ఆలయం వివాదాన్ని క్యాష్ చేసుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. సుప్రీం కోర్టు శబరిమలలోకి మహిళల ప్రవేశంపై అనుమతివ్వగానే బీజేపీ కేరళలో వ్యతిరేకిస్తోంది. శబరిమలలో దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పట్టణం తిట్టలో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలోనే సభ పెట్టాలని బీజేపీ నేతలు యోచిస్తున్నారు.

అయితే ఇప్పటికే ఏపీలో ప్రధాని సభ కోసం గుంటూరులో రాష్ట్ర బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రధాని సభను అడ్డుకుంటామని టీడీపీతోపాటు వామపక్ష పార్టీలు ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాంతో పాటు బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఢిల్లీలో 12 - 13వ తేదీల్లో నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా వాటిని ముందుకు జరపాలని నిర్ణయిస్తున్నారు. ఈ ప్రభావంతో ప్రధాని మోడీ ఏపీ పర్యటన రద్దు అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి.
Tags:    

Similar News