ఏడుకొండలపై ఎర్ర బంగారం వేట

Update: 2015-04-07 23:30 GMT
ఎర్రచందనం.. రక్తచందనం... కొద్ది నెలలుగా ఈ పేరు అందరి నోటా వినిపిస్తోంది.. నిజానికి ఇదేమీ కొత్తది కాకపోయినా ఆంధ్రప్రదేశ్‌ లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తరువాత ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిరోధంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి... దాన్ని రాష్ట్రానికి ఆదాయవనరుగా మార్చుకోవాలని అనుకోవడంతో ఇది అత్యంత ప్రాధాన్యాంశంగా మారింది.ఎర్రచందనానికి వివిధ అవసరాల రీత్యా అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉండడం... డిమాండ్‌ కు తగ్గట్లుగా నిల్వలు లేకపోవడంతో ధర కూడా ఎక్కువగా ఉంటుంది. దీని విక్రయానికి కూడా అనేక నిబంధనలు ఉండడంతో ప్రభుత్వాలు కూడా అంత ఈజీగా విక్రయించి సొమ్ము చేసుకోలేకపోతున్నాయి. ఈ నిషేధం... కఠిన నిబంధనలే... స్మగ్లర్లకు వరంగా మారి వేల కోట్లు కురిపించాయి. గత పదేళ్ల కాంగ్రెస్‌ పాలనతో ఎర్రచందనం స్మగ్గింగ్‌ చాపకింద నీరులా విస్తరించి ఒక మల్లీనేషనల్‌ కంపెనీలా మారిపోయింది. చెట్లను అక్రమంగా నరకడం నుంచి దాన్ని రవాణా చేయడం.. ఓడల్లో విదేశాలకు తరలించడం వరకు వ్యవస్థీకృతంగా అక్రమ దందా సాగుతోంది. ఇందులో ఏ స్థాయిలో ఆటంకం ఎదురైనా వారు నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసే స్థాయికి ఈ వ్యవహారం చేరింది. గతంలో అటవీ అధికారులు కూడా స్మగ్లర్ల చేతిలో ప్రాణాలు కోల్పోయారు.  అలాంటి స్మగ్లింగ్‌ ను నిరోధించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఒకరకంగా విజయవంతమైంది. స్మగర్ల నుంచి స్వాధీనం చేసుకున్న వేల టన్నుల ఎర్రచందనాన్ని వేలం వేసి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ చాలావరకు తగ్గింది. స్మగ్లర్లపై దాడులు పెరిగాయి. దీంతో చిత్తూరు, కడప జిల్లాల్లోని బడా స్మగ్లర్లు... తమిళనాడు, కర్ణాటకల్లోని స్మగ్లరకు కాళ్లు చేతులు కట్టేసినట్లయింది.

    తాజాగా చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంశేషాచల అటవీ ప్రాంతంలో మంగళవారం వేకువన భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. తిరుమల కొండపై శ్రీవారిమెట్టు సమీపంలోని ఈతగుంట, టీగితీగలకోన వద్ద కూంబింగ్‌ నిర్వహిస్తున్న ప్రత్యేక పోలీసు దళం, అటవీశాఖ సిబ్బందిపై ఎర్రచందనం దొంగలు దాడిచేయడంతో ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో 20 మంది ఎర్రచందనం దొంగలు చనిపోయారు. మృతులంతా తమిళనాడుకు చెందినవారే అంటున్నారు. ఎర్రదొంగల దాడిలో కొందరు పోలీసులు కూడా గాయపడ్డారు. భారీ ఎన్‌ కౌంటర్‌ కావడంతో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. దీనిపై మెజిస్టీరియల్‌ విచారణకూ ఆదేశించారు.  అంతేకాదు.... భారీ ఎన్‌ కౌంటర్‌ కావడంతో ప్రభుత్వ వర్గాల్లోనూ ఒక్కసారిగా కలకలం రేగింది. డీజీపీ సీఎం చంద్రబాబు ఈ సంఘటనపై వివరణ ఇవ్వగా... చంద్రబాబు గవర్నరుకు ఫోన్‌ చేసి సంఘటనను వివరించారు.


తమిళనాడులో తీవ్ర ఆగ్రహం..

    మరోవైపు ఎర్ర చందనం స్మగ్లర్ల ఎన్‌కౌంటర్‌ పై తమిళనాడులోని రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నాయి. ఎన్‌కౌంటర్‌పై సమగ్ర దర్యాప్తుకు ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగోతో పాటు తమిళ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. పోలీసులే ఏకపక్షంగా కాల్పులు జరిపారని వైగో ఆరోపించారు.



మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం మంగళవారం చిత్తూరు ఎన్‌కౌంటర్‌పై  అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఎర్రచందనం కూలీల వివరాల కోసం తమిళనాడు పోలీసులు తిరుపతి రానున్నారు.ఈ ఎన్‌ కౌంటర్‌ ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమవుతోంది.

    ఘరానాగా స్మగ్లింగ్‌...

