'గులాబీ' కారు జోరుకు అస‌మ్మ‌తి బ్రేక్ !

Update: 2018-09-10 17:08 GMT
అసెంబ్లీని ర‌ద్దు చేసి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌బోతోన్నట్లు కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌నతో తెలంగాణ‌లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది. అసెంబ్లీని ర‌ద్దు చేసిన రోజే...ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్.....105మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి అందరికీ షాకిచ్చారు. అయితే, టికెట్ ఆశిస్తోన్న ఆశావ‌హులు....త‌మ‌కు టికెట్ ద‌క్క‌లేద‌ని పార్టీపై అసమ్మతితో ఉన్నారు. కొంత‌మంది నేత‌లు బాహాటంగానే త‌మ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌మైన పాత్ర పోషించిన త‌మ‌ను కాద‌ని - గత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి పోటీ చేసి టీఆర్ ఎస్‌ లో చేరిన వారికి టికెట్ కేటాయించార‌ని ఆశావాహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేల‌కు కూడా సిట్టింగ్ స్థానాలు కేటాయించార‌ని - ఎన్నో ఏళ్లుగా పార్టీని న‌మ్ముకొని ప‌నిచేస్తున్నా...త‌మ‌కు మొండిచేయి చూపార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. పార్టీ కోసం పాటుబ‌డిన వారికి త‌గినంత‌ గుర్తింపు ద‌క్క‌డం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌హబూబ్‌ నగర్ జిల్లాలోని మక్తల్ అసెంబ్లీ స్థానాన్ని తాజా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్ మోహన్ రెడ్డికి కేటాయించడంపై నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఆ స్థానాన్ని రామ్మోహన్ రెడ్డికి కేటాయించాల‌ని స్థానిక‌నేత‌లు - ప్ర‌జ‌లు కేసీఆర్‌ ను కోరుతున్నారు. ఇక‌ - సంగారెడ్డి అసెంబ్లీ స్థానం....సిట్టింగ్ ఎమ్మెల్యేకు కేటాయించ‌డంపై పునరాలోచించాలని మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ కోరుతున్నారు. 2009 - 2014 ఎన్నికల్లో త‌న‌కు టికెట్ ద‌క్క‌లేద‌ని - తీవ్ర వ్యతిరేకత ఉన్న‌ సిట్టింగ్ ఎమ్మెల్యేకే మ‌రోసారి టికెట్ ద‌క్కింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వ‌రంగ‌ల్ లో మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు సొంత నియోజకవర్గం పాలకుర్తిలోనూ ఆయనకు వ్యతిరేకప‌వ‌నాలు వీస్తున్నాయి. ఆ స్థానం త‌న‌కు కేటాయించాల‌ని టీఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు - రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు అస‌మ్మ‌తి గళం వినిపించారు. పాలకుర్తి నియోజకవర్గానికి ఎర్రబెల్లి చేసిందేమీ లేదని - తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న త‌మ‌కు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. ఈ ర‌కంగా తెలంగాణ‌లో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో అస‌మ్మ‌తి సెగ‌లు రాజుకుంటున్న నేప‌థ్యంలో టీఆర్ ఎస్ అధిష్టానం టికెట్ల కేటాయింపుల‌పై పున‌రాలోచనలో పడినట్లు తెలుస్తోంది.



Tags:    

Similar News