సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ గిరీ కోసం ప్రముఖంగా వినిపించిన ఇంకా చెప్పాలంటే..కొన్ని మీడియా సంస్థలు ఊదరగొట్టిన సినీ ప్రముఖుడు కే రాఘవేంద్రరావుకు ఆ చాన్స్ దక్కనుందట. గతంలో ఆయన పేరు తెరమీదకు వచ్చినప్పటికీ..వెనక్కు పోయిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఆశలు చిగురించాయని అంటున్నారు. సినీ దర్శకుడు కే రాఘవేంద్రరావు అధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబును సినీ ప్రముఖుల బృందం కలిసింది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సినీ రంగం ప్రముఖులు ముందుకు వచ్చారని చెప్తున్నప్పటికీ..కొందరు మాత్రం టీటీడీ పదవి కోసమని అంటున్నారు.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం చంద్రబాబును కలిసిన వారిలో రాఘవేంద్రరావు, కిరణ్, అశ్వినీ దత్ తదితరులు ఉన్నారు. ప్రత్యేక హోదా పై కేంద్రం ప్రవర్తిస్తున్న తీరుకు చంద్రబాబు నల్ల బ్యాడ్జీతో నిరసన తెలుపుతుండగా... వీరు కూడా చంద్రబాబును కలిసి నప్పుడు నల్ల బ్యాడ్జీలు ధరించి చంద్రబాబు నిరసనకు మద్దతు తెలిపారు. ఈ రోజు చంద్రబాబుతో భేటీ అయిన సినీ బృదం సభ్యులు కూడా ఆయనతో సమావేశం జరిగిన సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి తమ వంతు నిరసన వ్యక్తం చేశారు.
మరోవైపు సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు కు టీటీడీ చైర్మన్ బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పటికే సభ్యుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో, రాఘవేంద్రరావు భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, కొద్దికాలం క్రితం తను ఆ పదవిని ఆశించడం లేదని రాఘవేంద్రరావు తెలిపారు. తన పేరు టీటీడీ చైర్మన్ రేసులో ఉందనే విషయం నిజంకాదని రాఘవేంద్రరావు పత్రికా ప్రకటన విడుదల చేశారు. అలా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఎస్‌వీసీసీ చానల్ ద్వారా తాను సంతృప్తిగా ఉన్నానని..ఇది ఎంతో సంతృప్తిని ఇస్తోందన్నారు.