జగన్ మీద అనర్హత వేటు... లాజిక్కు ఓకే....?

Update: 2022-08-27 10:30 GMT
రాజకీయాల్లో పవిత్రత ఎంత అంటే ఎవరూ ఏమీ  చెప్పలేరేమో.  అయితే ఎవరూ ఇక్కడ శుద్ధ పూస కాదనే అంటారు. నిజానికి రాజకీయ క్రీడ అటువంటిది. దానికి నియమాలు లేవు. మరి నీతి ఎలా ఉంటుంది. అందుకే తాముగా రాజకీయ నీతి అని పేర్లు పెట్టుకుంటారు. ఇక ఈ దేశంలో అవినీతిపరులైన రాజకీయ నాయకుల జాబితాయే ఎక్కువ. ఆ మాటకు వస్తే నీతిమంతులు లేరా అంటే ఉన్నారు కానీ వారి శాతం బహు తక్కువ. పైగా ఉన్నత స్థానాలను అందుకోవాలన్నా అక్కడ పదికాలాల‌ పాటు కుదురుకోవాలనుకున్నా కూడా చేయాల్సినవి చాలా ఉంటాయి.

ఇక రాజకీయాల్లో నేను వైట్ నీవు బ్లాక్ అని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారు. కానీ జనాలకు తెలుసు ఎవరు బ్లాకో ఎవరు వైటో.ఇక రాజకీయాల్లో ఎన్నో బలహీనతలు ఉంటాయి. వాటిలో అతి పెద్దది అధికార బలహీనత. దాని కోసం ఏమైనా చేయాలనుకుంటారు. కాలం కలసివస్తే అంతా ఓకే. కానీ అది రివర్స్ అయితే మాత్రం తాడే పామై కరుస్తుంది. ఇక దేశంలో తాజాగా చూస్తే ఒక సంచలన సంఘటన జరిగింది.

జార్ఖండ్ సీఎం హేమంత్ కుమార్ సోరెన్ మీద అనర్హత వేటు వేయడానికి రంగం సిద్ధం అయిపోయింది.  ఆయన ఎమ్మెల్యే గిరీ ఇపుడు గాలిలో దీపం మాదిరిగా వేలాడుతోంది.  గవర్నర్ కనుక తలచుకోవాలే కానే  ఆయన దెబ్బకు ముఖ్యమంత్రి సీటు నుంచి కూడా దిగిపోవాల్సి వస్తోంది. ఆయన పక్కా బీజేపీ వ్యతిరేకి. పైగా ఆయన మోడీ మీదనే తన బాణాలను ఎప్పటికపుడు ఎక్కుపెడుతూంటారు. అయితే రాజకీయ కారణాలతో జరిగిందా లేక అవినీతి ఆరోపణల మీద జరిగిందా అంటే అన్నీ కలసే ఆయన కూర్చున చోటకు నీళ్ళు తెచ్చాయనే చెప్పాలి

జార్ఖండ్ సీఎం హేమంత్ కుమార్ సోరెన్ విషయంలో జరిగినది చూస్తే కనుక ఈ దేశంలో సీఎం కుర్చీలను ఎగరగొట్టడం ఇంత ఈజీనా అని అనిపించకమానదు. ఆయన పదవికి అలా ఎసరు తెచ్చిన తరువాత దేశం మొత్తం ఈ ఘటన మీద తర్కించుకుంటోంది. చాలా మంది నాయకులు ఉలిక్కిపడుతున్నారు కూడా. కేంద్రం తలచుకుంటే ఏమైనా చేయగలదు అన్న మాట కూడా వినిపిస్తోంది. ఈ రోజున అవినీతి ఆరోపణల మీద ఉన్న వారు కేసులలో జైలుకు వెళ్ళి వచ్చి బెయిల్ మీద ఉన్న వారూ ఉన్నారు.

దాంతో ఎపుడైనా వారి విషయంలో చేయాలనుకుంటే చేయవచ్చు అలా స్విచ్ వేసినంత డెడ్ ఈజీగా ఈ వ్యవహారం జరిగిపోతుంది అని కూడా అంటున్నారు. ఈ నేపధ్యం ఒక వైపు ఉంటే వైసీపీని పూర్తిగా వ్యతిరేకిస్తున్న రెబెల్ ఎంపీ రాజు గారు అయితే జార్ఖండ్ కి ఏపీకి ముడి పెట్టేశారు. హేమంత్ కి ఏదైనా  జరిగితే జగన్ కి కూడా జరుగుతుందంటూ తనదైన జోస్యం చెప్పేశారు. ఆయన చెప్పేది చూస్తే లాజిక్ బాగానే సరిపోయింది. కానీ అది జరుగుతుందా లేదా అన్నదే చూడాలి.

