భీమవరం నుంచే పవన్... ఎందుకు?

Update: 2019-03-20 07:12 GMT
జనసేనాని పవన్ కళ్యాణ్ ఎవ్వరూ ఊహించని విధంగా ఈసారి రెండు చోట్ల బరిలో నిలుస్తున్నారు. అందులో తన సొంత గడ్డ నరసాపురం కాదని.. భీమవరంను పవన్ ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పవన్ నిర్ణయం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆయన అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.

అయితే పవన్ భీమవరం నుంచి ఎందుకు పోటీచేస్తున్నాడన్న ప్రశ్న ఇప్పుడు అందరి మదిని తొలిచేస్తోందట.. అయితే అక్కడ స్వయంగా పర్యటించిన పవన్ భీమవరం సమస్యలపై పోరాడేందుకు.. పరిష్కరించేందుకే ఈ అసెంబ్లీ స్థానాన్ని ఎంచుకున్నట్టు జనసేన నేతలకు చెప్పారట..

ప్రధానంగా పవన్ ను భీమవరం నుంచి పోటీచేయించడానికి అక్కడి సమస్యలే కారణమట.. భీమవరం డంపింగ్ యార్డ్ ఏళ్లతరబడి అలాగే ఉండడం చూసి పవన్ కలత చెందాడని జనసేన నాయకులు పంచుకున్నారు. అలాగే ఇక్కడ నాయకులు ఎదిగారు తప్పితే పట్టణం అభివృద్ధి చెందలేదని.. యనమదుర్ర మురికికాలువ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపాడట.. నిర్లక్ష్యానికి నిలువటద్దంలా ఉన్న భీమిలిని, ఇక్కడి రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకే తాను భీమవరం నుంచి బరిలోకి దిగుతున్నట్టు పవన్ చెప్పారని స్థానిక నేతలు చెబుతున్నారు.

పాలకొల్లులో చిరంజీవి ప్రజారాజ్యం తరుఫున నిలబడి ఓడిపోయాక పవన్ ఇక్కడ బాగా పరిశోధించాడట.. తరుచుగా పశ్చిమలో పర్యటించి బలోపేతం చేశాడట.. అందుకే సొంతూరు పాలకొల్లు కాకుండా పక్కనే ఉన్న భీమవరం ను పవన్ ఎంచుకున్నట్టు  తెలిసింది.

భీమవరంలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండడం.. రాష్ట్రంలోనే పేరున్న పట్టణం.. తన సొంత జిల్లా కావడం.. అన్ని వర్గాలతో కూడిన ప్రాంతం - అభివృద్ధి చెంది ఉండడం  ఆర్థిక - సామాజిక వర్గాల్లో ఎవరికెవరూ తీసిపోకుండా ఉండడం పవన్ ను ఆకర్షించినట్టు జనసేన నేతలు చెబుతున్నారు. అలాగే భీమవరం నుంచి బరిలోకి దిగితే  దీని ప్రభావం జిల్లా అంతటా పడుతుందని పవన్ ఈ ప్లాన్ వేసినట్టు సమాచారం. పైగా తాను చదువుకున్న డీఎన్ఆర్ కళాశాల వైభవాన్ని పదేపదే ప్రస్తావించి జగన్ ఇక్కడ పరీక్షలు వెళ్లి వచ్చిన రోజులను ప్రస్తావించి సెంటిమెంట్ తో పోటీకి దిగిబోతున్నట్టు తెలిసింది.

వాస్తవానికి భీమవరం సీటును పార్టీ కన్వీనర్ యిర్రింకి సూర్యరావు ఆశించారు. ఇప్పుడు పవన్ పోటీతో ఆయనకు మరోస్థానం కేటాయిచిస్తారని సమాచారం. పవన్ పోటీతో భీమవరమే కాదు.. జిల్లా అంతటా రాజకీయం వేడెక్కిందని నేతలు ధీమాగా ఉన్నారు.
Tags:    

Similar News