తెలంగాణ పాలిటిక్స్ లో షర్మిల ఉందని గుర్తించండి!

Update: 2021-07-17 08:32 GMT
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ షర్మిల ఉనికి కోసం పోరాడుతున్నారా? తెలంగాణ రాజకీయ ప్రధాన పక్షాలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అసలు ఆమెను లెక్కలోకి తీసుకోవడం లేదా? అందుకే మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేస్తోందా? అయినా ఆమెను ఎవ్వరూ కనీసం ఖాతరు చేయడం లేదా? ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాలు చూస్తే అసలు ‘షర్మిల’ రాజకీయ కూరలో కరివేపాకుల తీసేస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది.

ఇటీవల మీట్ ది ప్రెస్ లో వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. ‘అసలు కేటీఆర్ ఎవర?’ అంటూ షర్మిల ప్రశ్నించడం మీడియా, ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇక అంతటితో ఊరుకోకుండా కాంగ్రెస్ పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ ను అమ్ముడుపోయిన పార్టీ’గా విమర్శించారు. రేవంత్ రెడ్డిపై దుమ్మెత్తిపోశారు. తన పై మీడియా ఫోకస్ ఉండాలని... టీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల నేతలు తనని పట్టించుకోని కౌంటర్లు ఇవ్వాలని షర్మిల ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. తెలంగాణ రాజకీయాల్లో తన ఉనికిని అధికార, ప్రతిపక్షాలకు గుర్తు చేయాలనే షర్మిల ఈ వ్యాక్యలు చేసినట్టు అర్థమవుతోంది.

అయితే షర్మిల విమర్శలకు అటు కేటీఆర్, టీఆర్ఎస్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం గమనార్హం. అసలు షర్మిలను టీఆర్ఎస్ గుర్తించడం లేదు.. విమర్శించిన పాపాన పోలేదు. అయితే రేవంత్ రెడ్డి కూడా అదే మాట అనేసి అసలు కూరలో కరివేపాకులా షర్మిలను తీసేశారు.

‘అసలు షర్మిల పెట్టింది రాజకీయ పార్టీ కాదని.. అదో ఎన్జీవో సంస్థ అని.. అందువల్లే షర్మిల వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదని’ రేవంత్ రెడ్డి గాలితీసేశారు. రాజకీయ పార్టీల నేతలు స్పందిస్తే మాట్లాడుతానని.. షర్మిల మాట్లాడితే పట్టించుకోమన్నారు. ఇక మీడియా ప్రతినిధులు కూడా ఆ ఎన్జీవో సంస్థను, షర్మిలను పట్టించుకోకుంటే తెలంగాణకు మేలు జరుగుతుందని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు షర్మిల పరువుతీసేలా ఉన్నాయి.

ఇక షర్మిలకు అన్న జగన్ తో పడడం లేదని.. జగన్ ఆదరణ లేకపోవడంతోనే ఆ కోపాన్ని తమపై తీర్చుకుంటోందని ఆమె బ్యాక్ గ్రౌండ్ ను కెలికేసి రేవంత్ రెడ్డి ఎండగట్టారు. ఆమెను పట్టించుకోమంటూనే రేవంత్ రెడ్డి ఆమె గాలితీసేలా మాట్లాడిన విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి.

షర్మిల పై ప్రధానంగా ఆంధ్రా ముద్ర ఉండడమే పార్టీలు ఆమెను పట్టించుకోకపోవడానికి కారణంగా చెప్పొచ్చు. స్వయానా ఏపీ సీఎం జగన్ చెల్లెలు కావడం.. కడపలో పుట్టడం.. ఆంధ్రా ఆడబిడ్డగా తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వడమే ఆమె పార్టీకి ఆదరణ లేకపోవడానికి కారణం అవుతోంది.  అందుకే ఆంధ్రా పేరు చెప్పి మిగతా తెలంగాణ రాజకీయ పక్షాలు షర్మిలను అవైడ్ చేస్తున్నాయి. ఆమెపై ఆంధ్రా ముద్ర వేసి రాజకీయాన్ని కొనసాగిస్తున్నాయి. తెలంగాణలో అందరూ తిట్టుకుంటూ షర్మిల తిడుతున్నా పట్టించుకోకపోవడం ఆమెకు పుండు మీద కారం చల్లినట్టైంది. మీడియా కూడా షర్మిలను అవైడ్ చేస్తే ఇక ఎంత రాజకీయం చేసినా ‘ఫాఫం.. షర్మిల’ అని అందరూ అనుకోవాల్సిన పరిస్థితి రావచ్చేమో.. !

Tags:    

Similar News