ఇంతకీ రాజు గారు ఏమి చెప్పారు అంటే హేమంత్ సోరెన్  తనకు తానుగా  తమ సంస్థకు  గనులు కేటాయించుకోవడం ప్రజా ప్రాతినిధ్య  చట్ట ప్రకారం నేరం కాబట్టి ఆయన మీద అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఏకంగా ఆ రాష్ట్ర గవర్నర్ కి సూచించింది. దీని మీద గవర్నర్ కనుక నిర్ణయం తీసుకుంటే హేమంత్ మాజీ సీఎం అయిపోతారు. అంతే కాదు జార్ఖండ్ లో సర్కార్ కుప్పకూలడం ఖాయం. మరి ఏపీ సీఎం జగన్ ఏం చేశారు అంటే దానికి కూడా అనేక వివరాలు ఈ రెబెల్ ఎంపీ రాజు గారు చెబుతున్నారు.

సోరేన్ మీద వేటు పడితే జగన్ విషయంలో కూడా అదే తరహా ట్రీట్మెంట్ ఉంటుందా అంటే అవును అనే అంటున్నారు. జగన్ గుంటూరు జిల్లాలో తన కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ కి అనుమతులు ఇచ్చుకోవడాన్ని రాజు గారు ప్రస్థావిస్తున్నారు. అలాగే తన కుటుంబానికి చెందిన సాక్షి దిన పత్రికకు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చుకోవడం కూడా గుర్తు చేస్తున్నారు.

హేమంత్ కి జరిగినట్లే జగన్ కి కూడా జరిగితీరుతుందని రెబెల్ ఎంపీ రాజు గారు అంటున్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం సోరెన్ తప్పు చేశారని భావిస్తే అంతకంటే పెద్ద తప్పు జగన్ చేశారని రాజు గారు అంటున్నారు. జగన్ సీఎం గా ఉంటూ సొంత కంపెనీ అయిన సరస్వరి పవర్స్ కి అనుమతులు ఇచ్చుకోవడం, తన దిన పత్రికకు ప్రకటన రూపంలో భారీగా సర్కార్ సొమ్ము ఇవ్వడం కూడా నేరమే అని ఆయన నిర్ధారిస్తున్నారు.

అయితే రాజు గారు చెప్పేది లాజిక్ గా కరెక్ట్ కానీ సోరెన్ విషయంలో రాజకీయం కూడా ఉంది. ఆయన బీజేపీని మోడీని ఎదిరించి నిలబడ్డారు. కాబట్టి ఆయన టార్గెట్ అయ్యారు అన్న మాట ఉంది. అదే జగన్ అయితే కేంద్రంతో బాగా సఖ్యతగా ఉన్నారు. అయితే సోరేన్ కేసు చూపించి ఎవరైనా కోర్టుకు వెళ్తే కొంత ఇబ్బంది వస్తుంది. కానీ ఇక్కడ జగన్ విషయంలో చర్యలు తీసుకోవాల్సింది వ్యవస్థలు. మరి కేంద్రం తో జగన్ సఖ్యతగా ఉన్నంతవరకూ ఆ వ్యవస్థలు కూడా కేంద్రాన్ని దాటి పోలేవని అంటున్నారు. అందువల్ల జగన్ కి ప్రమాదం లేదని అన్న వారూ ఉన్నారు.

అయితే సోరెన్ వ్యవహారం జగన్ని మరింతగా బీజేపీకి బద్ధుడు అయ్యేలా చేస్తుందని, అలాగే ప్రత్యర్ధులు ఎంతో కొంత చెడుగుడు ఆడేందుకు కూడా వీలు కల్పిస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి సోరెన్ కధ ఎక్కడ ఎలా ముగుస్తుందో. జగన్ కధకు ఎవరు ఎలా ఎపుడు తెర తీస్తారో. అంతిమంగా కేంద్రం ఏమి చేస్తుందో. ఇపుడు చూస్తే కేంద్ర పెద్దల వద్దనే ఎవరి జాతకం అయినా ఉందనే చెప్పాలి.
Tags:    

Similar News