పవన్ ‘తుని’ ఎందుకు వెళ్లటం లేదు?

Update: 2016-02-02 04:47 GMT
సినీ నటుడు కమ్ రాజకీయ నేత అయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాస్త డిఫరెంట్. సగటు రాజకీయ నాయకుడి తీరుకు ఆయన చాలా భిన్నం. తెర మీద ఎలా అయితే పరిణితి చెందిన వ్యక్తిగా కనిపిస్తారో.. నిజ జీవితంలోనూ అదే తరహాలో వ్యవహరించటం అంత చిన్న విషయం కాదు. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టినట్లుగా చెప్పిన ఆయన... పార్టీకి చెందిన పనులు ఇప్పటివరకూ చేపట్టకపోవటం గమనార్హం.

రాజకీయ పార్టీ ఎవరైనా పెడితే.. రాజకీయాలు మొదలెట్టేస్తారు. కానీ.. పవన్ అందుకు భిన్నం. తాను స్టార్ట్ చేసిన పార్టీలో తను మాత్రమే కనిపిస్తారు. చెప్పుకోవటానికి.. లేదంటే ఆయన తరఫున మాట్లాడే వారు కూడా కనిపించరు. మరో నాయకుడు అన్నది లేకుండా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే పవన్ జనసేన మాత్రమే. వ్యక్తిగా మాట్లాడే కన్నా.. ఒక పార్టీ అధినేతగా మాట్లాడటం సబబుగా ఉంటుందని భావించిన పవన్ కల్యాణ్.. అందులో భాగంగానే పార్టీ పెట్టినట్లుగా చెప్పొచ్చు.

పార్టీ పెట్టి కాస్త ఇటూఇటూగా రెండేళ్లు అవుతున్నా.. ఆయన రోటీన్ రాజకీయ పార్టీలకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టారాజ్యంగా వ్యవహరించే తీరుకు పవన్ పూర్తిగా వ్యతిరేకం. రెచ్చగొట్టే మాటలు.. విమర్శలతో అగ్గి పుట్టించే వైఖరికి ఆయన దూరంగా ఉంటారు. రాజకీయ నాయకులు నిత్యం ప్రజల్లో కనిపిస్తారు. కానీ.. పవన్ అందుకు మినహాయింపు. అదే సమయంలో ఏదైనా అనుకోని ఘటన జరిగితే.. ఎక్కడున్నా వెను వెంటనే రియాక్ట్ అవుతారు. కించిత్ ఆలస్యం కూడా చేయరు.

ఏదైనా పెద్ద సంఘటన జరిగినప్పుడు మరో ఆలోచన లేకుండా దూసుకెళ్లే పవన్.. అంతా బాగున్నప్పుడు అస్సలు మాట్లాడరు. బయట కనిపించరు. తన మానాన తాను పని చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే కేరళ షూటింగ్ కు వెళ్లి.. అంతా సిద్ధం చేసుకుంటున్న సమయంలోనే తునిలో కాపు ఐక్య గర్జన సభ జరగటం.. అనంతరం భారీ హింస చోటు చేసుకోవటం జరిగింది.

ఈ ఉదంతం జరిగిన రెండు గంటల లోపులే.. అన్ని టీవీ ఛానళ్లకు.. మీడియా సంస్థలకు పవన్ తరఫున ప్రకటన ఒకటి వచ్చేసింది. ఈ అంశంపై పవన్ సోమవారం మధ్యాహ్నం మాట్లాడతారని. షూటింగ్ లో భాగంగా కేరళలో ఉన్నారని.. ఆయన హైదరాబాద్ కు తిరిగి వచ్చేస్తున్నారంటూ బ్రేకింగ్ న్యూస్ ఫ్లాష్ అయ్యింది. దురదృష్టకర సంఘటనలు జరిగినా.. ఊహించని ఉత్సాతం చోటు చేసుకున్నా వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లే అలవాటున్న పవన్.. తునికి మాత్రం వెళ్లనని తేల్చేశారు.

కులాల ప్రసక్తికి దూరంగా ఉండే ఆయన.. తాజాగా చోటు చేసుకున్న తుని ఘటనకు స్పందించారే కానీ.. తాను అక్కడికి వెళ్లనని స్పష్టం చేశారు. అనవసర భావోద్వేగాలు రెచ్చగొట్టటంతో పాటు.. బాధితులు అంటూ లేని ఘటన విషయంలో వ్యక్తిగతంగా వెళ్లటం అనవసరమన్న భావన కావొచ్చు. కాపు కులానికే చెందిన పవన్ లాంటి నేతను కాపులు తమ కుల నాయకుడిగా ఫీలైన సందర్భాలు ఉన్నాయి. అదే రీతిలో ఆయన్ను కొలిచిన వాళ్లు ఉన్నారు. అయితే.. తాను కులాలకు.. మతాలకు దూరమని తొలి నుంచి పవన్ చెబుతూనే వచ్చారు.

తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై పవన్ స్పందించిన తీరు చూస్తే.. జరిగిన అన్ని అంశాలపై ఆయన బాధ్యతతో.. ఆచితూచి స్పందించినట్లు కనిపిస్తుందే తప్పించి.. తన వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవటానికి సిట్యూవేషన్ ను వాడుకునే తీరు అస్సలు కనిపించదు. ఎలాంటి ప్రయోజనాల్ని ఆశించకుండా తనను ప్రేమించే ప్రజలంతా బాగుండాలని భావించే పవన్ లాంటి వాళ్లు తునికి వెళ్లరు.
Tags:    

Similar News