రాహుల్, మోడీ, ప్రియాంక... సేమ్ భజన

Update: 2022-02-18 08:32 GMT
ఓట్ల కోసం, పదవుల కోసం చాలామంది రాజకీయ నేతలు ఏమి చేయటానికి కూడా వెనకాడరు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా అర్ధమైపోతోంది. దీనికి నిదర్శనమే ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో గురు రవిదాస్ జయంతి ఉత్సవాలు.

గురు రవిదాస్ 15వ శతాబ్దంలో పంజాబ్ లోని దళిత ఆధ్యాత్మిక గురువు. పంజాబ్ కు చెందిన వ్యక్తే అయినప్పటికీ యూపీలోని వారణాసిలో చివరి రోజులు గడిపారు. అందుకనే ఈయనకు ఇటు పంజాబ్ అటు యూపీలో కూడా దళితుల్లో పెద్ద ఎత్తున భక్తులున్నారు.

 ఇపుడా భక్తుల ఓట్ల కోసమే పంజాబ్ లో అన్ని పార్టీలు పోటీలు పడుతున్నాయి. ఢిల్లీలోని కరోల్ భాగ్ లో ఉన్న గురు రవిదాస్ ఆలయంలో నరేంద్ర మోడీ ఏకంగా భజనలే మొదలుపెట్టేశారు. ఆలయంలోని మహిళా భక్తులతో కలసి చాలాసేపు మోడీ భజనలు చేశారు. ఇక వారణాసిలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రవిదాస్ ఆలయంలో భక్తులకు సహపంక్తి భోజనాలను వడ్డించారు. చాలాసేపు వీరిద్దరు భక్తులతోనే కలిసున్నారు.

 పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ అయితే ఉదయం 4 గంటలకే ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఆలయంలో పూజలు నిర్వహించారు. వీళ్ళంతా హఠాత్తుగా గురు రవిదాస్ ఆలయంలో భజనలు చేయటం, భోజనాలు వడ్డించటం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఎందుకంటే పంజాబ్ లో గురు రవిదాస్ భక్తులు సుమారు 25 లక్షల మందున్నారు కాబట్టే.

 మామూలుగా అయితే వీళ్ళల్లో గురు రవిదాస్ కు ఎంతమంది భక్తులో మనకు తెలీదు. కానీ ఇపుడు ఎన్నికల సీజన్ కదా. అవసరమైతే ఏ ఆలయానికైనా వెళతారు, ఏ రాయికన్నా మొక్కుతారనటంలో సందేహమే లేదు. 25 లక్షల మంది భక్తులంటే మామూలు విషయం కాదు. వీళ్ళు గంపగుత్తగా వేసినా లేదా మెజారిటీ ఓట్లు ఒక పార్టీకి పడితే ఆ పార్టీయే విజయానికి దగ్గరగా ఉంటుందని అందరికీ తెలిసిందే. అసలే పంజాబ్ లో డేరాబాబాలకు బాగా గిరాకీ పెరిగిపోతోంది. అందుకనే ప్రముఖులంతా గురు రవిదాస్ కు మొక్కుకుంటున్నారు. మరి గురు రవిదాస్ ఎవరిని కరుణిస్తారో.

    

Tags:    

Similar News