ప‌న్నీరుకు సీఎం పీఠం...ప‌ళ‌ని లెక్క‌లు వేరే

Update: 2017-04-23 07:06 GMT
త‌మిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో నెల‌కొన్న రాజకీయాలు మళ్లీ రసకందాయంలో పడ్డాయి. అన్నాడీఎంకెలో విలీన ప్రక్రియ వేగవంతమైన తరుణంలో ముఖ్యమంత్రి పీఠంపై మళ్లీ పన్నీర్‌ సెల్వంను కూర్చుబెట్టనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న పళని స్వామిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ దిశగా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం గ్రూపు - పళని స్వామి గ్రూపు మధ్య చర్చలు జోరుగా సాగుతున్నాయి.  అయితే ప‌ళ‌నిస్వామి - ఆయ‌న వ‌ర్గం ఈ ఒప్పందానికి ఓకే చెప్ప‌డం వెనుక రాజ‌కీయ‌-ఆర్థిక‌ప‌ర‌మైన కార‌ణాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో ఖాళీ అయిన ఆర్కే న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక ప్ర‌చారం స‌మ‌యంలోనే రాష్ట్ర ఆరోగ్య మంత్రి సి. విజయ్‌ భాస్కర్‌ పై ఐటీ శాఖ దాడులు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిణామంతో కొంత మంది మంత్రులు ప‌ళ‌ని మంత్రివర్గంలో కొనసాగడానికి ఇష్టం పడ్డం లేదు. ఆయ‌న కంటే బ‌ల‌వంతుడు - కాస్త ప‌లుకుబ‌డి ఉన్న పన్నీరు సెల్వం వర్గం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో కంగుతిన్న పళిని స్వామి వర్గం బెట్టు సడలించిందని, పన్నీరు వర్గం డిమాండ్‌ లకు తలొగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందులో భాగంగా సీఎం పీఠం సెల్వంకు ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే శశికళ వర్గాన్ని పార్టీ నుంచి బయటకు పంపాలనే డిమాండ్‌ పై ప్రతిష్టంభన కొనసాగుతున్నట్లు సమాచారం. అలాగే మ‌రో మంత్రి విజయ్‌ భాస్కర్‌ ను మంత్రి పదవి నుంచి తొలగించి మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీని మంత్రివర్గంలో చేర్చుకోవడానికి కూడా పళని వర్గం ఓకే చెబుతోంది.

ఇదిలాఉండ‌గా...చిన్న‌మ్మ శశికళ - ఆమె బందువు దినకరన్‌ ను పార్టీ నుంచి బహిష్కరించామని ప్రకటనలు వస్తున్నా. వారిద్దరూ సాంకేతికంగా ఇంకా పార్టీ సభ్యులే. అలాగే పన్నీర్‌ - పళిని వర్గాలు ఏకమవుతుండటంతో తమపై ఎక్కడ వేటు వేస్తారోనని మరోవైపు శశికళ వర్గం ఎమ్మెల్యేలు ఆందోళనలో ఉన్నారు. దీంతో సెల్వం వ‌ర్గంలోకి జంప్ చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు స‌మాచారం. ఏది ఏమైనా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తొలగించడంపై ఇరు వర్గాలు పట్టుదలగా వున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు వర్గాలు ఒక్కటిగా కలిసిపోయి రెండాకుల గుర్తుపై పోటీ చేయడంపై దృష్టి పెట్టాయి. మ‌రోవైపు ఢిల్లీకి వెళుతున్న  ముఖ్యమంత్రి పళిని స్వామి అక్కడ జరిగే నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొంటారు. అనంత‌రం ప్రధాని మోడీతో సమావేశమై రాష్ట్ర రాజకీయాలపై చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News