జగన్‌ అందుకు 'నో' అన్నాకే.. ఫిరాయింపులు ముదిరాయ్‌

Update: 2016-04-11 22:30 GMT
రెండు రోజుల కిందట వైకాపా నుంచి తెదేపాలోకి ఫిరాయించిన గూడూరు ఎమ్మెల్యే సునీల్‌.. ఎన్నికలు పూర్తయిన తొలి వారంలోనే తాను తెదేపాలో చేరడానికి చంద్రబాబును సంప్రదించానని, అయితే ఆయన కొన్నాళ్లు ఆగాల్సిందిగా సూచించారని అన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రాజకీయాలకు సంబంధించి ఒక చర్చ జరుగుతున్నది. ఎన్నికలు పూర్తయి రెండేళ్లు గడుస్తుండగా.. ఇప్పుడు హఠాత్తుగా.. ఇలా వరుస ఫిరాయింపులు జరుగుతున్నాయి ఎందుకు? దీనికి సంబంధించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఒక ఆసక్తికరమైన చర్చ వినిపిస్తోంది. 2014లో వైకాపా అధికారంలోకి వచ్చి తీరుతుందనే ఉద్దేశంతో ఎగబడి పార్టీ టికెట్లు దక్కించుకున్న అనేక మంది.. అంతకంటె ఎక్కువ ఆశకు పోయి కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఎన్నికల్లో నెగ్గారు. పార్టీ అధికారంలోకి రాలేదు. ఉన్న డబ్బు హరించుకుపోయింది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తాము పోటీ చేయాలంటే పార్టీ అధినేత జగన్‌ అంతో ఇంతో ఆర్థికంగా చేయూత ఇచ్చి ఆదుకోవాలని వారు ఆశిస్తున్నారట.

చూచాయగా ఈ విషయం జగన్‌ దృష్టికి కూడా వెళ్లిందని సమాచారం. అయితే 2019లో అయినా సరే.. పార్టీ తరఫున ఒక్క రూపాయి అయినా తాను అభ్యర్థులకు సాయం చేయడం అంటూ జరగదని జగన్‌ తెగేసి చెప్పేశారుట. ఈ నిర్ణయం చాలా మంది ఎమ్మెల్యేల్లో భయం పుట్టించిందని సమాచారం. ఈ ఎన్నికలకే తమ సొంత ఖజానాలు ఖాళీ అయిపోయి, పార్టీ అధికారంలో లేక, వచ్చే ఎన్నికలకు నిధుల విషయంలో దేవులాడుతున్న వారంతా.. భయపడ్డారని అంటున్నారు. అలాంటి వారిలో మెజారిటీ అయిందేదో అయింది.. అధికార తెదేపా తీర్థం పుచ్చుకుని.. ఎన్నికల్లోగా అంతో ఇంతో వెనకేసుకోవడం మంచిది అనే బాట పట్టారని ప్రచారం నడుస్తోంది.

అయితే, జగన్‌ ఇలా పార్టీ ఎమ్మెల్యేలకు తాను ఆర్థిక చేయూత ఇవ్వననే నిర్ణయం సరిగానే తీసుకున్నారని పలువురు అంటున్నారు. జగన్‌ టికెట్లు ఇచ్చాక ఎవరికి వారు, అంతూ పొంతూ లేకుండా.. తమ ఇష్టానుసారంగా.. చెలరేగిపోయి.. అప్పులుచేసి మరీ ఎడాపెడా కోట్లాది రూపాయలు ఎన్నికల్లో ఖర్చుపెట్టి.. ఎన్నికల తంతునే ప్రహసనంగా మార్చేశారని, జగన్‌ ప్రమేయం లేకుండా జరిగిన అలాంటి దుబారాకు ఇప్పుడు ఆయన్ను సాయం చేయమని అడగడం ఎలా కరెక్టు అని కొందరు అంటున్నారు. అది కూడా నిజమే. మొత్తానికి నిధుల దేవులాటలో ఉన్న మరి కొందరు కూడా ఫిరాయింపులకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తున్నది.
Tags:    

Similar News