యూపీకి ప‌వ‌న్‌.. ఎందుకో తెలుసా?

Update: 2018-10-24 07:27 GMT
రెండు ప‌డ‌వ‌ల మీద కాళ్లు వేయ‌టం ప‌వ‌న్ కు అల‌వాటే. కొన్నిసార్లు ఆయ‌న మూడు.. నాలుగు ప‌డ‌వ‌ల మీద కూడా కాళ్లు వేస్తుంటారు. తాజాగా ఆయ‌న తీరు చూస్తే.. ఈ విష‌యం ఇట్టే అర్థం కాక మాన‌దు. ఓప‌క్క రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని వ్య‌వ‌స్థాగ‌తంగా ప‌టిష్టం చేయ‌ని ప‌వ‌న్‌.. అప్పుడే జాతీయ రాజ‌కీయాల మీద దృష్టి సారించారా? అంటే అవున‌న్న భావ‌న క‌లిగేలా ఉంది.

తాజాగా ఆయ‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ కు వెళ్లారు. గ‌డిచిన రెండు రోజులుగా సిక్కోలు తుఫాను బాధితుల‌కు సాయం అందించ‌టంలో ఏపీ స‌ర్కారు వైఫ‌ల్యాల్ని ఎండ‌గ‌ట్టిన ఆయ‌న‌.. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ కు వెళ్లారు. ఇంత‌కీ యూపీకి ప‌వ‌న్ ఎందుకు వెళ్లిన‌ట్లు? అక్క‌డ ఎవ‌రిని క‌ల‌వ‌నున్నారు? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఆస‌క్తిక‌రంగా మారాయి.

బీఎస్పీ అధినేత్రి మాయావ‌తితో భేటీ కోసం ప‌వ‌న్ ల‌క్నోకు వెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ మ‌ధ్య కాలంలో త‌న ప‌క్క‌న పెట్టుకొని తిప్పుతున్న నాదెండ్ల మ‌నోహ‌ర్ ను ఆయ‌న వెంట పెట్టుకెళ్లారు. వారిద్ద‌రితో పాటు ప‌లువురు జ‌న‌సేన ప్ర‌తినిధులు.. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యానికి చెందిన విద్యార్థులు.. విద్యా వేత్త‌లు సైతం ల‌క్నోకు వెళ్లారు. రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగ‌స్వామ్య ప‌క్షాల కూట‌మి ప్ర‌ధాని అభ్య‌ర్థిగా మాయావ‌తి పేరు వినిపిస్తున్న త‌రుణంలో ఆమెతో ప‌వ‌న్ భేటీ కావాల‌ని నిర్ణ‌యం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌లో.. జాతీయ నాయ‌కుల‌తో ట‌చ్ లో ఉండ‌టంతో పాటు.. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లుగా కూట‌మిలో చేరేందుకు వీలుగా ప‌వ‌న్ ప్ర‌య‌త్నాలు స్టార్ట్ చేసిన‌ట్లు చెబుతున్నారు. మ‌రి.. మాయ‌వ‌తి భేటీలో ప‌వ‌న్ ఏయే అంశాలు చ‌ర్చించ‌నున్నారు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News