ఐసిస్ పై అంత క్రేజ్ ఎందుకు?

Update: 2016-08-03 17:19 GMT
 బంగ్లాదేశ్ లో వందలాది మంది కనిపించకుండా పోయారు.. మన దేశంలోని కేరళలోనూ సుమారు 25 మంది అదృశ్యమయ్యారు. వీరంతా ఏమయ్యారంటే ఐసిస్ లో చేరడానికి వెళ్లారనడానికి ఆధారాలు దొరుకుతున్నాయి. మిగతా ప్రాంతాల నుంచీ ఒకరిద్దరు వెళ్తున్న సందర్భాలుంటున్నాయి. తాజాగా బిహార్ రాజధాని పాట్నా నుంచి ఒక మహిళ తన అయిదేళ్ల కుమారుడిని తీసుకుని ఐసిస్ లో చేరేందుకు బయలుదేరి దొరికిపోయింది.. ప్రపంచాన్ని భీతావహం చేస్తున్న ఐసిస్ అంటే వీరందరికీ ఎందుకంత క్రేజ్..? వీరంతా కరడు గట్టిన ఐసిస్ భావజాలికులా.. ఉగ్రవాదమంటే అంత ఇష్టమా.. ప్రపంచాన్ని బాంబులతో నాశనం చేసేయాలనుకుంటున్నారా? అంటే అదేమీ కాదనే సమాధానం వస్తుంది. వీరందరికీ ఐసిస్ ఒక ఉపాధి.. ఒక ఉద్యోగ అవకాశం. అవును.. ఖతర్ - దుబాయ్ వంటి ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లినట్లే ఐసిస్ లో చేరేందుకూ వెళ్తున్నారట. గల్ఫులో నానా కష్టాలు పడాల్సి వస్తుందని తెలిసినా అయిదారేళ్లు కష్టపడితే నాలుగు డబ్బులు కళ్ల చూడొచ్చన్న ఆశతో చాలామంది వెళ్తారు. ఇప్పుడు ఐసిస్ కూడా అంతేనంటున్నారు.  మిగతా ఉగ్రవాద సంస్థల్లా కాకుండా జీతమిచ్చి పనిచేయించుకుంటున్న ఐసిస్ తీరు చాలా భిన్నం. ఆ సంస్థ భావాలకు ఆకర్షితులై చేరుతున్నవారూ ఉంటున్నా అదే సమయంలో అక్కడ రకరకాల పనులు చేయడానికి జీతంపై పనిచేసేందుకు చాలామంది చేరుతున్నారు. భారీగా జీతమిస్తుండడంతో ఆ సంస్థ ఏంటి.. అక్కడ ఏం పనిచేస్తాం.. మన బతుక్కి గ్యారంటీ ఉందా అన్నదేమీ ఆలోచించకుండా ఎందరో ఆ ఉచ్చులో పడుతున్నారు.

తాజాగా చంకన పసిబిడ్డను వేసుకుని కాబూల్ విమానం ఎక్కుతున్న ఓ ముస్లిం యువతిని ఇటీవల ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాట్నాకు చెందిన యాస్మిన్ మహమ్మద్ అనే ఆమె ఇప్పటికే భర్తతో విడాకులు తీసుకుని వేరేగా జీవిస్తోంది. తన అయిదేళ్ల కొడుకుతో కలిసి ఐసిస్ లో చేరేందుకు బయలుదేరింది. అయితే.. ఆమె కదలికలు ముందే తెలుసుకున్న పోలీసులు ఆమెను పట్టుకున్నారు.  పోలీసులు ఆమెను విచారించి కేరళలో కనిపించకుండా పోయిన 21 మందితో ఆమెకు సంబంధాలున్నట్లు తేల్చారు. ఈమె ఎందుకు వెళ్తోందన్నది ఇంకా తేలకపోయినా కొందరు మాత్రం సంపాదించుకోవడానికి.. ఇంకొందరు ఆయుధాల సరదా తీర్చుకోవడానికి కూడా ఐసిస్ లో చేరుతున్నారట.

Tags:    

Similar News