ఎంపీల‌ అసంతృప్తికి రీజ‌నేంటి? టీడీపీ అంత‌ర్మ‌థ‌నం

Update: 2022-07-25 04:25 GMT
టీడీపీ అంత‌ర్మ‌థ‌నం చెందుతోంది. ఉన్న ముగ్గురు ఎంపీల్లో ఇద్ద‌రు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఒకే ఒక్క మాత్రం కొంత ఫాస్ట్‌గా ఉన్నారు. మిగిలిన ఇద్ద‌రు కూడా పార్టీకి ఉప‌యోగం లేకుండా పోయార‌నే వాద‌న వినిపిస్తోంది. దీంతో పార్టీ ఇప్పుడు క‌లత చెందుతోంది. ఈ ఇద్ద‌రిలోనూ ఒక‌రు స్వ‌ప‌క్షంలోనే విప‌క్షం అనేలా మారిపోయారు. దీంతో అస‌లు ఏం జ‌రుగుతోంది? ఎందుకు ఇలా మారిపోయారు.? అనే విష‌యంపై చంద్ర‌బాబు దృష్టి పెట్టిన‌ట్టు తెలిసింది. గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరు, విజ‌య‌వాడ‌, శ్రీకాకుళం నుంచి ముగ్గ‌రు టీడీపీ ఎంపీలు విజ‌యం ద‌క్కించుకున్నారు.

తొలి ఏడాది అంద‌రూ బాగానే వాయిస్ వినిపించారు. అయితే.. రెండో ఏడాది నుంచి ఇద్ద‌రు ఎంపీలు..(విజ‌య‌వాడ‌, గుంటూరు) యూట‌ర్న్ తీసుకున్నారు. గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ బ్యాట‌రీల ప‌రిశ్ర‌మ‌పై ప్ర‌భుత్వం దాడులు జ‌ర‌ప‌డం.. పొల్యూష‌న్ విష‌యంలో యాగీ చేయ‌డం.. దీనికి హైకోర్టులోనూ ప‌రిశ్ర‌మ‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించ‌క‌పోవ‌డం తెలిసిందే. ఫ‌లితంగా.. తెర‌చాటున ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ.. అప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన ఎంపీ గ‌ల్లా సైలెంట్ అయిపోయా రు. క‌నీసం ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా హాజ‌రు కావ‌డం లేదు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ అవ‌స‌రం లేద‌ని.. ఆయ‌న లీకులు కూడా ఇస్తున్నారు. త‌న త‌ల్లి గ‌తంలో పోటీ చేసిన చంద్ర‌గిరి నుంచి పోటీ చేస్తాన‌ని ఆయ‌న చెబుతున్నారు. దీంతో ఆయ‌న దూకుడు పూర్తిగా లేకుండా పోయింది. ఇక‌, విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని గురించి ఎంత చెప్పినా త‌క్కువే.. స్వ‌ప‌క్షంలోనే విప‌క్షం అని అనేలా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌న పార్టీలో ఉన్న నాయ‌కుల‌తోనే ఆయ‌న విభేదాలు కొన‌సాగిస్తున్నారు.

చంద్ర‌బాబును కూడా ప‌రోక్షంగా ఆయ‌న సైటైరిక‌ల్ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవాల‌ని.. పార్టీ కంక‌ణం క‌ట్టుకుని ప‌నిచేస్తుంటే.. ఈయ‌న మాత్రం .. 40 సీట్లు వ‌స్తే.. ఎక్కువ అని ఇటీవ‌ల వ్యాఖ్యానించారు.

ఈ ప‌రిణామాల‌తో టీడీపీ త‌ల బొప్పిక‌డుతోంది. ఓడిన వారు ఎలానూ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం లేదు. గెలిచిన వారు కూడా పార్టీని వ‌దిలేయ‌డం.. పార్టీని ఇరుకున పెట్టేలా వ్య‌వ‌హ‌రించ‌డం.. వంటివి చంద్ర‌బాబు సీరియ‌స్‌గానే తీసుకున్నారు. కానీ, ప్ర‌యో జ‌నం లేకుండా పోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికిప్పుడు కేశినేని నాని డిమాండ్ల‌ను ప‌రిష్క‌రిస్తే.. కీల‌క‌మైన చాలా మంది నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టాల్సి వ‌స్తుంది.

ఇదే జ‌రిగితే.. పార్టీకి ఉన్న ఊపు కూడా పోతుంది. ఇక‌, కేసుల నుంచి గ‌ల్లాను కాపాడే ప్ర‌య‌త్నం చేసినా.. అది ఫ‌లించేలా క‌నిపించ‌డం లేదు. ఇలా ఏవిధంగా చూసుకున్నా.. ఈ ఇద్ద‌రు ఎంపీల ప‌రిస్థితి డోలాయ‌మానంలో ప‌డింద‌ని నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News