ఎన్‌ కౌంటర్లంటే మావోయిస్టులు, ఉగ్రవాదులు వంటివారిని హతమార్చడం తెలుసు... కలప దొంగలను ఇంతమందిని ఎన్‌ కౌంటర్‌ చేశారంటే ఎర్రచందనం ఇష్యూ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. అసలు ఎర్రచందనం కథేంటి... దాని విలువేంటి... స్మగ్లింగు ఎలా చేస్తారు... వాళ్ల ఆగడాలేంటి.. నిబంధనలేమిటి.. ఇలా ప్రతివిషయమూ ఆసక్తికరమే.

    ఎర్రచందనమంటే బంగారు కడ్డీయే..

    ప్రపంచంలోనే అత్యంత విలువైన వృక్షం ఎర్ర చందనం. మన రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లోని అడవుల్లో ఈ చెట్లు ఉంటాయి. శేషాచల, వెలుగొండ అటవీ ప్రాంతంలో సుమారు అయిదు లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతంలో ఈ చెట్లున్నాయి.  40ఏళ్లకు పైబడిన చెట్లే ఉపయోగపడతాయి. ఒక్కో చెట్టు రూ.8 లక్షలు అంతకంటే ఎక్కువ ఖరీదు చేస్తాయి.  తమిళనాడులోని తిరువళ్లూరు, వేలూరు, కృష్ణగిరి, ధర్మపురి, తిరువణ్నామళై, కాంచీపురం జిల్లాల్లో ని పలు గ్రామాల్లో ప్రజలు ఎర్రచందనం చెట్లను నరకడంలో నిపుణులు... ఆ ఊళ్లలో కొన్ని వేల మంది ఇదే వృత్తిలో ఉన్నారు. వీరి కార్యక్షేత్రం మన రాష్ట్రంలోని శేషాచలం అటవీప్రాంతం.  శేషాచలం అడవుల పక్కనే ఉన్న చిత్తూరు జిల్లా గంగవరం, ఐరాల, పలమనేరు, పంజాణి, సోమల, చంద్రగిరి, పాకాల, యర్రావారిపాళెం, శ్రీకాళహస్తి, ఏర్పేడు, కేవీబీ పురం, కేవీ పల్లి, పిచ్చాటూర్‌.. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, రాపూరు, దక్కలి గ్రామాల్లో చాలామందికీ ఇదే ప్రధాన వృత్తి.

    విదేశాల్లో విపరీతమైన గిరాకీ...

    ఎర్ర చందనానికి చైనా, జపాన్‌, దుబాయిలలో విపరీతమైన గిరాకీ ఉంది. గృహోపకరణాలతో పాటు వాయిద్యాల తయారీకి, అద్దకాలకు వినియోగిస్తారు. కొన్ని రకాల ఔషధాల తయారీలో ముడి సరుకుగానూ దీన్ని ఉపయోగిస్తారు. ఇళ్లల్లో ఉంచితే మంచిదని భావిస్తారు. చెన్నైలో ఎర్రచందనం కిలో ధర రూ.2 వేలకు పైగా పలుకుతుంది... ఇంటర్నేషనల్‌ మార్కెట్లో దీని ధర రూ.5 వేల పైనే. అందుకే దీన్ని ఎక్కువగా విదేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటారు. చెన్నై, మంగుళూరు, కాండ్ల, ముంబయి ఓడ రేవుల నుంచి ఎగుమతి చేస్తారు.

    ఎర్ర చందనం చెట్లు నరకడం, రవాణా చేయడం మన దేశంలో నేరం. కానీ పోలీసులు, రాజకీయ నాయకులతో కలిసి స్మగ్లర్లు ఈ విలువైన కలపను దేశం దాటిస్తున్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలో ఏ రోజు వెతికినా ఎర్రచందనం చెట్లు కొట్టే కూలీలు కనీసం వెయ్యి మంది కనిపిస్తారట.... అక్కడున్న ఎర్రచందనం సంపద ఏ స్థాయిలో ఉందన్నదే కాదు... దాన్ని ఎంతలా నరికేస్తున్నారో కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.


రోజు కూలి రూ. 5 వేలు...

    దేశంలో ఎంత కష్టమైన పనిచేసినా కూలి వెయ్యి రూపాయలకు మించి గిట్టుబాటు కాదేమో... మన దేశంలోనే కాదు.... ప్రపంచంలో శ్రామిక వర్గాలకు పెద్దపీట వేసే కమ్యూనిస్టు దేశాల్లో కూడా ఇంతకుమించి దొరకదు. ఉన్నతోద్యోగాలు చేస్తేనో... వ్యాపారం చేస్తేనో మాత్రమే నెలకు రూ.లక్ష కంటే ఎక్కువ సంపాదించగలం. కానీ ఎర్రచందనం కూలీలకు మాత్రం రోజుకు రూ.5 వేలు సంపాదించడమన్నది చాలా ఈజీ..  ఎర్రచందనం చెట్లను కొట్టే కూలీల్లో ఎక్కువ మంది తమిళనాడుకు చెందినవారే. అడవి చెట్టుకొట్టి దుంగలు భుజాన వేసుకుని 5 నుంచి 25 కిలోమీటర్ల దూరంలోని రోడ్డు దగ్గరకు దుంగలను చేర్చడం వరకు కూలీదే బాధ్యత. ఈ పని చేయడానికి వీరికి దూరం బట్టి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఒక్క రోజు కూలీగా గిట్టుబాటవుతుంది. అంటే ఎర్రచందనం  స్మగ్లింగ్‌ ఎంత పెద్ద వ్యాపారమో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.  నెలలో సగం రోజులు పనిచేసినా రూ.75 వేల నుంచి రూ.లక్ష సంపాదిస్తారు కూలీలు. పైగా వీరు పనిచేసే చోటికే భోజనం.. మద్యం కూడా పంపిస్తారు.

