సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కాల్పుల వెనుక అసలు విషయం ఇదేనట

Update: 2022-06-18 05:49 GMT
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చరిత్రలో ఇప్పటివరకు చూడని విధ్వంసం శుక్రవారం చోటు చేసుకుంది. దాదాపు రెండు వేల మంది ఆందోళనకారులు వ్యూహాత్మకంగా రైల్వే స్టేషన్ లోకి చొరబడి సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. సమస్య ఏదైనా ఉండొచ్చు. డిమాండ్లు మరేమైనా కావొచ్చు.

వేలాది మంది ప్రజల్ని భయాందోళనలకు గురి చేసి.. ఆస్తుల్ని ధ్వంసం చేసి.. ప్రశాంత వాతావరణాన్ని పూర్తిగా సమాధి చేసే ఇలాంటి ఉదంతాల్ని సమర్థించాలా? అన్నది ప్రశ్న.

ఒకవేళ విధ్వంసానికి మద్దతు ఇస్తే.. రేపొద్దున ప్రతి విషయానికి హింసనే సమాధానంగా ఆందోళకారులు భావిస్తే జరిగేదేంటి? అన్నది మరో ప్రశ్న. దాదాపు 2 వేల మంది ఆందోళన కారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోకి చేరి.. నానా బీభత్సం చేస్తున్న వేళ.. రైల్వే పోలీసులు (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు) కాల్పులు జరపటం తెలిసిందే. ఈ కాల్పుల కారణంగా ఒకరు మరణించారు. అయితే.. కాల్పుల జరపాలన్న నిర్ణయాన్ని రైల్వే పోలీసులు ఎందుకు తీసుకున్నారు? ఎలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది? అన్నది ఇప్పుడు చర్చగా మారింది.

వందలాది మంది స్టేషన్ లోకి ప్రవేశించి.. దొరికింది దొరికినట్లు ధ్వంసం చేస్తూ.. ఆస్తుల్ని నాశనం చేయటమే ఒక ఎత్తు అయితే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిలిపి ఉన్న ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు ఇంజిన్ కింద నాలుగు వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ఆయిల్ ట్యాంక్ ఉంది. ఒకవేళ ఈ ఆయిల్ ట్యాంక్ పేలితే.. పక్కనే ఉన్న పదో నెంబరుప్లాట్ ఫాంకు సమీపంలో ఆయిల్ డిపోకు మంటలు అంటుకునే అవకాశం ఉంది.

ఇక్కడ దగ్గర దగ్గర లక్షన్నర లీటర్ల డీజిల్ ఉంటుందని చెబుతున్నారు.  దొరికిన వస్తువును దొరికినట్లుగా డ్యామేజ్ చేస్తున్న ఆందోళనకారులు కానీ  డీజిల్ ట్యాంకర్ కు నిప్పు పెట్టి ఉంటే.. జరిగే ప్రాణ నష్టం.. ఆస్తినష్టాన్ని ఊహించను కూడా ఊహించలేం. ఒకవేళ.. ఈ ట్యాంకర్ కు నిప్పు పెట్టి.. అది కాస్తా ఆయిల్ డిపోను మంటల్లోకి చిక్కుకునేలా చేసి ఉంటే.. దాని తీవ్రత తక్కువలో తక్కువ రెండు కిలోమీటర్ల మేర ఉండేది. అదే జరిగితే.. ఊహకు అందనంత నష్టం వాటిల్లేది. రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరు పెను ముప్పులో పడేవారు.

అందుకే..ట్యాంకర్ కు నిప్పు పెట్టే దిశగా ఆందోళనకారులు వెళుతున్న వేళ.. వారిని నిలువరించేందుకు వీలుగా రైల్వే డీజీ ఆదేశాల మేరకు రైల్వే పోలీసులు కాల్పలు జరిపినట్లుగా చెబుతున్నారు. కాల్పుల కారణంగా ఆందోళనకారుల్లో ఒకరు ప్రాణాలు విడవటం ఒక ఎత్తు అయితే.. కాల్పుల నేపథ్యంలో ఆందోళనకారుల్ని అదుపులోకి తేవటం ద్వారా.. పెను ముప్పును తప్పించారని చెప్పక తప్పదు. అయితే.. కాల్పుల వేళలో నిబంధనల్ని పక్కాగా పాటించి ఉండాల్సిందన్న విమర్శ పలువురి నోట వినిపిస్తోంది.
Tags:    

Similar News