అర్థరాత్రి వేళనే అప్ డేట్స్ రిలీజ్ చేస్తారెందుకు సారూ?

Update: 2020-04-03 13:30 GMT
కరోనా వ్యాప్తికి చెక్ పెట్టేందుకు వీలుగా.. మిగిలిన రాష్ట్రాల కంటే మెరుగైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కరోనాపై కఠిన చర్యలు తీసుకునే విషయంలో మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. పాజిటివ్ కేసుల నమోదులో మాత్రం వడివడిగా అడుగులు పడటమే కాదు.. మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందన్నది మర్చిపోకూడదు.

రోజువారీగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు ఎంత? మరణాలు ఎన్ని? అన్న విషయాలకు సంబంధించిన వివరాల్ని వెల్లడించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం కొత్త తరహాలో ఉంది. పొరుగున ఉన్న ఏపీ విషయాన్నే చూస్తే.. పాజిటివ్ కేసులకు సంబంధించి ఉదయం.. మధ్యాహ్నం.. సాయంత్రం.. ఇలా వేర్వేరు వేళల్లో సమాచారాన్ని వెల్లడిస్తున్నారు. అంతేకాదు.. జిల్లాల వారీగా కేసుల నమోదును చెప్పటం ద్వారా.. తీవ్రత ఎక్కడ ఉందన్న విషయం ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్నారు.

అందుకు భిన్నంగా తెలంగాణలో మాత్రం కరోనా అప్ డేట్స్ విషయంలో ఏ రాత్రి వేళలోనో.. అర్థరాత్రికి కాస్త ముందుగానే ప్రభుత్వ ప్రకటన విడుదల చేయటం గమనార్హం. కరోనా విషయంలో మిగిలిన చర్యలు ఎలా ఉన్నా.. ప్రజలకు అవగాహన కలిగించే విషయంలో మాత్రం ప్రభుత్వం ముందుండాలి. అందుకు భిన్నంగా కేసీఆర్ సర్కారు తీరు ఉందన్న విమర్శ వినిపిస్తోంది. వైరస్ వ్యాప్తి విషయంలో ప్రజలకు అవగాహన కల్పించటంలో ఎంత కసరత్తు చేస్తున్నా.. చేదు వాస్తవాలు సైతం ప్రజలకు చేరితేనే.. వారు మరింత అప్రమత్తంగా ఉంటారన్నది మర్చిపోకూడదు.

ఫలానా జిల్లాలో కేసుల నమోదు భారీగా ఉందన్న విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించటం ద్వారా.. ఆయా జిల్లాల ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతాయన్న మాటను తెలంగాణ అధికారులు చెబుతున్నారు. కానీ.. వారు మిస్ అవుతున్న పాయింట్ ఏమంటే.. అలాంటి వివరాలు వెల్లడించకుంటే.. ప్రజలకు కరోనా తీవ్రత ఎంతన్న అవగాహన ఎలా కలుగుతుందన్న ప్రశ్నకు సమాధానం రాని పరిస్థితి. ఏ రోజుకు ఆ రోజు కరోనా అప్ డేట్స్ ను అధికారికంగా రోజులో మూడు పూట్ల ఒక క్రమపద్దతిలో విడుదల చేయాల్సింది పోయి.. అందుకు భిన్నంగా రాత్రి పదకొండు గంటల ప్రాంతాల్లో ఎందుకు విడుదల చేస్తున్నట్లు? ఆ విషయంలో సారు వ్యూహమేంది? అన్నది మాత్రం ఎంతకూ కొరుకుడుపడదని చెప్పక తప్పదు.
Tags:    

Similar News