రవాణా ఇలా...

    అడవిలోపల ఉన్న చెట్లను కొట్టి రోడ్డుకు సమీపంలోకి కూలీలు తెచ్చి వేసిన దుంగలను రోడ్డు మార్గంలోనే రకరకాల వాహనాల్లో దొంగతనంగా చెన్నై చేర్చుతారు. చెక్‌ పోస్టులు మద్యలో ఉన్నప్పటికీ అన్ని చోట్లా లంచాలు ఇస్తుండడంతో  వీటి రవానాకు అడ్డుండదు. ఇలా చెన్నైకు సరకు చేరిన తరువాత దళారుల నుంచి వ్యవహారం పెద్ద స్మగ్లర్ల వద్దకు వస్తుంది. అక్కడ పోర్టులో వీరితో టై అప్‌ ఉన్న అధికారుల సహాయంతో ఎలాంటి చెకింగులు లేకుండా ఓడెక్కుతాయి.



ఇటీవల ప్రభుత్వం సీరియస్‌ గా తీసుకోవడంతో పోలీసు, అటవీశాఖ అధికారులు కొందరు మామూళ్ల వసూలుకు తెరదించి అక్రమ రవాణాను కొంత అడ్డుకుంటున్నారు. దీంతో ఇటీవల కాలంలో స్మగ్లర్ల అరెస్టులూ పెరిగాయి. అయితే...  ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నిరోధానికి సంబంధించి ఇంతవరకు పదునైన చట్టాలు లేకపోవడంతో పట్టుబడినా బయటపడుతుంటారు. మళ్లీ అదే దందా మొదలు పెడతారు. గత పదేళ్ల కాలంలో దీనికి అడ్డూ అదుపూ లేకపోవడంతో బడా బాబులు, రాజకీయ నాయకులు, స్మగ్లర్లు ఎర్రచందనం అక్రమ రవాణాను ఒక బిజెనెస్‌ లా భావిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. స్మగ్లింగులో కూలీలు కూడా చాలా కరడుగట్టి ఉంటారు. వారిని అటవీ సిబ్బంది అడ్డుకుంటే గొడ్డళ్లతో దాడి చేసిన సందర్భాలు... చంపిన సందర్భాలూ ఉన్నాయి.

ఘరానా దొంగ గంగిరెడ్డి...

ఎర్రచందనం అనగానే ఠక్కున స్ఫురించే పేరు గంగిరెడ్డి. ఈయన బడా ఇంటర్నేషనల్‌ స్మగ్లర్‌. కడపజిల్లకు చెందిన ఈయనకు పెద్దపెద్దోళ్ల అండ ఉంది. ఇటీవల శ్రీలంకకు జారుకోబోతూ

మలేషియాలో దొరికిపోయాడు. బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆయన్ను ఇక్కడకు రప్పించేందుకు మన రాష్ట్ర పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబుపై అలిపిరి వద్ద జరిగిన దాడి కేసులో గంగిరెడ్డి నిందితుడు.   


స్మగ్లర్ల ఆగడాలు...

ఎర్రచందనం స్మగ్లర్లు ఎంతకైనా తెగిస్తారు.. అందరూ బడాబాబులే కావడంతో వారి అండతో కూలీలూ రెచ్చిపోతారు. అలా ఎర్రచందనం స్మగ్లర్లు ఎన్నో ఆగడాలకు తెగబడ్డారు. వాటిలో కొన్ని...

- 2012లో చామల రేంజ్‌లోని భాకరాపేట కనుమలో అటవీశాఖ సిబ్బందిని బంధించి తీవ్రంగా కొట్టారు.

-  2013 డిసెంబరులో అటవీ శాఖ అధికారులు డేవిడ్‌ కరుణాకర్‌, శ్రీధర్‌లను ఎర్రచందనం స్మగ్లర్లు చంపేశారు. మరో ముగ్గురు అటవీ శాఖ సిబ్బందిని తీవ్రంగా గాయపరిచారు

- శ్రీకాళహస్తిలో ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ను లారీతో ఢీకొట్టి చంపేశారు.

- టాస్క్‌ఫోర్స్‌కు చెందిన డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ మల్లికార్జునను లారీతో ఢీకొట్టి చంపేశారు.

- ఎర్రస్మగ్లర్లను వెంటాడే క్రమంలో ఎందరో అటవీ అధికారులు, పోలీసులు గాయపడ్డారు. గొడ్డళ్ల దెబ్బలు తిన్నారు.


Tags:    

Similar News