కరోనాపై డబ్ల్యూ.హెచ్.వో ఫెయిల్.. కారణమేంటి?

Update: 2020-05-07 17:30 GMT
ప్రపంచవ్యాప్తంగా రాబోయే విపత్తులు, వైరస్ లు, బ్యాక్టీరియా దాడులు.. ప్రపంచంలోకి కొత్తగా పుట్టుకు వచ్చే ఆరోగ్య అనర్థాలను ఎప్పటికప్పుడు అంచనావేసి ప్రపంచ దేశాలను అలెర్ట్ చేయడం ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ విధి. స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉండే ఈ డబ్ల్యూ.హెచ్.వో సంస్థలో ప్రపంచదేశాలకు చెందిన ఆరోగ్య నిపుణులు, వైద్యులు ఉంటారు. వీరు ముందస్తు అంచనావేసి ప్రపంచ దేశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేస్తారు.

అయితే కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో డబ్ల్యూ.హెచ్.వో ఘోరంగా విఫలమైంది. ముందస్తుంగా ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించలేదు. హెచ్చరించలేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగం వినిపిస్తోంది.

డబ్ల్యూ.హెచ్.వో వైఫల్యం కారణంగానే అమెరికా, యూరప్ లలో కరోనా విస్తరించిందని.. చైనాతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కుమ్మక్కు కావడంతోనే కరోనా వైరస్ పై నిజాలను దాచిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. దానికి ప్రతీ సంవత్సరం ఇవ్వాల్సిన 400 మిలియన్ డాలర్ల (రూ.3100 కోట్ల ) నిధులను ఆపేశారు.

దీంతో డబ్ల్యూ.హెచ్.వో వైఫల్యంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే ఇదే డబ్ల్యూ.హెచ్.వో 2009లో స్వైన్ ఫ్లూపై తొందరపడింది. ప్రపంచ ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ముందే ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ ఫార్మా కంపెనీల నుంచి లక్షల్లో వ్యాక్సిన్ కొని ప్రజలకు ఇచ్చాయి. కొన్ని లక్షల కోట్లు ఖర్చు చేశాయి.కానీ ఈ స్వైన్ ఫ్లూ అంత తీవ్రమైనది కాదని తర్వాత తేలింది. మరణాలు తక్కువేనని తేలింది. దీంతో డబ్ల్యూ.హెచ్.వో ఫార్మా కంపెనీలతో కుమ్మక్కైందని నాడు ప్రపంచదేశాలు ఆరోపించాయి.

2014లో ఎబోలా విషయంలో డబ్ల్యూ.హెచ్.వో అప్రమత్తమైంది. త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. దీంతో వందలమంది చనిపోయారు. అప్పుడు డబ్ల్యూ.హెచ్.వోను ప్రపంచదేశాలన్నీ ఎందుకుందని.. విఫలమైందని విమర్శించాయి.

ఇప్పుడు కరోనా విషయంలోనూ చైనాకు ఆది నుంచి డబ్ల్యూ.హెచ్.వో అండగా ఉంటోంది. డబ్ల్యూ.హెచ్.వోకు అమెరికా తర్వాత చైనానే భారీగా నిధులు ఇస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించడంలో తాత్సారం చేసింది. దీంతో లక్షల కేసులు, వేల మరణాలు సంభవించాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫెయిల్యూర్ పై చర్చ మొదలైంది.

నిజానికి ఏదైనా దేశంలో వైరస్ కానీ ఆరోగ్య సమస్యలు తలెత్తితే డైరెక్ట్ గా అక్కడికి వెళ్లి పరిశోధించి ప్రమాదం గురించి తెలిపే రైట్స్ డబ్ల్యూ.హెచ్.వోకు లేవు. చైనాలో పుట్టిన వైరస్ పై తేల్చడానికి ఆ దేశం డబ్ల్యూ.హెచ్.వోను చైనాలోకి అనుమతివ్వలేదు. ఆయా దేశాల అనుమతితోనే డబ్ల్యూ.హెచ్.వో పనిచేస్తుంది. ఉత్సవ విగ్రహం లాంటి డబ్ల్యూ.హెచ్.వో ఆయా దేశాలు కోరితేనే పర్యటిస్తుంది. తేలుస్తుంది. లేదంటే కామ్ గా ఉండాల్సిందే. కరోనా విషయంలోనూ అలానే చూస్తు ఉండిపోయింది. వ్యాధి తీవ్రతను అంచనా వేయలేకపోయింది. అందుకే ట్రంప్ సహా ప్రపంచదేశాలు ఈ సంస్థ విశ్వసనీయతపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
Tags:    

Similar News