ఏపీలో పోటీకి ఓవైసీ.. కేసీఆర్‌ ల‌కు వెల్ కం!

Update: 2018-12-17 05:40 GMT
బ‌ర్త్ డే పార్టీకి వ‌చ్చిన‌ప్పుడు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాం క‌దా?  తెలంగాణ ఎన్నిక‌ల‌కు వ‌చ్చిన బాబుకు.. రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వ‌కుంటే ఏం బాగుంటుందంటూ కేసీఆర్ వేసిన పంచ్ కు వ‌చ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఊహించిన దానికి మించిన ఫ‌లితాలు వ‌చ్చిన‌ప్పుడు కాన్ఫిడెన్స్ కొత్త పుంత‌లు తొక్కుతుంటుంది. అందుకు నిద‌ర్శ‌నంగా కేసీఆర్ మాట‌ల్ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా వంద‌.. నూట ఐదు స్థానాల్లో టీఆర్ ఎస్ గెలుపు ప‌క్కా అని చెప్పిన కేసీఆర్‌.. త‌న అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో మాత్రం 80 సీట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాలు వేసుకున్న‌ట్లుగా చెబుతారు.

కేసీఆర్ న‌మ్మ‌కానికి మించి మ‌రీ తెలంగాణ ప్ర‌జ‌లు త‌మ ఓట్ల‌తో కేసీఆర్ కు అధికారాన్ని క‌ట్ట‌బెట్టార‌ని చెప్పొచ్చు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌.. వివిధ వ‌ర్గాల విష‌యంలో తాను చేసిన పొరపాట్ల కార‌ణంగా ఎట్టి ప‌రిస్థితుల్లో 80 సీట్ల‌కు మించి గెలిచే అవ‌కాశం ఉంద‌ని కేసీఆర్ లెక్క‌లు క‌ట్టుకున్నా.. వాస్త‌వం మాత్రం అందుకు భిన్నంగా మారింది. ఇదే.. కేసీఆర్ లో కాన్ఫిడెన్స్ ను రెట్టింపు చేయ‌ట‌మే కాదు.. జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతాన‌న్న మాట ఆయ‌న నోటి వెంట వ‌చ్చింది.

అంతేనా.. తాను ఏపీకి వెళ‌తాన‌ని.. విజ‌య‌వాడ‌లో ప్రెస్ మీట్ పెడ‌తాన‌న్న మాట‌ను చెప్పుకొచ్చారు కేసీఆర్‌. వాస్త‌వంలో అది సాధ్య‌మ‌య్యేనా? అంటే చెప్ప‌లేం. కేసీఆర్ లాంటి నేత ఏమైనా చేయ‌గ‌ల‌రు. అలా అని.. ఆవేశంలో వెనుకా ముందు ఆలోచించ‌కుండా ప‌ని చేసే వ్య‌క్తి కాదు. తెలంగాణ‌కు బాబు వ‌చ్చినందుకు టీఆర్ ఎస్ నేత‌లు ప‌లువురు కారాలు మిరాయాలు నూరుతున్నారు. వాస్త‌వానికి తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో బాబు పాల్గొన‌ట‌మే కేసీఆర్ నెత్తిన పాలు పోసేలా చేసింది. ఆ విష‌యాన్ని సారు ఇప్ప‌టికే గ్ర‌హించారు. కాకుంటే.. ఆయ‌న గుర్తించాల్సిన మ‌రో అంశం.. తెలంగాణ‌కు వ‌చ్చి బాబు హ‌డావుడి చేస్తే.. ప్ర‌జ‌లు ఎలా రియాక్ట్ అయ్యారో.. రేపొద్దున ఏపీకి వెళ్లి కేసీఆర్ హ‌డావుడి చేస్తే.. అక్క‌డి ప్ర‌జ‌లు బాబు ప‌ట్ల సానుభూతి వ్య‌క్తం చేసే ప్ర‌మాదం ఉంది. ఆ విష‌యాన్ని కేసీఆర్ గుర్తించ‌కుంటే ఆయ‌న ఏమ‌నుకుంటున్నారో అది జ‌రిగే ఛాన్స్ ఉండ‌దు.

ఈ కార‌ణంతోనే.. తెలుగు త‌మ్ముళ్లు మ‌జ్లిస్ అధినేత అసద్ ను.. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ను ఏపీకి రావాల‌ని కోరుతున్నారు. నంద్యాల ఎన్నిక‌ల సంద‌ర్భంగా అస‌ద్ పార్టీ పోటీ చేస్తే ఒక్క‌శాతం ఓట్లు కూడా రాని ప‌రిస్థితి. ఎవ‌రి స్థానిక‌త వారికి లాభం చేస్తుంది. ముస్లింలు అధికంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌జ్లీస్ ఎంట్రీ ఇచ్చి ఎన్ని మాట‌లు చెప్పినా.. హైద‌రాబాద్ పాత‌బ‌స్తీ ప‌రిధిలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌జ్లిస్ మేజిక్ ఏపీలో ప‌ని చేయ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

బాబును రాజ‌కీయంగా ఇరుకున పెట్టాలంటే అందుకు బోలెడ‌న్ని మార్గాలు ఉన్నాయి. కానీ.. వాటిని వ‌దిలేసి.. ఏపీ రాజ‌కీయాల్లో వేలు పెట్టాల‌నుకోవ‌టం మాత్రం తొంద‌ర‌పాటు అవుతుంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.  కేసీఆర్‌. అస‌ద్ లాంటోళ్లు ఏపీకి వ‌స్తే ఏం జ‌రుగుతుంద‌న్న విష‌యంపై క్లారిటీ ఉండ‌టం కార‌ణంగానే తెలుగు త‌మ్ముళ్లు రండి.. రండి.. ఏపీకి రావాలంటూ వెల్ కం చెబుతున్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.
Tags:    

Similar News