పాపం ద్రవిడ్.. ఓటు వేయలేకపోయాడు

Update: 2019-04-18 07:37 GMT
భారత మాజీ క్రికెటర్, కర్ణాటక ఎన్నికల కమిషన్ బ్రాండ్ అంబాసిడర్ అయిన రాహుల్ ద్రావిడ్ కు ఈసారి చేదు అనుభవం ఎదురైంది. కర్ణాటకలో ఎన్నికల వేళ ఆయన అందరికీ ఓటు వేయండని పిలుపునిచ్చాడు. అనేక ప్రకటనల్లో నటించి పిలుపునిచ్చాడు. కానీ స్వయంగా ఆయన ఓటు వేయలేకపోయాడు.

అయితే ఎంతో ఆశగా రాహుల్ ద్రావిడ్ ఓటు వేయడానికి వెళ్లగా.. ఆయన పేరు జాబితాలో లేదు. రాహుల్ తోపాటు ఆయన భార్య పేరు కూడా ఓటరు జాబితాలో లేకపోవడంతో ఆయన హతాషుడయ్యాడు.

2017లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్ గా రాహుల్ ద్రావిడ్ ను నియమించారు. పోలింగ్ శాతాన్ని పెంచడం.. ప్రతి ఒక్కరిలోనూ ఓటు హక్కు పట్ల చైతన్యం కలిగించడానికి అవసరమైన ప్రచార కార్యక్రమాలను కర్ణాటక ఎన్నికల కమిషన్ చేపట్టింది. ద్రవిడ్ పోస్టర్లను కూడా ఈసీ పంపిణీ చేసింది.

తీరా పోలింగ్ సమయానికి స్వయంగా ద్రావిడ్ ఓటుహక్కు వినియోగించుకోవడానికి రాగా.. అసలు ఆయన పేరే ఓటరు జాబితాలో లేకుండా పోవడం గమనార్హం. సాంకేతిక కారణాల వల్ల ద్రవిడ్, ఆయన భార్య విజేత పేర్లు ఓటర్ల జాబితాలో చేర్చడానికి కుదరలేదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

*అసలు కారణమిదే..
గతంలో ద్రవిడ్ బెంగళూరు సెంట్రల్ పరిధిలోని ఇందిరానగర్ లో నివాసం ఉండేవారు. తండ్రి మరణానంతరం ద్రవిడ్ ఇందిరానగర్ నుంచి బెంగళూరు నార్త్ లోని అశ్వర్థ నగర్ ఇంటిని మార్చారు. ద్రవిడ్ ఇళ్లు మారడంతో ఇందిరానగర్ లో ఆయన పేరును తొలగించారు. కానీ ఓటరు జాబితా తయారు చేసే సమయానికి అశ్వర్థనగర్ లో  ద్రవిడ్ నివాసం ఏర్పాటు చేసుకోలేదు. కొత్తగా అక్కడ పేరు చేర్చుకోవడానికి వీలు కుదరలేదు.

ఇక జనవరి 1 నుంచి మార్చి 16వరకూ గడువున్నా కొత్త అడ్రస్ లో ద్రవిడ్ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఫలితంగానే ద్రవిడ్, ఆయన భార్య విజేత పేర్లను ఓటరు జాబితాలో చేర్చలేదు. ద్రవిడ్ ఓటు హక్కు నమోదు చేయడానికి ఆయన ఇంటికి వెళ్లామని.. ఆయన  ఇంట్లో లేరని మత్తికెరె ఎన్నికల రిటర్నింగ్ అధికారి రూప తెలిపారు. అప్పుడు స్పెయిన్ లో ఉన్నట్లు తేలిందని చెప్పారు.
    
    
    

Tags:    

Similar News