రాహుల్ స‌భ వెనుక ఎన్నో లెక్క‌లు ఉన్నాయ‌ట‌

Update: 2017-05-20 11:53 GMT
తెలంగాణ ప్ర‌జాగ‌ర్జ‌న స‌భ‌....జూన్‌1 సంగారెడ్డిలో నిర్వ‌హించ‌నున్న కాంగ్రెస్ పార్టీ కార్య‌క్ర‌మం. ల‌క్ష‌మందికి పైగా కార్య‌క‌ర్త‌ల‌తో నిర్వ‌హించే ఈ స‌భ‌కు కాంగ్రెస్ పార్టీ భ‌విష్య‌త్ ర‌థ‌సార‌థిగా పేరున్న రాహుల్ గాంధీ హాజ‌రుకానున్నారు. ఈ సంద‌ర్భంగా ఇటు తెలంగాణ ప్ర‌భుత్వంతో పాటుగా అటు కేంద్ర ప్ర‌భుత్వం మూడేళ్ల పాల‌న టార్గెట్‌ గా రాహుల్ ప్ర‌సంగం ఉండ‌నుంది. ఇంత కీల‌క‌మైన స‌భ‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ సొంత జిల్లా అయిన పూర్వ‌పు మెద‌క్ ప‌రిధిలోకి వ‌చ్చినందుకు మాత్ర‌మే సంగారెడ్డిని ఎంచుకుంటున్నారా?  లేక మ‌రేదైనా కార‌ణాలు ఉన్నాయా అనే సందేహాల‌కు ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం వ‌స్తోంది.

త‌మ‌కు బ‌ల‌మైన ప‌ట్టున్న రాష్ట్రంగా భావించిన‌ తెలంగాణ‌లో కునారిల్లిపోవ‌డాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక‌పోతోంది. దీంతో స‌త్తా చాటుకునేందుకు స‌భ నిర్వ‌హిస్తూనే మ‌ధ్య‌లో సెంటిమెంట్ జ‌పం ప‌ఠిస్తున్న‌ట్లు రాజ‌కీయ‌వ‌ర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ సెంటిమెంట్‌ తో పాటు త‌మ‌కు అచ్చివ‌చ్చిన‌ మెద‌క్ సాక్షిగా బ‌లం చాటుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌,  దివంగత ప్రధాని ఇందిరా గాంధీకి సంగారెడ్డి బాగా క‌లిసివ‌చ్చిన ప్రాంతమ‌నే అబిప్రాయం ఉంది. కాంగ్రెస్ చ‌రిత్ర‌లో, ఇందిరా రాజ‌కీయ జీవితంలో కూడా సంగారెడ్డికి ప్రాధాన్యం ఉంది. 1978లో సంగారెడ్డిలో బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉన్న ఇందిరా సాయంత్రం 6 గంటలకు సభకు రావాల్సి ఉండ‌గా...ప‌లు కార‌ణాల వ‌ల్ల మర్నాడు తెల్లవారుజామున 3 గంటలకు సభాస్థలికి వచ్చారు. అయితే అప్ప‌టివ‌ర‌కు ప్రజలు ఓపికగా నిరీక్షించారు.! దీంతో సంగారెడ్డి, మెద‌క్ వాసుల ప్రేమ‌ను చూసి చలించిపోయిన ఆమె మెదక్‌ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని కాంగ్రెస్‌ నాయకుల మాట‌. ఈ క్ర‌మంలోనే 1980లో మెదక్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి గెలిచిన ఇందిరా గాంధీ ప్రధాని ప‌దవిని చేపట్టారని ప‌లువురు సీనియ‌ర్లు గుర్తుచేస్తున్నారు. ఇక ఇటీవ‌లి ప‌రిణామాలు చూస్తే... కేంద్ర మంత్రిగా తెలంగాణ ఏర్పాటు ప్ర‌క్రియ‌లో కీల‌క పాత్ర పోషించిన కాంగ్రెస్ అగ్ర‌నేత‌, కేంద్ర మాజీమంత్రి చిదంబరం సైతం  2014లో మెదక్‌ పార్లమెంటు సీటు నుంచి పోటీ చేయాలని భావించారని కాంగ్రెస్ వ‌ర్గాలు చెప్తున్నాయి. అయితే తెలంగాణ ఏర్పాటు వేగవంతం అవ‌డంతో చిదంబ‌రం రంగంలోకి దిగ‌లేక‌పోయారు.

మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన బ‌ల‌మైన నేత‌లు ఉన్న ప్రాంతం కావ‌డంతో సంగారెడ్డిని ఎంచుకున్న‌ట్లు చెప్తున్నారు. ఇదే స‌మ‌యంలో రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం నిర్వ‌హించే జూన్‌2 సైతం క‌లిసివ‌స్తుంది. రాష్ట్ర అవ‌త‌ర‌ణ‌కు ముందే...తెలంగాణ ఏర్పాటుకు కార‌ణ‌మైన కాంగ్రెస్ పార్టీ స‌త్తాను చాటేందుకు ఈ స‌భ‌ను వేదిక‌గా ఉప‌యోగించుకోనున్న‌ట్లు స‌మాచారం. ఈ స‌భ వేదిక‌గా రాహుల్ గాంధీ రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఘాటుగా విమ‌ర్శ‌లు చేయ‌డం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు అంటున్నారు. దీంతో మ‌రుస‌టి రోజున జ‌రిగే రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ వాటికి వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి ఉంటుంద‌ని చెప్తున్నారు. ఇదే స‌మ‌యంలో రాహుల్ ప‌ర్య‌ట‌న‌కు వారం రోజుల ముందు జ‌రిగే బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా మూడు రోజుల టూర్‌కు కౌంట‌ర్‌గా కూడా నిలుస్తుంద‌ని భావిస్తున్నారు. మొత్తంగా రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం, ముఖ్య‌మంత్రి కేసీఆర్ సొంత‌జిల్లా కావ‌డం, 1980లో మాదిరిగా 2019లో మళ్లీ అధికారంలో వస్తామని సెంటిమెంట్ క‌ల‌గ‌లిపి సంగారెడ్డి వేదిక‌గా కాంగ్రెస్ సార్టీ స‌త్తా చాటేందుకు సిద్ధ‌మైంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News